– తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్
తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో వివిధ పార్టీలు చేనేత పరిశ్రమ, రక్షణ, కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం మేనిఫెస్టోలో చేర్చాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ కోరారు. గురువారం తెలంగాణ చేనేత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా ఆఫీసు బేరర్స్ సమావేశం దొడ్డి కొమురయ్య భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ ప్రతి చేనేత మగ్గం ఉన్న చేనేత కార్మికుడికి రూ.10 లక్షలు పెట్టుబడి సహాయం చేనేత బంధు ప్రకటించాలని కోరారు. చేనేత సహకార సంఘాల ఎన్నికలు జరిపి సంఘాల బలోపేతానికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని,చేనేత సహాకార సంఘాల కార్మికుల రుణాలను మాఫీ చేయాలని కోరారు.తెలంగాణ రాష్ట్రంలో చేనేత వస్త్రాల ఉత్పత్తి, కేంద్రం ఏర్పాటు, చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన వస్త్రాలను కొనుగోలు చేయడం కోసం ప్రభుత్వమే ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల తరహాలో చేనేత వస్త్ర కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి కావలసిన వస్త్రాలను చేనేత కార్మికుల ద్వారా ఉత్పత్తి చేయించాలని, చేనేతపైన ఉన్న జీఎస్టీ ని రద్దు చేయాలి, చేనేత సహకార సంఘాలకు ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టొద్దని అన్నారు. చేనేత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద భీమా, జీవిత భీమా, ఇల్లు, వర్క్ షెడ్డు నిర్మాణం కొరకు రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు రెండు వందల యూనిట్లు విద్యుత్తు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలన్నింటినీ వివిధ రాజకీయ పార్టీలన్నీ మేనిఫెస్టోలో చేర్చాలని కోరారు.ఈ సమావేశంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కందగట్ల గణేష్, సంఘం సీినియర్ నాయకులు కర్నాటి లింగయ్య, జిల్లా సహాయ కార్యదర్శి ఆలుగొండ మధు, జిల్లా నాయకులు ఏల శ్రీనివాస్, గడ్డం దశరథ, జిల్లా దేవదానం , రాపోలు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.