– టెహ్రాన్ నివాసంపై ఇజ్రాయిల్ దాడి…?
టెహ్రాన్ : ఇజ్రాయిల్‌తో పోరాటం చేస్తున్న హమాస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో బుధవారం జరిగిన దాడిలో హమాస్ అగ్ర నేత ఇస్మాయిల్ హనియా చని పోయారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన మరునాడే టెహ్రాన్‌లోని హనియా నివాసంపై దాడి జరిగింది. ఈ దాడిలో హనియా(62)తో పాటు అయన అంతరక్షకుడు కూడా చనిపోయాడని హమాస్ ధృవీకరించింది. ఇది ఇజ్రాయిల్ పనేనని ఆరోపించింది. యూదుల రాజ్య స్థాపన కోరుకుంటున్న వ్యక్తే ఈ దాడి చేశాడని తెలిపింది. హనియా ముగ్గురు కుమారులు ఏప్రిల్‌లో గాజాలో ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. హనియా 1963లో గాజాలోని ఓ శరణార్థి శిబిరంలో జన్మించారు. 1987లో హమాస్‌లో చేరారు. అందులో అంచెలంచెలుగా ఎదిగి 2017లో అగ్రస్థానానికి చేరారు. హమాస్ వ్యవస్థాపకుడు షేక్ అహ్మద్ యాసిన్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు. గాజా నగరంలోని ఇస్లామిక్ యూనివర్సిటీలో హనియా విద్యాభ్యాసం చేశారు. 1980, 1990 దశకాలలో పలు సందర్భాలలో ఇజ్రాయిల్‌లో జైలు జీవితం గడిపారు. 1992లో వందలాది మందితో సహా ఆయనను అరెస్ట్ చేసి గాజా నుండి లెబనాన్‌కు పంపారు. ఆ మరుసటి సంవత్సరమే ఆయన గాజాకు తిరిగి వచ్చారు.
సున్నీ ముస్లిం అయిన హనియా హమాస్‌లో పోరాట శక్తిని పెంచేందుకు తీవ్ర కృషి చేశారు. ఇరాన్‌తో సంబంధాలు నెలకొల్పుకున్నారు. అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించి ఇరాన్ వెళ్లి ఖమేనీతో సమావేశమయ్యారు. 2006 ఎన్నికల్లో హమాస్ విజయం సాధించడంతో పాలస్తీనా అథారిటీకి ప్రధాని అయ్యారు. అయితే 2007లో అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ఆయనను పదవీచ్యుతుడిని చేశారు. ప్రయాణ ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు ఇస్మాయిల్ హనియా టర్కీ, ఖతార్ రాజధాని దోహా మధ్య తిరిగేవారు. హనియా కుమారులు హజమ్, అమిర్, మహమ్మద్ ప్రయాణిస్తున్న కారుపై ఏప్రిల్ 10న ఇజ్రాయిల్ వైమానిక దాడి జరిపింది. ఆ దాడిలో వారు ముగ్గురు చనిపోయారు. మధ్య గాజాలో ఉగ్రవాద కార్యకలాపాల కోసం వీరు వెళుతున్నారని ఇజ్రాయిల్ రక్షణ దళాలు అప్పట్లో ఆరోపించాయి.