సంతోషం సగం బలం

Happiness is half the strength‘సంతోషం సగం బలం’ అనేది ఓ సామెత. మనిషి సంతోషంగా వున్నప్పుడు తనకు తెలియకుండానే అదనపు బలం చేకూరుతుంది. ఏ పనైనా సులభంగా చేయగలుగుతాడు. అందుకే మనో వైజ్ఞానికులు ‘ఇష్టపడి చేసేపని ఎంత కష్టమైనదైనా సులభంగా చేయగలుగుతాడు. ఇష్టం కాని పనిని చాలా కష్టంగా చేయవలసి వస్తుంది’ అంటారు. సంతోషం ఒక మనోభావన.
సంతోషానికి, ఆనందానికి మన శరీర భాగాల్లో స్రవించే రసాయనాలే కారణం. వీటినే జీవ రసాయనాలు, హార్మోన్లుగా పిలుస్తారు. ఇవి గ్రంధుల ద్వారా స్రవించి రక్తంలోకి పంపిణీ చేయబడతాయి. సూక్ష్మమోతాదులో ఉత్పత్తి అయినప్పటికీ వీటి ప్రభావం వల్ల వ్యక్తిలో అనేక మార్పులకు కారణంగా పనిచేస్తాయి. సెరోటోనిన్‌, డోపమైన్‌ అనే హార్మోన్లు మనలో సంతోషం కలిగిస్తాయి. అందుకే ఈ జీవ రసాయనాలను ‘ఫీల్‌ గుడ్‌’ హార్మోన్లుగా పిలుస్తారు. అదే ఒత్తిడి, బాధలను కలుగజేయడానికి ‘కార్టిసోల్‌’ అనే జీవరసాయనం కారణం అంటారు.
సెరోటోనిక్‌, డోపమైన్‌ అనే హ్యాపీ హార్మోన్ల గురించి కొంత తెలుసుకోవడం వల్ల ప్రతి వ్యక్తిలో సైకాలజీ జ్ఞానం కలగడానికి వీలవుతుంది అంటారు మనోవైజ్ఞానికులు.
‘సెనోటోనిన్‌’ అనేది శరీర భాగాల్లో ఉత్పత్తయ్యే ఒక రసాయనం. ఇది మూడ్‌, మానసిక స్థితి కలుగడానికి కేంద్రీయనాడీ వ్యవస్థలో ఉత్పత్తి అయి మనం సంతోషంగా, ప్రశాంతంగా వుండడానికి ఉపయోగపడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. నిరాశ, ఆందోళన చెందకుండా సహాయపడుతుంది. మన జీర్ణక్రియలు సాఫీగా జరగడానికి ఉపయోగపడతాయి. ఒక విధంగా మన ఆరోగ్యానికి శ్రీరామరక్ష. రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది.
‘డోపమైన్‌’ కూడా సెరోటోనిక్‌ లా ఉత్పత్తి అయ్యే హార్మోన్‌. నాడీవ్యవస్థ మధ్య సందేశాలు, సంకేతాలను పంపడానికి ఉపయోగపడతాయి. అందుకే ఈ హార్మోన్‌ను రసాయనిక దూతగా పిలుస్తారు. ఈ రసాయనం కూడా మొదటి దానిలాగే సంతోషం, ఆనందాలను అనుభూతించడానికి సహాయపడుతుంది. మనిషిలో ఆసక్తి గలగడానికి ప్రేరణగా నిలుస్తుంది. వీటిని అనుభూతి రసాయనాలుగా పిలుస్తుంటారు.
ఈ జీవరసాయనాల లెవెల్స్‌ శరీరంలో తక్కువైనప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు, నిద్రలేమి, ఒత్తిడి, జీవక్రియలు నెమ్మదించడం వంటివి పుట్టుకొచ్చి లైఫ్‌ స్టైల్‌ ఛిన్నాభిన్నమయ్యే అవకాశం వుందంటున్నారు పోషకాహార నిపుణులు.
అందుకే సెరోటోనిక్‌, డోపమైన్‌ సహజరీతిలో ఉత్పత్తి అవడానికి మనం కొన్ని నియమాలు పాటించడం అవసరం.
ఈ ఫీల్‌ గుడ్‌ కెమికల్స్‌ పెరగడానికి అటు మనోవైజ్ఞానికులు, ఇటు వైద్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
– ఎప్పుడూ మనల్ని మనం ఏదో ఓ పనిలో నిమగమయ్యేట్టు ప్రయత్నించాలి. దీనివల్ల మన శరీర అవయవాలు ఆక్సిజన్‌ (ప్రాణవాయువు) ఎక్కువ శాతం గ్రహించడానికి వీలవుతుంది.
– వ్యాయామం, సైకిల్‌ తొక్కడం, చెప్పులు లేకుండా ఆరుబయట వేగంగా నడవడం, బరువులు ఎత్తడం వంటివి చేస్తుంటే ఫీల్‌గుడ్‌ కెమికల్స్‌ ఒకస్థాయిలో పెరిగే అవకాశం వుంటుంది.
– యోగా, ధ్యానం, మైండ్‌ఫుల్‌నెస్‌ వంటి కార్యక్రమాల్లో ప్రతినిత్యం పాలుపంచుకునే ప్రయత్నం చేయాలంటారు.
– ఎంత అనారోగ్యంతో బాధపడుతున్నా సాధ్యమైనంత వరకు ఉదయం త్వరగా లేవడానికి అలవాటు పడాలి. చేతనైనంత సేపు సులభ శారీరక వ్యాయామాలు చేస్తుండడం వల్ల మనసులో కొంత సంతృప్తి, సంతోషం కలుగుతుంది.
– ఉదయం, సాయంత్రం ప్రకృతిలో తిరుగుతుండడం వల్ల ప్రకృతి సిద్ధంగా ‘విటమిన్‌ డి’ లభిస్తుంది.
ఈ ఫీల్‌గుడ్‌ కెమికల్స్‌ పెరగడానికి కొన్ని ఆహార పదార్థాలు నియమానుసారంగా తీసుకోవాలంటున్నారు ఆహార నిపుణులు. సాధ్యమైనంత వరకు జీర్ణక్రియ మీద ఒత్తిడి కలిగించే ఆహారపదార్థాలు తీసుకోకుండా వుండడమే మంచిది. కూరగాయలు, చేపలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మీద ఎక్కువ బరువు పడకుండా వుంటుంది. ఆకలి వేసినప్పుడే ఆహారం తీసుకుంటుండాలి. ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌ తప్పనిసరిగా తీసుకోవాలి. అప్పుడప్పుడు పండ్లు, కూరగాయల జ్యూస్‌ తీసుకోవడం వల్ల అదనపు ద్రవం లభిస్తుంది. తాజాపండ్లు, బొప్పాయి, నిమ్మ, బత్తాయి వంటివి తీసుకుంటుండాలి. పీచుపదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరగడమే కాకుండా మలబద్దకం దరికి చేరదు. ఈ మధ్య డ్రైఫ్రూట్స్‌ వినియోగం బాగా పెరిగింది. బాదం, కిస్‌మిస్‌, ఖర్జూరాలు, జీడిపప్పు వంటివి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయంటున్నారు. నీరు శారీరక అవసరాలకు తగ్గట్టు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది.
ఏ పని చేసినా పాజిటివ్‌గా (సానుకూలంగా) చేస్తుండాలి. అప్పుడే ఈ ఫీల్‌గుడ్‌ కెమికల్స్‌ మన ఆరోగ్యానికి దోహదపడతాయి. నెగిటివ్‌ ఆలోచనలతో ఒత్తిడి పెరిగి, మానసిక ఆందోళనలు మొదలవుతాయి. మానసికంగా ఎంత సంతోషంగా, సంతృప్తిగా వుంటామో మన ఆరోగ్యం అంత బాగుంటుంది. ఏ జబ్బూ మన దరి చేరదు. మంచి స్నేహాలు, మానవ సంబంధాలు దృఢంగా వుంచుకోవడం మరవకూడదు. అప్పుడే ఒంటరితనం మన దరిచేరదు.
నిత్యం సంతోషంగా, ఆనందంగా వుందాం. మన శారీరక, మానసిక ఆరోగ్యాలను కాపాడుకుందాం.
– పరికిపండ్ల సారంగపాణి, 9849630290,