యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ మరియు భువనగిరి పట్టణం గంజ్ లోని ప్రభుత్వ బాలుర బాలికల పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో పాఠశాలలో బాలల దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్యామసుందర్ మాట్లాడుతు బాల బాలికలు రేపటి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బాధ్యతతో చదువుపై తగిన శ్రద్ధ వహించి పురోభివృద్ధి సాధించాలన్నారు. సమాజంపై అవగాహన పెంచుకొని అప్రమత్తతో ఉండాలని, ఇంటర్నెట్ సేవలను మంచికి ఉపయోగించుకోవాలని తెలిపి బాలల హక్కులు, విద్యా హక్కు చట్టం బాలకార్మిక నిర్మూలన, వివాదాల పరిష్కార పద్దతి, హెల్ప్ లైన్ నంబర్లు 15100, 1098, 100ల గురించి వివరించారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షులు బి. హరినాథ్ మాట్లాడుతూ బాలలు దేశ సంపదని గ్రామ స్థాయిలో వివిధ పనులలో ఉంచి వారి ప్రగతిని శూన్యం చేయొద్దని తెలిపారు. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎస్. జైపాల్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జి. శంకర్ మాట్లాడుతూ న్యాయ సహాయం కావాల్సిన వారు కోర్టు భవన ప్రాంగణంలో ఉన్న న్యాయ సహాయ, సలహా కేంద్రాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యురాలు రేణుక, ఇంచార్జ్ ఉపాధ్యాయులు ప్రభాకర్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు అనేక రంగాలలో ప్రోత్సాహమిస్తూ వారి అభివృద్ధికి పాటు పడుతున్నట్లు తెలిపారు. బాలల దినోత్సవం సందర్బంగా బాలలకు ” బాల కార్మిక నిర్మూలన – విద్యార్థి పాత్ర ‘ అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి వారికి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ మెమెంటోలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, బాలలు పాల్గొన్నారు.