నూతన సంవత్సర వేడుకలను మండల ప్రజలు ఆనంద ఉత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. సోమవారం తెల్లవారుజాము నుండి మహిళలు వాకిలి ఓడ్చి కల్లాపు చల్లి కొని ఉంచుకున్న రంగులతో ముగ్గులను వేసి రంగులు అద్దారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా చంటి పాపాలను పట్టుకొని కూడా లాలిస్తూ ముగ్గులు వేయడం వాటికి రంగులు అద్దడం లో నూతన సంవత్సర ఆనంద ఉత్సాహాలు వెల్లివిరిశాయి. ముందు నుండి స్నేహితులు బంధుమిత్రులు సోషల్ మీడియా ద్వారా ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అధికారులు రాజకీయ నాయకులు కుల సంఘాల పెద్దలు మహిళా సంఘాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ క్యాలెండర్లు పంపిణీ చేశారు. మరో అడుగు ముందుకేసి పెద్ద పెద్ద బ్యానర్లు నూతన సంవత్సర శుభాకాంక్షలు పేరుతో ఏర్పాటు చేసి వారి వారి ఘనతను చాటుకున్నారు. అనంతరం స్థానిక దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్రైస్తవ ప్రార్థన మందిరాలలో కేకులు కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు.