– సీఎం రేవంత్‌రెడ్డితో భేటీలో ప్రియాంక ప్రశంసలు
– నేడు సీడబ్ల్యూసీ భేటీ
– హాజరుకానున్న టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నేడు (మంగళవారం) కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ ) భేటీలో పాల్గొననున్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యారు జోడో యాత్రలో పాల్గొనేందుకు ముంబయి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి… అక్కడి నుంచి నేరుగా సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం జన్ పథ్ 10లో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు అరగంటకుపైగా సాగిన ఈ భేటీలో తెలంగాణలో 100 రోజుల పాలనపై నేతలతో చర్చించారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా పార్టీ పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళల అభివృద్ధి, స్వయం శక్తి కోసం రేవంత్ చేస్తోన్న పాలనను ప్రియాంక గాంధీ అభినందించినట్టు సమాచారం.
సీడబ్ల్యూసీ
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నేడు 10 గంటలకు భేటీ కానుంది. సార్వత్రిక ఎన్నికల మ్యానిఫెస్టోపై కసరత్తు పూర్తి చేయనుంది. భాగీదారీ న్యారు, కిసాన్ న్యారు, నారీ న్యారు, శ్రామిక్ న్యారు, యువ న్యారు ఐదు న్యాయాల పేరుతో మ్యానిఫెస్టో రూపొందించనున్నారు. ప్రతి విభాగంలో ఐదు గ్యారంటీలు, మొత్తంగా 25 గ్యారంటీలు చేర్చనున్నారు. సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఈ భేటీలో తెలంగాణలో మిగిలిన 13 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు.