బదిలీలు, పదోన్నతులు కొనసాగించడం సంతోషం

– విద్యాశాఖ అధికారులతో యూఎస్‌పీసీ, జాక్టో నేతల చర్చ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను కొనసాగించడం పట్ల ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) సంతోషం వ్యక్తం చేశాయి. బుధవారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకులు లింగయ్యను యూఎస్‌పీసీ, జాక్టో నాయకులు చావ రవి, జి సదానందంగౌడ్‌, టి లింగారెడ్డి, ప్రకాశ్‌రావు కలిసి వివిధ అంశాలపై చర్చించారు. పోస్టు అప్‌గ్రేడ్‌ అయి స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతి వచ్చి చేరిన సందర్భంలో ఆ పోస్టుల్లో పనిచేస్తున్న పదోన్నతి రాని పండితులు, పీఈటీలను అదే పాఠశాలల్లో తాత్కాలికంగా కొనసాగించాలని కోరారు. అందుకు సంబంధించి డీఈవోలకు సమాచారమిచ్చారనీ, మూడు, నాలుగు రోజుల్లో వారిని సర్దుబాటు చేస్తామన్నారని తెలిపారు. మల్టీజోన్‌-1 పరిధిలోని కొన్ని జిల్లాల పదోన్నతుల ఉత్తర్వుల్లో దొర్లిన పొరపాట్ల సవరణ ప్రక్రియ పాఠశాల విద్యాశాఖలో కొనసాగుతున్నదని పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం వరకు అన్ని జిల్లాలు, అన్ని సబ్జెక్టులకు పదోన్నతుల ఉత్తర్వులను జిల్లాలకు పంపిస్తారని వివరించారు. మల్టీజోన్‌-2 పరిధిలోని జిల్లాల స్కూల్‌ అసిస్టెంట్‌ బదిలీల సీనియార్టీ జాబితాలను బుధవారం సాయంత్రం రూపొందించి గురువారం ఉదయం నుంచి ఆప్షన్లను తీసుకునే అవకాశముందని తెలిపారు. 2024, జూన్‌ ఒకటి నాటికి రెండేండ్ల సర్వీసు పూర్తయిన వారు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోనివారు, ఎనిమిదేండ్ల సర్వీసు నిండిన తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారు డీఈవోలకు మాన్యువల్‌గా దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించారని వివరించారు. ఒకటికన్నా ఎక్కువ సబ్జెక్టుల్లో పదోన్నతి పొందిన వారి వివరాలను డీఈవోల నుంచి అధికారికంగా సేకరించి మిగిలిన ఖాళీల్లో తదుపరి పదోన్నతులు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఎల్‌ఎఫ్‌ఎల్‌ పీఎస్‌హెచ్‌ఎం పదోన్నతికి ఎస్జీటీ ఉపాధ్యాయులందరికీ అర్హత కల్పించే విధంగా 11, 12 జీవోలను సవరించాలనీ, 5,571 పీఎస్‌హెచ్‌ఎం పోస్టులను మంజూరు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని అధికారులు సానుకూలంగా స్పందించారని తెలిపారు.