ఘనంగా ప్రపంచ కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం

– వైద్యాధికారి అర్వపల్లి రేవంత్

నవతెలంగాణ – ఆళ్ళపల్లి ఆళ్ళపల్లి మండలంలో ప్రపంచ కుష్టు వ్యాధి నివారణ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగిందని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి అర్వపల్లి రేవంత్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఆళ్ళపల్లితో పాటు పీహెచ్ సీ పరిధిలోని కాచనపల్లి, మర్కోడు గ్రామాల్లో కుష్టు నివారణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి 30 గాంధీజీ వర్థంతిని పురస్కరించుకుని కుష్టు నివారణ దినోత్సవం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం వచ్చే నెల ఫిబ్రవరి 13వ తేదీ వరకు మండల వ్యాప్తంగా జరుగుతుందని చెప్పారు. కుష్టు వ్యాధి సోకిన వారిలో నాడీ వ్యవస్థపై ముందుగా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఆ తర్వాత చేతులు, కాళ్లపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ముందు జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించవచ్చని చెప్పారు. ఎవరికైనా స్పర్శ లేని రాగి, గోధుమ రంగులో ఒంటిపై మచ్చలు ఉన్నట్లైతే కుటుంబ సభ్యులు అటువంటి వారిని ఆసుపత్రికి తీసుకు రావాలని, పరీక్షలు చేపట్టి నివారణ చర్యలు ఇవ్వడం జరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది శ్రీధర్ బాబు, వివిధ గ్రామాల ఆశా వర్కర్లు సుగుణ, సీతాదేవి, చంద్రకళ, కావేరి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.