అంగన్‌వాడీలపై అధికారుల వేధింపులు అరికట్టాలి

– అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా కార్యదర్శి బి.కవిత
– సీఐటీయూ ఆధ్వర్యంలో సీడీపీఓ కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్‌వాడీలు
– సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీల నినాదాలతో దద్దరిల్లిన సీడీపీఓ కార్యాలయం
నవతెలంగాణ-ఆమనగల్‌
అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లపైన ప్రభుత్వ నిర్బంధాన్ని, అధికారుల వేధింపులను ఆపాలని అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా కార్యదర్శి బి.కవిత డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ అంగన్‌ వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌, సీఐటీయూ జిల్లా నాయకులు గుమ్మడి కురుమయ్య అధ్యక్షతన నాలుగవ రోజు కొనసాగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా గురువారం ఆమనగల్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్‌ వాడీ ఉద్యోగులు సీడీపీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి బి.కవిత హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అంగన్‌వాడీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అందరిని పర్మినెంట్‌ చేసి కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని అన్నారు. అంగన్‌వాడీ సెంటర్ల తాళాలు పగలగొడతామని అధికారులు చేస్తున్న బెదిరింపులు వెంటనే ఆపాలని ఆమె డిమాండ్‌ చేశారు. అలాకాని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధతం చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింప చేస్తామని ఆమె హెచ్చరించారు. అనంతరం తమ సమస్యలను విన్నవించుకోవడానికి సాయంత్రం వరకు వేచి చూసిన స్థానిక సీడీపీఓ సక్కుబాయి అందుబాటులో లేకపోవడంతో తాళం వేసి ఉన్న కార్యాలయానికి వినతి పత్రం అందజేసినట్టు ఆమె పేర్కొన్నారు. సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు గుమ్మడి కురుమయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కానుగుల వెంకటయ్య, ప్రాజెక్టు అధ్యక్షురాలు యాదమ్మ, ప్రధాన కార్యదర్శి సుగుణమ్మ, కోశాధికారి అనసూయమ్మ, ఉపాధ్యక్షురాలు పద్మమ్మ, అంగన్‌ వాడీ టీచర్లు, హెల్పర్లు సునీత, సుజాత, రాజ్యలక్ష్మి, అలివేలు, సంధ్య, సరోజ, కే.అలివేలు, పద్మ, శ్రీదేవి, రాములమ్మ, కిష్టమ్మ, బాలమణి దేవమ్మ, రాములమ్మ, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.