– రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయాలి
– సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం : ఎన్‌పీఆర్‌డీ మహిళా వికలాంగుల రాష్ట్ర సదస్సులో టి జ్యోతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళా వికలాంగులపై వేధింపులు అరికట్టాలనీ, వారికి ప్రత్యేక రక్షణ తీసుకురావాలని ఐద్వా సీనియర్ నాయకురాలు టి జ్యోతి డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహిళా వికలాంగుల సాధికారత.. సంక్షేమంపై రాష్ట్ర సదస్సులో రెండో రోజు నిర్వహిస్తున్న ‘మహిళా ఉద్యమం సాధించిన విజయాలు’ అనే అంశంపై ఆమె మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ లక్ష్మి పథకంతో పాటు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మహిళా వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళా వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్ల అమలులో 5శాతం మహిళా వికలాంగులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలు అనే కారణంతో వారిని సామాజిక కార్యక్రమాలకు దూరం పెట్టటమేంటని ప్రశ్నించారు. పెండ్లితో సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాలు మహిళా వికలాంగులకు ఇవ్వాలన్నారు. గృహ హింస చట్టం మహిళా వికలాంగులు వినియోగించుకునే విదంగా అవసరమైన మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో మహిళలకు ఎందుకు రక్షణ కల్పించడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చిన పదేండ్ల కాలంలో హింస పెరిగిందని చెప్పారు. సంఘం రాష్ట్ర అధ్యక్ష ,కార్యదర్శులు కె వెంకట్, ఎం అడివయ్య, మహిళా విభాగం కన్వీనర్ సాయమ్మ, రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్,ఉపాధ్యక్షలు వరమ్మ, స్వామి, రాజు, యశోద, అరిఫా, సహాయ కార్యదర్శులు దశరథ్, కాషప్ప, లక్ష్మి, , రాష్ట్ర నాయకులు రాధమ్మ, జయలక్ష్మి, షాహినా బేగం, లలిత, సావిత్రి, లింగన్న, గౌతమ్,ప్రకాష్, ప్రభు స్వామిలతో పాటు వివిధ జిల్లాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.