కష్టజీవులు!

కష్టజీవులు!ఘర్మజల సంద్రానికి రోజు పడవేసుకొని వెళ్ళొస్తారు వాళ్ళు
చేపల్ని పట్టడానికి కాదు బ్రతుకును నెట్టడానికి ఆకలిని ఊరడించడానికి
ఇంటి దగ్గర ఎదుర్లు చూసే.. ఆరిపోయే దీపాలకింత చమురు
పోయడానికి ఆకలి పేరుతో ఉసుర్లు తీసే అమ్మోరికింత కబళం పడెయ్యడానికి
భూమిలో విత్తనం నాటే కర్షకుడు కర్మాగారాల్లో పనిచేసే కార్మికుడు
కూలీనాలీతో పొట్టపోసుకునే శ్రామికుడు కష్టాన్ని నమ్ముకునే ప్రతి కష్టజీవీ..
చెమట ధనానికి వారసులెవరైనా సరే బ్రతుకు పడవ ఎక్కవలసిందే!
వల విసిరి బతుకు తెరువును వొడుపుగా ఒడిసి పట్టాల్సిందే!
బతుకు సంద్రంలో ఆకలి వేట అన్ని వేళలా అన్ని విధాలా నల్లేరుపై బండి నడక కాదు!
పన్లు దొరకని కరువు ఉగ్రం వచ్చినప్పుడు.. ప్రమాదాల తుఫాన్లొచ్చినప్పుడు..
పొరపాట్ల ఆటుపోట్లు వచ్చినప్పుడు.. ఆకలి సంద్రం తన పిల్లల్ని తానే బలి తీసుకుంటుంది!
రాకాసి అలలతో విర్చుకుపడి ఆకలి చావుల్లోనో అకాల చావుల్లోనో ముంచిత్తి పోతుంది..!!
(మేడే సందర్భంగా..) – భీమవరపు పురుషోత్తమ్‌, 9949800253