బీజేపీకి కష్టకాలమే

– ఒకే మాట ఒకే బాటగా ఇండియా
– ఎన్నికల ముంగిట సవాళ్లతో సతమతం
ఫైనల్స్‌కు సిద్ధమవుతున్న పార్టీలు
లోక్‌సభ ఎన్నికలలో తొలి విడత పోలింగ్‌ జరగడానికి ఎనిమిది నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. ప్రధాని నరేంద్ర మోడీ సందర్భం వచ్చిన ప్రతిసారీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ప్రసంగాలు చేస్తు న్నారు. ఆయన మాటలు, చేష్టలు ఆ దిశగానే సాగుతున్నాయి. బీజేపీ కీలక నేతలది కూడా అదే దారి. అటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఎన్నికల గోదాలోకి దిగేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. ఈసారి ప్రతిపక్షాల ఎత్తుగడలు ఆషామాషీగా లేవు. బీజేపీని ఎలాగైనా మట్టికరిపించాలన్న లక్ష్యంతో కసిగా ముందుకు సాగుతున్నాయి.
న్యూఢిల్లీ : 2019 ఎన్నికలకు ముందు జరిగిన పుల్వామా ఘటన ప్రతిపక్షాల ఆశలపై నీళ్లు చల్లింది. ఎవరూ ఊహించని మెజారిటీతో బీజేపీ అధికారాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. పైగా ప్రతిపక్షాలు సంఘటితమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ కూడా 2019లో మాదిరిగా డీలా పడి లేదు. అందువల్ల 2024 బీజేపీకి నల్లేరుపై నడకలా లేదు. ప్రస్తుతం అందరి దృష్టీ లోక్‌సభ ఎన్నికల పైనే తప్పించి త్వరలో జరగబోయే మూడు హిందీ రాష్ట్రాలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై పెద్దగా లేదు. చిన్న రాష్ట్రమైన మిజోరంలో కూడా శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. మొత్తంగా చూస్తే సెమీఫైనల్స్‌ కంటే ఫైనల్‌లో తలపడేందుకే అన్ని పక్షాలు సిద్ధపడుతున్నట్టు కన్పిస్తోంది.
కలగూరగంప కాదు
ఈసారి మోడీ, ఆయన నేతృత్వంలోని బీజేపీ ప్రధానంగా మూడు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే ఏర్పడిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ప్రస్తుత బలం కేవలం 144 మంది ఎంపీలు మాత్రమే అయినప్పటికీ అవి గత ఎన్నికల ఫలితాలు. ఈ కూటమి బలం 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించి ఉన్నదన్న వాస్తవాన్ని మరవకూడదు. అదీకాక ఈ కూటమిలోని భాగస్వామ్య పక్షాలు 11 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నాయి. మరో ముఖ్యమైన విషయమేమంటే ఒకప్పటి ‘థర్డ్‌ ఫ్రంట్‌’లో మాదిరిగా భాగస్వాములు కలగూరగంపలా లేరు. ఇందులో కాంగ్రెస్‌ కూడా ప్రధాన భాగస్వామిగా ఉంది. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ కూడా చేతులు కలిపితే ‘ఇండియా’ కూటమి మరింత బలోపేతం అవుతుంది.
సంఘటితమవుతున్న ముస్లింలు
2019 ఎన్నికలలో బీజేపీకి ఘన విజయం లభించడానికి ప్రధాన కారణం అప్పుడు ప్రతిపక్షాల ఓట్లు చీలిపోవడం. ఇది బీజేపీకి బాగా కలిసొచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉత్తరప్రదేశ్‌నే తీసుకుంటే అక్కడి ముస్లిం ఓట్లు సమాజ్‌వాదీ, బీఎస్పీ, మజ్లిస్‌ పార్టీల మధ్య చీలిపోవాలని బీజేపీ కోరుకుంటోంది. అయితే ముస్లిం ఓట్లు సంఘటితమవుతున్నాయని కర్నాటక ఫలితాలు నిరూపించాయి. బీజేపీని ఓడించగల సత్తా ఉన్న పార్టీనే వారు ఎంచుకొని గంపగుత్తగా ఓటేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ పరిణామం అతిపెద్ద కూటమి అయిన ‘ఇండియా’కు కలిసొచ్చే అవకాశం ఉంది. దేశ భద్రత, భౌగోళిక రాజకీయ పరిస్థితులు 2019లో మాదిరిగా లేవు. పొరుగుదేశాన్ని బూచిగా చూపి ఓట్లు దండుకునే ఎత్తుగడలు ఇప్పుడు ఫలించవు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్‌ బలహీనపడుతోంది. పైగా అంతర్గత రాజకీయ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ పరిస్థితులలో కవ్వింపు చర్యలకు, వాటిని బూచీగా చూపి రాజకీయ లబ్ది పొందేందుకు అవకాశాలు లేవు.
ఇబ్బంది లేదు కానీ…
తాజాగా మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. దీనితో మోడీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు కానీ ప్రతిపక్షాల మధ్య ఐక్యత మరింత గట్టి పడుతుంది. ఇలాంటి తీర్మానాలు గతంలో విజయం సాధించిన దాఖలాలు లేవు. ఇందిరా గాంధీ తన 16 సంవత్సరాల పాలనలో 15 అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొన్నారు. బొటాబొటీ మెజారిటీలతో నెట్టుకొస్తున్న ప్రభుత్వాలపై విశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టిన సందర్భాలలో మాత్రమే రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. వాజ్‌పేయి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వాలు రెండు సార్లు విశ్వాస పరీక్షల్లో ఓటమి చెందగా మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాలు రెండుసార్లు గట్టెక్కాయి. వీటిలో మొదటిది అణు ఒప్పందంపై ఆయన ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం కాగా రెండోది రిటైల్‌ రంగంలో ఎఫ్‌డీఐలకు సంబంధించినది.
అవిశ్వాసం ఎందుకంటే…
ఓటమి తప్పదని తెలిసి కూడా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాలను ఎందుకు ప్రతిపాదిస్తాయి? ఎందుకంటే తీర్మానంపై తప్పనిసరిగా చర్చ జరుగుతుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతిపక్షాలకు తగిన సమయం లభిస్తుంది. చర్చ ముగిసిన తర్వాత ప్రధాని సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి ఈ అవిశ్వాస తీర్మానం ప్రధానిని పెద్దగా ఇబ్బంది పెట్టేది కాదు. ఆయనను కలవరపాటుకు గురి చేసే విషయం ఏమంటే ప్రతిపక్షాలు ఈసారి సంఘటితమయ్యాయి. అయితే ఇప్పుడు వారంతా ఒకే మాటగా, ఒకే బాటగా ముందుకు కదులుతున్నారు. అవిశ్వాస
తీర్మానం ఇందుకు బాట వేసింది. అయితే మోడీ-షా ద్వయాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. తిమ్మిని బమ్మి చేసే ఎత్తుగడలు వేయడంలో వారికి వారే సాటి. ఇండియా కూటమి వాటిని తిప్పికొట్టి బీజేపీ వ్యతిరేక ఓటును సంఘటితపరిస్తే లోక్‌సభ ఎన్నికలలో అనూహ్య విజయాలను సొంతం చేసుకోవడం కష్టమేమీ కాదు.