సిరీస్‌ సొంతమాయె

Hardik Dubey Dhanadhan– 15 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం
– హార్దిక్‌ పాండ్య, శివం దూబె అర్థ సెంచరీలు
– రవి బిష్ణోరు, హర్షిత్‌ రానా మెరుపుల్‌
నవతెలంగాణ-పుణె
టీ20 సిరీస్‌ టీమ్‌ ఇండియా సొంతమైంది. పుణెలో ఇంగ్లాండ్‌పై 15 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్‌ 3-1తో సిరీస్‌ విజయం అందుకుంది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో నామమాత్రపు ఆఖరు మ్యాచ్‌ ఆదివార9ం వాంఖడెలో జరుగనుంది. 182 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్‌ 166 పరుగులకే కుప్పకూలింది. హ్యారీ బ్రూక్‌ (51, 26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెలరేగినా..స్పిన్నర్‌ రవి బిష్ణోరు (3/28), పేసర్‌ హర్షిత్‌ రానా (3/33) మూడేసి వికెట్లు పడగొట్టారు. ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌ (23), బెన్‌ డకెట్‌ (39)లు తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించి శుభారంభం అందించినా.. ఆ తర్వాత 5 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. హ్యారీ బ్రూక్‌ అర్థ సెంచరీతో ఇన్నింగ్స్‌ను ట్రాక్‌లో పెట్టినా.. అప్పుడూ 8 పరుగులకే మరో మూడు వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్లు, పేసర్లు కలిసికట్టుగా వికెట్లు పడగొట్టడంతో 19.4 ఓవర్లలో 166 పరుగులకే ఇంగ్లాండ్‌ కథ ముగిసింది. జోశ్‌ బట్లర్‌ (2), లివింగ్‌స్టోన్‌ (9), బెతెల్‌ (6), బ్రైడన్‌ (0)లు తేలిపోయారు. అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్య (53, 30 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివం దూబె (53, 34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీలు సాధించారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో సకిబ్‌ మహమూద్‌ (3/35), జేమీ ఓవర్టన్‌ (2/32) రాణించారు.
టాప్‌లో అతనొక్కడే
టాస్‌ నెగ్గిన ఇంగ్లాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ సంజు శాంసన్‌ (1), తిలక్‌ వర్మ (0), సూర్యకుమార్‌ యాదవ్‌ (0)లు పేసర్‌ సకిబ్‌ మహమూద్‌కు దాసోహం అయ్యారు. ఒక్క ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టిన మహమూద్‌.. భారత టాప్‌ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. యువ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (29) ఓ ఎండ్‌లో దూకుడుగా ఆడగా.. రింకు సింగ్‌ (30) బాధ్యతగా స్ట్రయిక్‌రొటేషన్‌ చేశాడు. 10.4 ఓవర్లలో 79/5తో భారత బ్యాటర్లు అందరూ డగౌట్‌కు చేరుకున్నారు. ఇంగ్లాండ్‌ బౌలర్లు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు.
పాండ్య, దూబె ధనాధన్‌
కష్టసమయంలో క్రీజులో జతకలిసిన ఆల్‌రౌండర్లు శివం దూబె (53), హార్దిక్‌ పాండ్య (53) భారత్‌కు మంచి స్కోరు అందించారు. ఆరంభంలో నెమ్మదిగా ఆడినా.. తర్వాత గేర్‌ మార్చారు. నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 27 బంతుల్లోనే హార్దిక్‌ పాండ్య అర్థ సెంచరీ సాధించాడు. ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో శివం దూబె 31 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌ చేరుకున్నాడు. హార్దిక్‌ పాండ్య, శివం దూబె ఆరో వికెట్‌కు 45 బంతుల్లోనే 87 పరుగులు జోడించారు. ఈ ఇద్దరి భాగస్వామ్యంతో భారత్‌ 181 పరుగులు చేసింది.