– ఎఫ్‌ఐహెచ్ ఫ్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్సు
లాసన్నె: 2023 ఏడాదికిగాను హాకీ అత్యుత్తమ ఆటగాళ్లుగా భారత్‌కు చెందిన హార్దిక్ సింగ్, గోల్ కీపర్ సవిత పునియా అవార్డులను గెలుచుకున్నారు. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్(ఎఫ్‌ఐహెచ్- 2023 ఏడాదికిగాను మంగళవారం ప్రకటించిన అత్యుత్తమ ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. హార్దిక్‌సింగ్‌తోపాటు వాన్-డి-వార్డ్(నెదర్లాండ్స్) కూడా 2023 ఏడాదికి అత్యుత్తమ ఆటగానిగా ఎంపికయ్యాడు. దీంతో మహిళల విభాగం గోల్ కీపర్‌గా అత్యుత్తమ క్రీడాకారిణిగా ఎంపికైన మూడో ప్లేయర్ సవిత మాత్రమే. ఎపర్ట్స్ ప్యానల్, నేషనల్ అసోసియేషన్స్, జాతీయ జట్లకు ఆడిన కెప్టెన్లు, కోచ్‌లతోపాటు అభిమానులు, మీడియా ప్రతినిధులు వేసిన ఓట్ల ఆధారంగా ఎంపిక చేశారు. గోల్‌కీపర్ సవితతోపాటు నెదర్లాండ్స్ గోల్‌కీపర్ పర్మిన్ బ్లాక్, ఎఫ్‌ఐహెచ్ రైజింగ్ స్టార్స్‌గా తెరెసా లిమా(స్పెయిన్), గాస్పర్డ్ సావియర్(ఫ్రాన్స్) ఎంపికయ్యారు. అలాగే చైనా మహిళల హాకీ హెడ్ కోచ్ అలీసన్ అన్నన్, జర్మనీ పురుషుల జట్టు కోచ్ ఆండ్రీ హెన్నింగ్ ఎఫ్‌ఐహెచ్ కోచ్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకున్నారు. ఈ అవార్డు రేసులో మొత్తం 114మంది నిలువగా భారత్‌కు చెందిన హార్దిక్.. భారతజట్టు ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించడంతో అతనికి అవార్డు సొంతమైంది. దీంతో 2022లో బల్బీర్ సింగ్ సీనియర్ తర్వాత ఈ అవార్డును చేజిక్కించుకున్న రెండో భారత ఆటగాడు హార్దిక్ మాత్రమే. 33ఏళ్ల సవిత 2021, 2022లో పలు అవార్డులను కైవసం చేసుకోవడంతోపాటు 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్, ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకం చేజిక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించడంతో ఆమెకు ఈ అవార్డు వరించింది.