పట్టభద్రుల ఉప ఎన్నిక నిర్వహణకు బ్యాలెట్ బాక్స్ లు సిద్ధం: హరిచందన దాసరి

– ఏఆర్వోలు ఎప్పటికప్పుడు రిజిస్టర్ నిర్వహించాలని
– అనుమతులు మాన్యువల్ గా ఇవ్వాలి
– ఎఫ్ఎస్టి టీమ్స్ కొనసాగుతాయి
– ఎన్నికల రిటర్నింగ్ అధికారి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
వరంగల్ ఖమ్మం నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక నిర్వహణకు బ్యాలెట్ బాక్స్ లను సిద్ధం చేశామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన వెల్లడించారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుండి వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనతో పాటు, నియోజకవర్గ పరిధిలో ఉన్న 12 జిల్లాల ఏఆర్వో లు, నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి హాజరయ్యారు. ఈ శాసన మండలి ఉప ఎన్నికలో బ్యాలెట్ బాక్స్ లు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, శిక్షణ కార్యక్రమాల నిర్వహణ పై పలు సూచనలు చేశారు. శాసన మండలి ఉప ఎన్నిక నిర్వహణకు సరిపడా బ్యాలెట్ బాక్సులు ఉన్నాయని, ఎన్నికల కోడ్ ఉల్లంఘన, అనుమతులు, ఎన్నికల ప్రచారం, ఎన్నికల ర్యాలీలు, అభ్యర్థులు పాటించాల్సిన విషయాలపై, పాటించకూడని అంశాలపై అభ్యర్థులకు జరిగిన సమావేశంలో అవగాహన కల్పించామని రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన ఎన్నికల సంఘం అధికారులకు తెలిపారు. బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ బ్యాలెట్ లకు సంబంధించి ఏఆర్వోలు ఎప్పటికప్పుడు రిజిస్టర్ నిర్వహించాలని, అభ్యర్థులకు అనుమతులు మాన్యువల్ గా ఇవ్వాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల లాగానే ఎఫ్ఎస్టి టీమ్స్ కొనసాగుతాయని తెలిపారు. అదనపు ఎన్నికల అధికారులు సర్ఫరాజ్ అహ్మద్,లోకేష్ కుమార్,డిప్యూటీ సిఈఓ సత్యవాణి పాల్గొనగా, నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మిర్యాలగూడ ఆర్డిఓ, ఏఆర్ఓ శ్రీనివాసరావు, చండూరు ఆర్డిఓ, ఏఆర్ఓ సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు.