హామీలను నిలబెట్టుకోని హరీశ్‌రావు

హామీలను నిలబెట్టుకోని హరీశ్‌రావు– చెల్లని పత్రాలతో రాజీనామా లేఖలా?
– పదేండ్ల బీజేపీి పాలనలో మెదక్‌కు ఒరిగిందేంటి?
– మాట ఇస్తే.. తప్పించుకునేది కాంగ్రెస్‌ పార్టీ కాదు : మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ- జగదేవపూర్‌
ఉత్త కాగితాలతో హరీశ్‌రావు సవాల్‌ విసరడం కాదని, ముందు మాట మీద ఉండటం అలవాటు చేసుకోవాలని, ఇప్పటికి ఎన్నిసార్లు మాట తప్పారో ప్రజలకు తెలుసని మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ అమరవీరుల పేరు మీద పదవులు అనుభవించిన మీరు ప్రజల్లో తేల్చుకోవాలని తెలిపారు. ఆగస్టులో నువ్వు నిజమైన రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండమని స్పష్టంచేశారు. శుక్రవారం జగదేవపూర్‌ మండలం దౌలపూర్‌ గ్రామంలో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నీలం మధు ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం జిల్లా నాయకులు రచమల్ల బంగారు రెడ్డి ఇంటి వద్ద మంత్రి కొండా సురేఖ, మెదక్‌ ఎంపీ అభ్యర్ధి నీలం మధుతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అంటే ప్రజల పక్షాన నిలిచే పార్టీ అని అన్నారు. దేవుడిపై బీజేపీ రాజకీయం చేస్తుందని, దేవుని పేరుతో ఓట్లు దండుకోవాలని చేస్తే ప్రజలు సహించరని విమర్శించారు. పదేండ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం మెదక్‌కు చేసింది ఏమిటని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ పరిస్థితి కూడా అందరికీ అర్ధమైనది అని తెలిపారు. కొండగట్టులో బస్సు బోల్తాపడి ప్రయాణికులు చనిపోతే కనీసం పరామర్శ లేదని, కానీ ఇవ్వాళ మీరు రైతుల గురించి మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో మెదక్‌ గడ్డ నుంచి నీలం మధును ఎంపీగా గెలిపించి రాహుల్‌ గాంధీకి బహుమానంగా ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, జిల్లా యూత్‌ అధ్యక్షులు ఆంక్షారెడ్డి, నాయకులు ఎలక్షన్‌ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్‌ రెడ్డి, మాజీ పీఏసీఎస్‌ చైర్మెన్‌ నరేందర్‌ రెడ్డి, ఎంపీపీ బాలేశం గౌడ్‌, పీర్లపల్లి ఎంపీటీసీ మహేందర్‌ రెడ్డి, మండల యూత్‌ అధ్యక్షులు శ్రావణ్‌ కుమార్‌, మైనార్టీ నాయకులు అజీజ్‌, నాయకులు సుధాకర్‌ రెడ్డి, కృష్ణ మండల నాయకులు నర్సింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.