పాప పరిహార యాత్ర చేసినా కాంగ్రెస్‌ పాపం పోదు: హరీశ్ రావు

నవతెలంగాణ హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేస్తున్న అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను గృహ నిర్బంధం చేస్తే ప్రజల మద్దతు లభించదన్నారు. పాదయాత్ర కాదు.. పాప పరిహార యాత్ర చేసినా కాంగ్రెస్‌ పాపం పోదని ఆయన ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో పేదల గూడు కూల్చి నల్గొండలో పాదయాత్ర చేస్తారా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ నుంచి పాదయాత్ర మొదలుపెట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రజల మద్దతు ఉంటే నిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఎందుకన్నారు. పాదయాత్ర కూడా నిర్బంధాల మధ్య కొనసాగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మూసీ మురికి కూపంగా మారడానికి 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన కారణం కాదా? అని హరీశ్‌రావు నిలదీశారు.
             కనీసం మీరు పుట్టిన ఈ ఒక్క రోజైనా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు లేకుండా పాలన కొనసాగించాలని కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.