నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సమయపాలనపై అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మధ్య వాగ్వివాదం జరిగింది. బడ్జెట్‌పై కూనంనేని సాంబశివరావు 40 నిముషాలకు పైగా మాట్లాడుతుండటంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ‘మాట్లాడండి…మాట్లాడండి’ అని కామెంట్ చేశారు. దీనితో కూనంనేని ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మాట్లాడితే నీకొచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. మీరెంతసేపు మాట్లాడినా మీకు టైం ఇస్తారు లెండి…అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. దీనితో కూనంనేని సీరియస్ అయ్యారు. ‘నేను మాట్లాడేటప్పుడే మీకెందుకు ఇబ్బంది అవుతుంది. అనవసరంగా నన్ను కెలకొద్దు. నా ఒరిజినాలిటీ ఇది కాదు. చాలా సంయమనంతో మాట్లాడుతున్నా. నా అసలు రూపం చూస్తే మీరు తట్టుకోలేరు’ అని ఘాటుగా స్పందించారు. దీనితో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న తమకేమో స్పీకర్ తక్కువ సమయం ఇస్తున్నారనీ, ఒక్క సభ్యుడు ఉన్న సీపీఐకి అంత టైం ఎలా ఇస్తారని హరీశ్‌రావు స్పీకర్‌ను ఉద్దేశించి అన్నారు. దీనిపై స్పీకర్ సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.