నవతెలంగాణ-మెదక్
”అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్థూపం వద్దకు 26వ తేదీ ఉదయం 10 గంటలకు వస్తా.. రేవంత్ రెడ్డి దమ్ముంటే రా.. ఇద్దరి రాజీనామా పత్రాలను మేధావుల దగ్గర పెడదాం’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. గురువారం మెదక్ పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నామినేషన్ సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని ధ్యాన్ చంద్ చౌరస్తా నుంచి రాందాస్ చౌరస్తా వరకు బీఆర్‌ఎస్ నిర్వహించిన భారీ ర్యాలీలో జెడ్పీ చైౖర్‌పర్సన్ హేమలత, ఎమ్మెల్యేలు సునితాలక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా ఆగస్ట్ 15 వరకు ఆరు గ్యారంటీలు, రైతు రుణమాఫీ అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని, అమలు చేయకుంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. రాజీనామా లేఖలను ఇద్దరం మేధావుల చేతిలో పెడదామని, హామీలను అమలు చేస్తే నా రాజీనామా లేఖను మేధావులు స్పీకర్‌కు ఇస్తారని, చేయకుంటే నీ రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇస్తారని తెలిపారు. మాట మీద నిలబడే వాడివి అయితే అమరవీరుల స్థూపం వద్దకు రావాలన్నారు. రాకుంటే కొడంగల్‌లో రాజకీయ సన్యాసం తీసుకుంటానని తోక ముడిచినట్టే, ఇప్పుడు అదే అవుతుందని తెలంగాణ ప్రజలకూ అర్థం అవుతుందన్నారు.అబద్ధాలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కిందని ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లా గులాబీ జెండాకు అడ్డా అని, 25 ఏండ్లుగా మెదక్ పార్లమెంటులో ప్రతిసారీ బీఆర్‌ఎస్ గెలుస్తుందని, ఈ సారీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. మెదక్ అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదన్నారు. కేసీఆర్ చెక్ డ్యాంలు కట్టడం వల్ల ఒక్క ఎకరా పంట ఎండకుండా చూశారని, కానీ కాంగ్రెస్ పాలనలో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు కలెక్టరేట్, ఎస్పీ, మెడికల్ కాలేజ్ భవనాలను, ఫోర్ లైన్ రోడ్డును కేసీఆర్ ఏర్పాటు చేశారని చెప్పారు. మెదక్ జిల్లా కోసం ఆనాడు ఎన్నో ధర్నాలు, ఆందోళన చేసి జిల్లాను సాధించుకున్నామని, ఇప్పుడు రేవంత్ కొత్త జిల్లాలను తీసేస్తామని అంటున్నారని తెలిపారు. కేసీఆర్ మెదక్‌ను జిల్లా చేసిండు కాబట్టే నామినేషన్ కోసం రేవంత్ రెడ్డి మెదక్ వచ్చారని, రేవంత్‌ను మెదక్ రప్పించిన ఘనత గులాబీ జెండాదేనని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక లక్ష పెండ్లిండ్లు అయ్యాయని, తులం బంగారం ఎంత మందికి ఇచ్చారని ప్రశ్నించారు. 200 మంది రైతులు, 30 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మాటలు నమ్మితే నీళ్ళు లేని బాయిల దుంకినట్టే అవుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తేనే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలవుతాయని తెలిపారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థుల్లో ఒకాయన ఆరో తరగతి వరకు చదివారని, మరొకరు బ్లాక్ మెయిలర్ అని అన్నారు. కానీ బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌గా పనిచేసిన విద్యావంతుడని, ఆయన్ని గెలిపించాలని ప్రజలను కోరారు.