ఉద్యోగులపై హరీశ్‌రావు వ్యాఖ్యలు దుర్మార్గం

ఉద్యోగులపై హరీశ్‌రావు వ్యాఖ్యలు దుర్మార్గం– వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి : టీఎస్‌యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉద్యోగుల వేతనాల పట్ల మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) తీవ్రంగా ఖండించింది. ఆ వ్యాఖ్యలు దుర్మార్గమనీ, వెంటనే వాటిని ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. శనివారం హైదరాబాద్‌లోని టీఎస్‌యూటీఎఫ్‌ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్లకార్డులను ప్రదర్శించి హరీశ్‌రావు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ రాష్ట్రంలో 2019 తర్వాత ఉద్యోగులు, ఉపాధ్యాయులు మొదటి తేదీన జీతాలు తీసుకోవడం మరిచిపోయారని అన్నారు. ప్రతినెలా రెండు నుంచి 15వ తేదీ వరకు ఎప్పుడు జీతం వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. నాలుగేండ్ల తర్వాత ఇప్పుడు మొదటి తేదీన జీతాలు తీసుకోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంతోషం కలిగిందన్నారు. ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా మెజార్టీ ఉద్యోగులకు మొదటి తేదీన కాంగ్రెస్‌ ప్రభుత్వం జీతాలు వేసిందని చెప్పారు. ఇంకోవైపు మూడెకరాల్లోపు రైతులకు రైతుబంధు ఇచ్చారని వివరించారు. మిగిలిన వారికి ఈనెలాఖరులోపు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారని అన్నారు. రైతుబంధును ఆపి ఏసీ గదుల్లో ఉండే ఉద్యోగులకు జీతాలిచ్చారంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఉద్యోగులంతా ఏసీ గదుల్లో ఉండేవారు కాదనీ, క్షేత్రస్థాయిలో ఉండి ప్రభుత్వ పథకాలను అమలు చేస్తారని గుర్తు చేశారు. బడుల్లో విద్యాబోధన చేస్తారని చెప్పారు. ఏ బడిలో, ఏ ప్రభుత్వ కార్యాలయంలో ఏసీ లేదన్నారు. కలెక్టర్లు, గ్రూప్‌-1 అధికారులకు ఏసీ గదులుండొచ్చని అన్నారు. అయితే ఈ అంశం ఆధారంగా రైతులను రెచ్చగొట్టడం హరీశ్‌రావుకు తగదని హెచ్చరించారు. ఇది ఉపాధ్యాయులు, రైతులను విడగొట్టడమే అవుతుందన్నారు. ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పిన బీఆర్‌ఎస్‌ గత పదేండ్ల కాలంలో ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంభించిందని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను వంచించి సకాలంలో జీతాలు, పెండింగ్‌ బిల్లులు, డీఏ, పీఆర్సీ బకాయిలు, జీపీఎఫ్‌ రుణాలు, టీఎస్‌జీఎల్‌ఐ చెల్లించలేదని విమర్శించారు. అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓట్లేశారన్న ఆందోళనతోనే హరీశ్‌రావు అలాంటి వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తున్నదని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులకు మొదటితేదీన జీతాలివ్వడాన్ని ఓర్వలేక రైతుబంధుతో ముడిపెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నపుడు కొందరు ఉద్యోగులను బానిసల్లా వెంట తిప్పుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పుడు ఇలా వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు. ఇప్పుడు ఇచ్చిన మాదిరిగానే ప్రతినెలా ఒకటో తేదీన జీతాలివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లులను మంజూరు చేయాలని సూచించారు. బాధ్యతారహితమైన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్‌ రాములు, సిహెచ్‌ దుర్గాభవాని, రాష్ట్ర కోశాధికారి టి లక్ష్మారెడ్డి, ప్రధాన సంపాదకులు పి మాణిక్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కె సోమశేఖర్‌, ఎ వెంకటి, ఎం రాజశేఖర్‌రెడ్డి, ఈ గాలయ్య, ఎస్‌ మల్లారెడ్డి, డి సత్యానంద్‌, వి శాంతికుమారి, జి నాగమణి, కె రవికుమార్‌, ఎస్‌ రవిప్రసాద్‌గౌడ్‌, ఎ సింహాచలం, వై జ్ఞానమంజరి, ఎస్‌కే మహబూబ్‌ అలీ వివిధ జిల్లాల బాధ్యులు పాల్గొన్నారు.