నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ఉద్యోగులకు మొదటి తేదీన జీతాలివ్వడాన్ని జీర్ణించుకోలేని మాజీ మంత్రి టి హరీశ్‌రావు అనుచిత వ్యాఖ్యలు గర్హనీయమని డీటీఎఫ్ విమర్శించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం సోమయ్య, టి లింగారెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వ్యాఖ్యలను ఆయన వెంటనే వెనక్కి తీసుకోవాలనీ, ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పిన బీఆర్‌ఎస్ నాయకులు పదేండ్లపాటు ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యలను పెండింగ్‌లో ఉంచారని తెలిపారు. జీతాలు ఆలస్యం చేయడమే కాకుండా డీఏ, పీఆర్సీ బకాయిలు, బిల్లులు, సప్లిమెంటరీ వేతనాలు, జీపీఎఫ్ చెల్లింపులు, మెడికల్ రీయింబర్స్‌మెంట్, టీఎస్‌జీఎల్‌ఐ తుది చెల్లింపులు వంటివి ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉంచిన చరిత్ర బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రైతులు, ఉద్యోగులకు మధ్య చిచ్చుపెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూడటం అవివేకమని తెలిపారు.