ఉద్యోగుల పట్ల హరీశ్‌రావు వ్యాఖ్యలు సరికాదు : పీఆర్టీయూటీఎస్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉద్యోగుల వేతనాల పట్ల మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు సరికాదనీ, వెంటనే ఉపసంహరించుకోవాలని పీఆర్టీయూటీఎస్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో 35 రోజులపాటు వేతనాలను, ఉద్యోగాలను సైతం పణంగా పెట్టి సకల జనుల సమ్మెను ఉద్యోగులు నిర్వహించారని గుర్తు చేశారు. అది పార్లమెంటు కుదిపేసిందనీ, తద్వారా ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని తెలిపారు. ఈ విషయాలను మరిచి ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకురమని పేర్కొన్నారు. దేశానికి వెన్నెముక అయిన రైతులను గౌరవించాల్సిందే కానీ ప్రభుత్వంలో ఉద్యోగుల పాత్రను మరవొద్దని కోరారు. వారి వేతన బిల్లులు, డీఏ, పీఆర్సీ బకాయిలు, మెడికల్‌ బిల్లులు చివరికి తాము దాచుకున్న జీపీఎఫ్‌ రుణాలు కూడా ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉంచారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి సహకరించామని గుర్తు చేశారు. ఈ విషయాలన్నింటినీ గమనంలోకి తీసుకుని హరీశ్‌రావు తన వ్యాఖ్యలను సరిచేసుకోవాలని సూచించారు.
హరీశ్‌రావు వ్యాఖ్యలకు టీఎస్‌పీటీఏ ఖండన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఏసీల్లో ఉండే ఉద్యోగులకు నెలలో మొదటి రోజు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం జీతాలు చెల్లించిందన్న మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలను టీఎస్‌పీటీఏ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్‌ షౌకత్‌అలీ, జాతీయ కౌన్సిల్‌ సభ్యులు నాగనమోని చెన్నరాములు ఎన్‌ ఆశాకుమారి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావుకు ఉద్యోగులకు మొదటి తేదీన జీతాలు చెల్లించాలన్న నిబంధనలున్నాయని తెలియదా?అని ప్రశ్నించారు. పదేండ్లపాటు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరించిందని విమర్శించారు. న్యాయబద్ధంగా సకాలంలో జీతభత్యాలను చెల్లించలేదని తెలిపారు. జీతాలపైనే ఆధారపడ్డ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. ఉద్యోగుల మనోభావాలను గాయపరిచిన హరీశ్‌రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలకు నిరసన కార్యక్రమాలను చేపడతామనీ, సోమవారం ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించాలని కోరారు.