హరీశ్‌వన్నీ అబద్ధాలే

– మంత్రి సీతక్క ఫైర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
జగిత్యాల జిల్లా తొంబరావుపేట గ్రామంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి సంబంధించి రూ.17 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని కనీసం క్రాస్‌ చెక్‌ చేసుకోకుండానే మాజీ మంత్రి హరీశ్‌రావు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ఫైర్‌ అయ్యారు. దీనిపై హరీశ్‌రావు చేసిన ట్వీట్‌ను ఆమె తప్పుపట్టారు. గత నెల 19వ తేదీ మాజీ సర్పంచ్‌ మామిడి సత్తమ్మకు రూ.7,46,787 చెక్కు ఇవ్వగా, ఆమె అక్టోవర్‌ 23న డబ్బులు విత్‌ డ్రా చేసుకున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదనీ, అవి పూర్తయ్యాక బిల్లులు సమర్పించాలని కోరితే, ఇప్పటి వరకు ఆమె బిల్లులే ఇవ్వలేదన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా హరీశ్‌రావు ఉనికి కోసం ట్వీట్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అయితే సెంటిమెంట్‌ రాజకీయాలు, లేకపోతే అవాస్తవాల ప్రచారమే ఆయన నైజం అని విమర్శించారు.