నవతెలంగాణ – ఆళ్ళపల్లి
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల జారీ మేరకు జరిగే ప్రజా పాలన కార్యక్రమాలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇల్లందు డీఎస్పీ రమణమూర్తి హెచ్చరించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఆళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో వివిధ గ్రామాల సర్పంచ్ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలన సభలు నేటి(గురువారం ) నుంచి నూతన సంవత్సరం 2024, జనవరి 6వ తేదీ వరకు జరుగుతాయని, కార్యక్రమ సమయం ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. అందులో అర్హులైన వారి దరఖాస్తులు అన్ని గ్రామ పంచాయతీలలో స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. వివిధ గ్రామాల ప్రజలు అందరూ సహకరిస్తూ.. స్త్రీ, పురుషులు వేరుగా వరుస క్రమం పాటించి అధికారులకు సహకరించాలని చెప్పారు. ప్రతిరోజూ రెండు గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి, దరఖాస్తులు స్వీకరించి, రశీదు ఇస్తారని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం సామాన్య ప్రజలకు మాత్రమేనని, నేరస్తులకు కాదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు పోలీసులకు, సంబంధిత శాఖల అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి సీఐ ఇంద్ర సేనారెడ్డి, స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్సై ఈ.రతీష్, పోలీస్ సిబ్బంది, వివిధ గ్రామాల సర్పంచ్ లు, తదితరులు పాల్గొన్నారు.