– ఓడినా…ప్రజా తీర్పును గౌరవించరా?
– ప్రగతిభవన్‌లో మంత్రులకే ప్రవేశం లేదు
– దక్ష్షిణ తెలంగాణకు తీరని అన్యాయం
– ఉద్యమకారులపై కేసులెందుకు ఎత్తేయలే?
– డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం
– పేపర్ లీకేజీలపై బీఆర్‌ఎస్ క్షమాపణ చెప్పాలి
– ఆరు గ్యారంటీలే కాదు…మా ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యం
– మీ నియంతృత్వం ఎంతో కాలం చెల్లదు : సీఎం రేవంత్‌రెడ్డి
– గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
శాసనసభ నుంచి బీఆర్‌ఎస్ సభ్యులను బయటకు పంపించబోమనీ, ఇక్కడే కూర్చొబెట్టి కఠోర వాస్తవాలు వినిపిస్తామనీ, వారిలో పరివర్తన తెప్పిస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదే వారికి శిక్ష అంటూ విన్నవించారు. ప్రజలు ఓడించినా వారిలో మార్పు రావడం లేదన్నారు. ప్రజల తీర్పును గౌరవించడం లేదని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వేరే వారికి బీఆర్‌ఎస్ అవకాశం ఇస్తుందని ఆశించామని చెప్పారు.ఆ పార్టీ నేతలు చాలా మంది మాజీ మంత్రులు ఉన్నా…ఉప ముఖ్యమంత్రి ఉన్నా…సభలో మాట్లాడే అవకాశం వారికి ఇవ్వడంలేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రజాస్వామిక విలువలకు స్థానంలేదని విమర్శించారు. ప్రజాజీవితంలో అడుగుతాం …కడుగుతాం అని శ్రీశ్రీ అన్నాడు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వం ఎంతో కాలం ఉండబోదని హెచ్చరించారు. శనివారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధా నమిచ్చారు. ప్రజలు నిఖార్సయిన తీర్పు ఇచ్చినా బీఆర్‌ఎస్ నేతల్లో మార్పు లేదని ఎద్దేవా చేశారు. ఇనుప కంచెలు బద్దలు కొట్టినం… ప్రజలు బాధలు చెప్పుకునేందుకు వేల సంఖ్యలో వస్తున్నారని గుర్తు చేశారు. దీన్ని బీఆర్‌ఎస్ భరించలేని పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు.ప్రజల చెమట చుక్క వాసన చూడలేక ఆనాడు ప్రగతిభవన్‌కు ప్రవేశం కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి హోంమంత్రి మహమూద్ అలీని ప్రగతిభవన్‌కు అనుమతి లేదంటూ హోంగార్డు ఆపారనీ, మంత్రి ఈటల రాజేందర్‌ను పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించారనీ, దీంతో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారని గుర్తు చేశారు. గజ్జెకట్టి, గొంగడేసి, తన గళంతో దేశంలోని వంద కోట్ల మందిని ప్రభావితం చేసిన ప్రజా యుద్ధనౌక గద్దరన్నను కూడా లోపలికి రానీయలేదన్నారు. గంటల తరబడి ఆయ న్ను ఎర్రటి ఎండలో నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వంలో ఆపరిస్థిలు ఉండవని వివరించారు.
అసెంబ్లీలోనూ నిరంకుశత్వమే
పదేండ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం శాసనసభలోనూ నిరంకుశంగా వ్యవహరించిందని రేవంత్ చెప్పారు. ప్రశ్నించిన వారిని ఈడ్చికెళ్లి బయట పడేశారని చెప్పారు. గవర్నర్ ప్రసంగం సమయంలో లేచి నిలబడిన నాటి సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్ సభ్యత్వా లను నిరంకుశంగా రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నిరసన తెలిపే హక్కును కాలారాశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో అమరులైన వారి గురించి ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. వారి కుటుంబాలను పిలిచి బుక్కెడు బువ్వ పెట్టలేదని కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారులపై కేసులు ఎందుకు ఎత్తేయలేదని ప్రశ్నించారు. త్యాగాలు చేసిన వారికి ఇచ్చే మర్యాదా ఇదేనా? అని ప్రశ్నించారు. కూతురు ఎంపీగా ఓడిపోతే మాత్రం కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చి పేగు బంధాన్ని నిరూపించు కున్నారని చెప్పారు. కండువా మార్చుకున్న వారికి మంత్రు లు పదవులిచ్చి గౌరవించారని చెప్పారు.
కరోనా సమయం లో రెమిడి ఇంక్షన్‌కు రూ. 2వేలు ఉంటే, రూ. 5వేలకు అమ్ముకుని రూ 450 కోట్లు సంపాదించిన వ్యాపార వేత్తకు రాజ్యసభ ఇచ్చారని విమర్శించారు. డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలోకి దూకిన నళినిని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఉద్యమ కారులపై ఇప్పటికీ కేసులు ఎత్తివేయలేదని వివరించారు. కేసీఆర్, ఆ కుటుంబంపై కేసులెన్ని? నిరుద్యోగులు, ఉద్యమకారులపై కేసులెన్ని? అందులో తొలగించినవి ఎన్ని? బీఆర్‌ఎస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. చివరకు ధర్నా చౌక్‌ను కేసీఆర్ సర్కారు కూడా రద్దు చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధర్నా చౌక్‌ను పునరుద్దరించామని ప్రజలకు తెలిపారు. బీఆర్‌ఎస్ సభ్యులు కూడా కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత స్వేచ్ఛగా ఫోన్లు మాట్లాడగలుగు తున్నామని చెప్పారని వివరించారు.
ఆరు గార్యంటీలకు చట్ట బద్ధత కల్పిస్తాం
ఆరుగ్యారంటీలే కాదు….ఏడో గ్యారంటీగా ప్రజా స్వామ్యని ఇస్తామని సీఎంచెప్పారు. ఆరు గ్యారంటీలకు శాసనసభలో చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని మేనేజ్‌మెంట్ కోటాలో వచ్చిన వారు గమనించా లని కేటీఆర్‌నుద్దేశించి ఎద్దేవా చేశారు. వాటికి చట్టం చేసే సమయంలో బీఆర్‌ఎస్, ఎంఐఎం, బీజేపీ, సీపీఐతోపాటు బయట పక్షాల సలహాలు తీసుకుంటామన్నారు. ప్రతి రోజు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ గ్యారంటీలను వల్లె వేయాలని కోరారు. గవర్నర్ ప్రసంగంపై క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. అది కాంగ్రెస్ మ్యానిఫెస్టోనే అని వివరణ ఇచ్చారు.గత ప్రభుత్వాలు కూడా ఇదే విధంగా చేశాయని తెలిపారు.అది తమ ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్ అని గుర్తు చేశారు.
రైతుల ఆదాయంపై అబద్ధాలే
తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతుల ఆదాయం పెరిగిందంటూ బీఆర్‌ఎస్ అబద్ధాలు చెబుతున్నదని రేవంత్ విమర్శించారు. ఒకే అంశాన్ని పదే పదే చెప్పడం ద్వారా అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేశారని విమర్శించారు. రైతుల ఆదాయంలో మన రాష్ట్రం 25స్థానంలో ఉందన్నారు. మేఘాలయ రైతుల ఆదాయం కంటే మన రైతులు ఆదాయం తక్కువ ఉందన్నారు. ఎన్‌సీబీఆర్ లెక్కల ప్రకారం 8వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతు బీమా లక్షా 19081మంది క్లెయిమ్ అయిందన్నారు. దీనఇన బట్టి రైతులు ఎంత మంది మరణించారో అర్థం చేసుకోవచ్చనన్నారు. వీటిని ప్రభుత్వం దాచి పెట్టిందన్నారు. రైతులను బతికించేందుకు ప్రభుత్వం సహకరించాల్సిందిపోయి, చనిపోతేనే ఐదు లక్షలు ఇస్తామని చెప్పడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. పంట బీమా ఇచ్చి ఉంటే రైతుల ఆత్మహత్యలు జరిగేవి కావన్నారు. రైతు మరణాలకు గత ప్రభుత్వం వెల కట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు, చెరకు, మిరప, సోయాబిన్ వంటి పంటలను నిర్లక్ష్యం చేసిందన్నారు. వరి పండిస్తే ఉరే అంటూ నాటి సీఎం కేసీఆర్ రైతులను బెదిరించారని చెప్పారు. ఆయన ఫామ్‌హాస్‌లోని 150 ఎకరాల్లో మాత్రం వరి పండించి మిల్లర్ల మెడపై కత్తి పెట్టి క్వింటా 4500లకు అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం, మిల్లర్లు, దళారులు కుమ్మక్కై రైతుల వడ్లకు క్వింటా రూ 1400లకు మించి ఇవ్వలేదని విమర్శించారు. రైతులకో న్యాయం, కేసీఆర్‌కో న్యాయమా? అని ప్రశ్నించారు. ఇదేనా రైతు ప్రభుత్వం అని నిలదీశారు.
కాలువల ద్వారా నీరు అందింతే…
విద్యుత్ తలసరి వినియోగంలో మనం రాష్ట్రం మొదటి స్థానంలో లేదని, దీనిపై అన్ని అబద్దాలు చెబుతున్నారని రేవంత్ విమర్శించారు. కాలువల ద్వారా పంటలకు నీరు పుష్కలంగా అందుతుందని ఇప్పటిదాకా బీఆర్‌ఎస్ నేతలు చెప్పారని తెలిపారు. కాలువల ద్వారా నీరు అందింతే, లక్షల కోట్లు ఖర్చు పెడితే 19 లక్షలు ఉన్న పంపుసెట్లు… 29 లక్షలకు పంపుసెంట్లు ఎందుకు పెరిగాయన్నారు. సమైక్య పాలనలో అన్యాయం జరిగితే జరిగి ఉండోచ్చు…కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఎందుకు అన్యాయం జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. నారాయణ పేట్, కొడంగల్ ఏడారిగా ఎందుకు మారిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దక్షిణ తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు. మహబూబ్‌నగర్ ఎంపీగా గెలిపించిన ప్రజలను కూడా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు.
నిలువనీడలేని నిర్వాసితులనూ నిర్లక్ష్యమేనా?
వరదల్లో ముగినిపోయి నిరాశ్రయులైన ఆలంపూర్ ప్రజలకు ఇండ్లు కట్టిస్తామన్న మాట ఏమైందని రేవంత్ ప్రశ్నించారు. మిడ్‌మానేరు నిర్వాసితులు నేటికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం కొట్లాడుతున్నారని గుర్తు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికీ ఆ నిరసనల్లో పాల్గొంటారని తెలి పారు. ఎంపీ సంతోష్‌కుమార్, ఆయన సోదరికి కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఇండ్ల పట్టాలు పొందారని చెప్పారు .కానీ పేదలకు మాత్రం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇసుక లారీలతో తొక్కించి..కేసులు పెట్టి…హింసించి…
వందల లారీల ఇసుక రవాణాతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారమంటూ నేరెళ్ల బాధితులు అడిగితే వారిని రకరకాలుగా హింసించారని రేవంత్ తెలిపారు. లారీలో తొక్కించి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. ఈ దారుణాలు కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో జరిగాయ న్నారు. బాధితులను పరామర్శించేందుకు లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ వస్తే బీఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డుకుందని గుర్తు చేశారు. పదోవతరగతి, ఇంటర్ పేపర్లు లీకేజీతో వి ద్యార్థులు మరణిస్తే కూడా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
డ్రగ్స్ నియంత్రణలో విఫలం
రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణలో బీఆర్‌ఎస్ సర్కారు విఫలమైందని రేవంత్ చెప్పారు. ఆ మత్తులో మహిళలపై దారుణాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో బాలికపై గంజాయి మత్తులో అత్యాచారానికి పాల్పడ్డారని, దానికి బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. టిఎస్ నాబ్‌ను ఏర్పాటు చేసినా, అది పేపర్ మీదనే ఉందన్నారు. సీవీ ఆనంద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారనీ, 311 మంది సిబ్బందిని అడిగితే, 10శాతం కూడా ఇవ్వలేదన్నారు. బడ్జెట్ రూ 29 కోట్లు అడిగితే ఒక రూపాయి ఇవ్వలేదని వివరణిచ్చారు.
ఇందిరమ్మ రాజ్యమంటే…
ఇందిరమ్మ రాజ్యమంటే ఏంటని బీఆర్‌ఎస్ సభ్యులు పదేపదే అడుగుతున్నారనీ, ‘ఇందిరమ్మ రాజ్యమంటే … పేదలకు ఇండ్లు కట్టించడం, అసైన్డ్ భూములు, పోడు భూములు పట్టాలు ఇవ్వడం, ఫీజురీయింబర్స్‌మెంట్స్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించడం, ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించడం, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ 2500, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం, రూ. 500లకే గ్యాస్‌సిలిండర్ ఇవ్వడం’ అని రేవంత్ చెప్పారు.ఇంకా ఎన్నో ఉన్నాయని, వాటి సందర్భం వచ్చినప్పుడు చెబుతానన్నారు.