నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సావిత్రిబాయి పూలే జయంతిని ‘మహిళా ఉపాధ్యాయ దినోత్సవం’గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె జయంతి జనవరి 3ను మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఇది సముచిత నిర్ణయమని తెలిపారు. దశాబ్ధకాలంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) ఈ డిమాండ్ చేస్తున్నదని గుర్తు చేశారు. భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా బాలికల విద్య కోసం ఆమె కృషి చేశారని పేర్కొన్నారు. ఆనాటి పురుషాధిక్య సమాజంలో బాలికలకు విద్యనేర్పడమంటే, సమాజాన్ని ఎదిరించి నిలబడే తెగువ గల వారు మాత్రమే ముందుకు వెళ్లారని గుర్తు చేశారు. అలాంటి తెగువ, దైర్యం గల సాహసి సావిత్రిబాయి ఫూలే అని తెలిపారు. భర్త జ్యోతిబా ఫూలే ఇతోధిక ప్రోత్సాహమున్నప్పటికీ ఆమె సాహసమే ఉపాధ్యాయురాలిగా నిలిపిందని పేర్కొన్నారు.