న్యాయం కండ్లు తెరిచిందా!

Justice has opened its eyes!‘కావునలోకపుటన్యాయాలు, కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్య్రాలూ దౌర్జన్యాలూ, పరిష్కరించే, బహిష్కరించే’ మార్పేనా ఇది! న్యాయాన్ని బొమ్మను చేసి కలిగించే న్యాయం కళ్లు తెరిసిందని, చేతిలో రాజ్యాంగాన్ని సమ కూర్చుకుందని సంబరపడేందుకు సందర్భమేనా ఇది! న్యాయవాదులూ న్యాయస్థానాలూ ఉన్నాయంటేనే, వాటి అవసరం పెరుగుతున్నదంటేనే అన్యాయాలు విస్తరిస్తున్నాయని అర్థం. చాలా విషయాలలో నేడు వాటి వాటి స్వరూపాలను మార్చుకుంటున్నాయి. ఈ మార్పులు చూసి మనమంచికి జరుగుతున్నాయని అనుకోవటంలో తప్పులేదు. అయితే గమనించాల్సింది స్వభావంలో ఏమైనా మార్పులొచ్చాయా అని చూసుకోవాలి. స్వధర్మం పేరుతో అధర్మాన్ని, స్వచ్ఛత నినాదంతో దుష్టత్వాన్ని, దేశభక్తి పేరు చెప్పి ద్వేషాన్ని రగిలిస్తున్న తరుణంలో, ఏకత పేరుతో ఐక్యమత్యాన్ని విధ్వంసమొనరుస్తున్న సందర్భంలో, న్యాయమందక ఎందరో గొంతులెత్తుతున్న వేళ న్యాయదేవత కండ్లు తెరిచి న్యాయం చేస్తుందని భావించగలమా!
ఇటీవల సుప్రీంకోర్టు ఆవరణలోని న్యాయమూర్తుల గ్రంథాలయంలో కొత్త న్యాయదేవతా విగ్రహం ఏర్పాటు చేయటంతో దేశంలో ఈ మార్పు వెనకాలవున్న ఉద్దేశ్యాలపైన పెద్ద చర్చ మొదలయింది. సాధారణంగా న్యాయదేవత ఒక గౌనువేసుకొని, తలవిరబోసుకుని, కండ్లకు గంతలతో, ఒక చేతిలో త్రాసు, మరో చేతిలో ఖడ్గం కలిగి ఉంటుంది. న్యాయదేవతగా ప్రపంచదేశాలలో సైతం ఈ విగ్రహం ప్రసిద్ధి. గ్రీకు పురాణాల ప్రకారం థెమిస్‌ అనేది న్యాయ దేవతగా చెప్పుకుంటారు. ఆమె న్యాయానికి, చట్టానికి అధికారానికీ ప్రతీక. థెమిస్‌ను గ్రీకుప్రజలు బాగా గౌరవిస్తారు. థెమిస్‌ అంటే గ్రీకుభాషలో సంప్రదాయం, చట్టం అని అర్థం. ఈజిప్టులోనూ ‘మాట్‌’ దేవతను సత్యదేవతగా పూజిస్తారు. రోమ్‌లో జెస్టిసియా దేవత న్యాయానికి గుర్తుగా ఉంది. ప్రపంచ దేశాలలో ఈ విగ్రహాన్ని న్యాయ స్థానా లలో వాడుతున్నారు. బ్రిటన్‌, ఫ్రాన్స్‌ మొదలైన దేశాలలో కూడా ఈ ప్రతిమనే న్యాయానికి ప్రతీకగా పెడతారు. బ్రిటీషర్స్‌ నుండి మనమూ కొనసాగిస్తున్నాము. చట్టానికి అందరూ సమానమని, వారి వారి రంగు, మతము, పేద, ధనిక, ప్రాంత భేదాలు లేకుండా తప్పొప్పుల ఆధారంగానే న్యాయం జరుగుతుందని, శిక్షలు విధించడం చేస్తామని చేప్పే ప్రకటనకు, కండ్లకు గంతలు ఉంటాయని వివరిస్తారు. అలాగే ఖడ్గం ధరించడం అనేది శిక్ష విధింపునకు ఉండే అధికారాన్ని సూచిస్తుంది. ఇంకా వివరణలేవో చెపుతుంటారు.
ఇంతకాలం కోర్టుల్లోనూ న్యాయం జరగనపుడు న్యాయదేవత కళ్లుతెరచి చూడదని, అందుకనీ నిజాలు తెలువవనీ విమర్శ వచ్చేది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ గారి ఆదేశాల మేరకు న్యాయ దేవత రూపురూఖేలను మార్చి తయారు చేశారు. ఆ విగ్రహంలో కండ్లకు గంతలు తీసివేశారు. చేతిలో కత్తి బదులు రాజ్యాంగాన్ని పెట్టారు. త్రాసు త్రాసులాగే ఉంది. కానీ మొత్తం దేవతా రూపం భారతీకరించారు. ”న్యాయదేవత కండ్లకు గంతలు అవసరం లేదు. చట్టం ఎప్పుడూ గుడ్డిదికాదు. అది అందరినీ సమంగా చూస్తుంది. కత్తి హంసకు ప్రతీకగా కనిపిస్తుంది. కానీ న్యాయస్థానాలు రాజ్యాంగ చట్టాల మేరకు న్యాయాన్ని అందజేస్తాయి”, అని జస్టిస్‌ చంద్ర చూడ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వాస్తవికతలో అలా జరిగితే సంతోషమే. ఈ న్యాయవ్యవస్థలోనే మొన్న చని పోయిన ప్రొ|| సాయిబాబా తొమ్మిదేండ్లు విచారణ పేరుతో ఏ నేరం రుజువు కాకుండానే జైళ్లో మగ్గారు. హక్కుల కార్యకర్త స్టాన్‌స్వామి జైళ్లోనే ప్రాణాలు విడిచాడు. సాయిబాబాకు తన తల్లి మరణిస్తే, చూసేందుకు కూడా అనుమతి దొరకలేదు.కానీ అనేక దుర్మార్గాలు,హత్యలు, లైంగికదాడుల ఆరోపణలతో జైలుకెళ్లిన డేరాబాబాకు పదులసార్లు పెరోల్‌ దొరికిన సందర్భంలో, న్యాయదేవత విగ్రహం మారగానే న్యాయం జరుగుతుందని నమ్మటానికి అవకాశముందా?
అంబేద్కర్‌ ఆధ్వర్యంలో నిర్మితమైన రాజ్యాంగంపైన ఏ మాత్రమూ గౌరవమూ, విశ్వాసంలేని పాలకులు, అనేక రాజ్యాంగ సవరణలకు పూనుకుని, రాజ్యాంగ మౌలిక స్వభావాన్నే మార్చివేస్తున్న వేళ, న్యాయదేవత చేతిలో రాజ్యాంగాన్ని పెట్టగానే భ్రమకు గురవుతామా! కండ్లకుగంతలు తీసిన దేవతకు నిజాల్ని చేసి తీర్పులిచ్చే ధైర్యం వస్తుందా! ఈ అసమ సమాజంలో న్యాయం ఎవరి పక్షం వహించాలో న్యాయవ్యవస్థకు ముందుగానే తెలుసు. న్యాయ చట్టాలను మార్చి, సంస్కృత పేర్లతో వాటిని పిలిచినపుడే ఏదో మార్పుకు మార్గం వేస్తున్నారని సంకేతించారు. ఇప్పుడు భారతీకరించిన మనుధర్మాన్నే న్యాయంగా తెచ్చేందుకు పూనుకునే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా వేచిచూడాలి!