ఆకస్మిక, అనూహ్య, నాటకీయ పరిణామాల మధ్య సోమవారం నాడు బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితికి తెరలేచింది. రాజీనామా కోరుతూ జనం పెద్ద సంఖ్యలో ప్రధాని షేక్ హసీనా నివాసం మీదకు దండెత్తటం, తరువాత పార్లమెంటుపై దాడి, దేశం విడిచి పోవాల్సిందిగా మిలిటరీ ఆదేశించటం, పదవికి రాజీనామా చేసి ఆమె మిలిటరీ హెలికాప్టర్‌లోనే సోదరితో కలసి ఢిల్లీ రావటం, మిలిటరీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ తానే అధికారాన్ని చేపడుతున్నట్లు ప్రకటించటం అంతా కొద్ది గంటల్లోనే జరిగిపోయాయి. మంగళవారం నాడు వెలువడిన వార్తల ప్రకారం నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనిస్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్ప డాలని ఆందోళనకారులు కోరుతున్నారు. డెబ్బయారేండ్ల షేక్ హసీనా వరుసగా జనవరిలోనే నాలుగోసారి అధికారానికి వచ్చారు. ఏడాది కూడా గడవకముందే దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. పార్లమెంటును రద్దు చేసిన దేశాధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాడు.ప్రతిపక్ష నాయకురాలు బేగం ఖలీదా జియాను జైలు నుంచి విడుదల చేశారు. అవినీతి కేసులో పదిహేడేండ్లుగా జైలు శిక్షను అనుభవిస్తున్న 78 ఏండ్ల మాజీ ప్రధాని ఖలీదా అనారోగ్యంతో ప్రస్తుతం జైలు ఆసుపత్రిలో ఉన్నారు. హసీనా రాజీనామా తరువాత కూడా నిరసనలు కొనసాగుతున్నట్లు వార్తలొచ్చాయి.ఇది రాసిన సమయానికి హసీనాకు ఏ దేశం రాజకీయ ఆశ్రయం ఇచ్చేది స్పష్టం కాలేదు. గ్రామీణ బ్యాంకుతో దారిద్య్ర నిర్మూలనకు స్వల్ప మొత్తంలో రుణాలిచ్చే మైక్రోక్రెడిట్ పథకంతో ముందుకొచ్చి మహమ్మద్ యూనిస్ ప్రాముఖ్యత పొందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 83 ఏండ్ల వయసులో అదే యూనిస్, మరో 13మందిని రెండు నెలలక్రితం అవినీతి కేసులో దోషులుగా తేల్చి ఆరునెలల జైలు శిక్ష వేశారు, బెయిలు మీద ఉన్నాడు. తన టెలికాం కంపెనీ సిబ్బంది సంక్షేమ నిధుల్లో రెండు కోట్ల డాలర్లమేరకు విదేశాలకు తరలింపు, దుర్వినియోగం చేసినట్లు ఆరోపణ. అయితే తన మీద తప్పుడు కేసులు పెట్టినట్లు అంటున్నాడు.అతని మీద ఇంకా వందకేసులు ఉన్నాయి.తాజా పరిణామాల వెనుక ఏం జరిగిందనేది వెల్లడి కావాల్సి ఉంది.అమెరికా హస్తం ఉన్నట్లు చెబుతున్నారు.
జనం,ప్రతిపక్షాల అసంతృప్తిస్వరం
రద్దయిన పార్లమెంటులో 350కి గాను అవామీ లీగ్‌కు 306 స్థానాలున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బిఎన్‌పి), పరిమితమైన బలం కలిగిన కమ్యూనిస్టు, ఇతర వామపక్షాలతో కూడిన కూటమి, ఇతర చిన్న పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి. ఎన్నికలను తటస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరపాలని, ప్రతిపక్షాల అణచివేతకు నిరసనగా తాము పోటీ చేయటం లేదని అవి ప్రకటించాయి.2018లో జరిగిన ఎన్నికల్లో 80.2, అంతకుముందు 61.29శాతం ఓట్లు పోలుకాగా ఈ ఏడాది 41.8శాతమే నమోదై జనం అసంతృప్తి వెల్లడైంది. పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్రం కోసం సాగించిన పోరు ఫలించి 1971లో స్వతంత్ర బంగ్లాదేశ్ ఏర్పడింది. ఆ విముక్తి పోరాటానికి నాయకత్వం వహించి బంగ బంధుగా పేరు తెచ్చుకున్న తొలి ప్రధాని షేక్ ముజిబుర్ రహమాన్ కుమార్తె షేకహేసీనా. 1975లో జరిగిన మిలిటరీ తిరుగుబాటులో ముజిబుర్ రహమాన్‌తో పాటు కుటుంబ సభ్యులందరినీ చంపివేశారు. ఆ సమయంలో విదేశాల్లో ఉన్న హసీనా, ఆమె సోదరి రెహనా, హసీనా భర్త ఎంఎ వాజెద్ మియా ఢిల్లీలో అణుశాస్త్రవేత్తగా పనిచేస్తుండటతో అతను, వారి పిల్లలు కూడా హత్యా కాండ నుంచి తప్పించుకున్నారు. తొలుత వారు జర్మనీలో, తరువాత మనదేశంలో ఆశ్రయం పొందారు. ఆమె ప్రవాసంలో ఉండగానే 1981లో అవామీలీగ్ నేతగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేతగా ఆ తరువాత 1996నుంచి 2001వరకు తొలిసారి ప్రధానిగా పనిచేశారు. రెండవసారి 2009లో బాధ్యతలు చేపట్టి సోమవారం నాడు రాజీనామా చేసేవరకు అదే పదవిలో కొనసాగారు. మొత్తమ్మీద ఇప్పటివరకు ఆమెమీద పందొమ్మిది సార్లు హత్యాప్రయత్నాలు జరిగినట్లు చెబుతారు. మత తీవ్రవాదులను అణచివేసిన నేతగా పేరుతెచ్చుకున్నారు.ముజిబుర్ రహమాన్ హత్య తరువాత మిలిటరీ నియంత జియావుర్ రహమాన్ అధ్యక్షుడిగా అధికారానికి వచ్చాడు. 1978లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని ఏర్పాటు చేశాడు.1981లో మిలిటరీ తిరుగుబాటులో హతమయ్యాడు. తరువాత ఆ పార్టీకి భార్య ఖలీదా జియా నేతృత్వం వహించటమే కాదు, రెండుసార్లు ప్రధానిగా పనిచేశారు.తాజా ఎన్నికలను బహిష్కరించారు. జియావుర్ రహమాన్ అధికారంలో ఉండగా ముస్లిం ఛాందసవాదులను ప్రోత్సహించి ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు చూశాడు. బిఎన్‌పి మితవాద పార్టీ, దానికి జమాయతే ఇస్లామీ పార్టీ మద్దతు ఇస్తున్నది. మరో మిలిటరీ నియంత ఎర్షాద్ అధికారాన్ని చేజిక్కించుకోవటంతో అతగాడిని గద్దెదించేందుకు షేక్ హసీనా-ఖలీదా జియా ఇద్దరు చేతులు కలిపి ఆందోళనలు నిర్వహించారు. ఎర్షాద్ పదవి నుంచి దిగిన తరువాత ఇద్దరూ ప్రత్యర్థులుగా మారారు.
అనేక సవాళ్లను ఎదుర్కొన్న హసీనా
షేక్ హసీనా పదవీకాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. కరోనా ముందువరకు మెరుగ్గా కనిపించిన ఆర్థికస్థితి తరు వాత ఇప్పటివరకు కోలుకోలేదు.దాంతో 470 కోట్ల డాలర్ల రుణం కోసం ఐఎంఎఫ్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. ధరలు ప్రత్యేకించి ఆహారద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంది.కరెన్సీ విలువను తగ్గించటంతో జనజీవితాలు అతలాకుతలమయ్యాయి. బంగ్లాదేశ్‌లో ఉన్న ఏకైక అణువిద్యుత్ కేంద్రాన్ని నిర్మించిన రష్యా రానున్న రోజుల్లో మరింతగా సహకరిస్తామని ప్రకటించింది. చైనా ఇస్తున్న అప్పులతో అది మరొక శ్రీలంకగా మారుతుందని ప్రచారం చేశారు. ఇటీవలి కాలంలో రెండు దేశాలు మరింతగా సన్నిహితం కావటమే దీనికి ప్రధాన కారణం. గంగోత్రి నుంచి ప్రారంభమైన గంగానదిని బంగ్లాదేశ్‌లో పద్మ అంటారు. దాని మీద కట్టిన పెద్ద వంతెన నిర్మాణంలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రపంచబ్యాంకు బహిరంగంగా ప్రకటించి నిధులు నిలిపివేసింది. బంగ్లా ప్రభుత్వం చైనాను సంప్రదించగా 2012లో 360 కోట్ల డాలర్లు ఇచ్చి దాన్ని పూర్తి చేయించింది. రాజధాని ఢాకాతో 21 జిల్లాలను అది అనుసంధానం గావించింది. బిఆర్‌ఐ పధకంలో చేరి విద్యుత్ కేంద్రాలు, రైల్వే లైన్లు,రోడ్లు, రేవులు, సొరంగాల వంటి పదిహేడు ప్రాజెక్టులకు రుణాలు పొందింది. అంతే కాదు, తనకు అవసరమైన ఆయుధాల్లో 74శాతం చైనా నుంచి పొందుతున్నది. పశ్చిమ దేశాలతో ప్రత్యేకించి అమెరికా పోల్చుకుంటే ఎంతో లాభసాటిగా ఉండటమే చైనా పెట్టుబడుల వైపు మొగ్గుకు కారణం.
‘బంగ్లా’పై అమెరికా అస్త్రం!
తన దారికి రాని దేశాల మీద మానవహక్కుల ఉల్లంఘన పేరుతో అమెరికా దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ మీద కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించింది. ఈ కారణంగా కూడా హసీనా సర్కార్ చైనాకు మరింత చేరువైంది.2021లో అమెరికా నిర్వ హించిన ప్రజాస్వామ్య సదస్సుకు బంగ్లాదేశ్‌ను ఆహ్వానించలేదు. అప్పుడు చైనా రాయబారి బంగ్లాకు మద్దతుగా నిలిచారు.తన ఇండో-పసిఫిక్ వ్యూహం(క్వాడ్)లో చైనాకు వ్యతిరేకంగా కలసిరావాలని జోబైడెన్ తెచ్చిన ఒత్తిడిని బంగ్లా తిరస్కరించింది. అలీన విధానంతో స్వతంత్ర వైఖరిని అనుసరిస్తామని ప్రకటించింది. కొల్‌కతాకు 212 నాటికల్ మైళ్ల దూరంలో బంగాళఖాత తీరంలోని కాక్స్‌బజార్ రేవు ప్రాంతంలో నిర్మించిన జలాంతర్గామి కేంద్రానికి చైనా 120 కోట్ల డాలర్ల సాయం చేసినంత మాత్రాన భారత్ రక్షణకు ఎలాంటి ముప్పు లేదని బంగ్లాదేశ్ ప్రకటించింది. చైనా తమకు ఆర్థిక భాగస్వామి తప్ప రక్షణకు కాదని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌లో చైనా నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలతో భారత్ కూడా లబ్దిపొందుతుందని, ఈశాన్య భారతానికి వేగంగా భూ, జలమార్గాల ద్వారా సరకు రవాణా చేయవచ్చని కొందరు నిపుణులు చెప్పారు. చైనా పెట్టుబడులతో బంగ్లాదేశ్‌కు ఎలాంటి ముప్పు లేదని వాటి మీద పెట్టుబడికంటే లాభాలు ఎక్కువ అని జహంగీర్ నగర్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సాహెబా నామ్ ఖాన్ చెప్పాడు. బంగ్లాదేశ్ మీద అమెరికా తెస్తున్న ఒత్తిడి, సృష్టించిన పరిస్థితిని చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నదని మన నరేంద్రమోడీ సర్కార్ అమెరికాకు నివేదించినట్లు 2023 ఆగస్టు 28వ తేదీ హిందూస్తాన్ టైమ్స్ పత్రిక రియాజుల్ హెచ్ లస్కర్ పేరుతో రాసిన ఒక సమీక్ష పేర్కొన్నది.
భారత్‌కు తలనొప్పి వ్యవహారమే!
బంగ్లా పరిణామాలు మరోసారి అమెరికాకు అనుకూలంగా మారితే అది చైనాను దెబ్బతీయాలని కోరుకొనే శక్తులకు సంతోషం కలిగిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. అయితే అదే సమయంలో మనకూ ఇబ్బందే. ఉక్రెయిన్ సంక్షోభంలో తటస్థంగా ఉన్నందుకు మనమీద కసితో ఉన్నా, ఇతర అంశాలలో మద్దతిస్తున్న కారణంగా మింగా కక్కలేకుండా ఉంది. ప్రతిపక్ష బిఎన్‌పికి మతోన్మాద జమాతే ఇస్లామీ మద్దతు, దానికి పాకిస్థాన్‌తో సంబంధాలున్నందున షేక్ హసీనా గెలవటం మన దేశానికి ఊరట కలిగించే అంశంగా భావించారు. ఇప్పుడు అమెరికా అనుకూల మిలిటరీ లేదా బిఎన్‌పి అధికారానికి వస్తే మనకు తలనొప్పి వ్యవహారమే. మన మీద ఒత్తిడి తెచ్చేందుకు, ఇరకాటంలో పెట్టేందుకు అమెరికా చూస్తుంది. బంగ్లా పరిణామాల గురించి వివరించేందుకు ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ప్రతిపక్షాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు విదేశాంగ మంత్రి జై శంకర్ ప్రకటించారు. మిలిటరీ అధికారాన్ని స్వాధీనం చేసుకోవటాన్ని అమెరికా స్వాగతించింది.
అనధికారిక చొరబాట్లను నిరోధించేందుకు మన ప్రభుత్వం సరిహద్దు భద్రతా దళాలను అప్రమత్తం చేసింది. బంగ్లాదేశ్‌లో జరిగిన అనేక పరిణామాల వెనుక గతంలో అమెరికా హస్తం ఉన్నందున ఇప్పుడు కూడా ఆ కోణాన్ని తోసిపుచ్చలేము. హసీనా ప్రభుత్వ వైఫల్యాలతో నిరుద్యోగం, దారిద్య్రం పెరిగిన కారణంగా అసంతృప్తి తలెత్తింది.ఈ స్థితిలో బంగ్లా విముక్తిపోరులో పాల్గొన్నవారి వారసులకు 30శాతం రిజర్వేషన్లు ప్రకటించటం ప్రభుత్వ వ్యతిరేకులకు కలసివచ్చింది. సుప్రీంకోర్టు దాన్ని ఐదుశాతానికి, మొత్తంగా రిజర్వేషన్లను ఏడు శాతానికి పరిమితం చేయటంతో యువత ఆందోళన సద్దుమణిగింది. అయితే అనూహ్యంగా హసీనా రాజీనామా డిమాండ్‌తో మరోసారి వీధులకు ఎక్కారు. వారిని అధికార అవామీలీగ్ మద్దతుదారులు ఎదుర్కోవ టంతో మరోసారి నెత్తురోడింది. అప్పటివరకు ప్రభుత్వ ఆదేశాలను అమలు జరిపిన మిలిటరీ ఆది, సోమవారాల్లో జరిగిన పరిణామాల్లో వ్యతిరేకంగా మారింది. హసీనా జాతి నుద్దేశించి టీవీలో మాట్లాడ కూడదని ఆదేశించటంతో పాటు రాజీనామా చేసి 45 నిమిషాల్లో దేశం వదలిపోవాలని అల్టిమేటం జారీచేసినట్లు వార్తలు వచ్చాయి. కేవలం నెలన్నర క్రితమే మిలిటరీ నూతన అధికారిగా బాధ్యతలు చేపట్టిన వాకర్ ఉజ్ జమాన్ తన స్థానాన్ని పటిష్టపరుచుకొనేందుకు ఇన్ని వారాలు చూసినట్లు కనిపిస్తోంది.
ఎం కోటేశ్వరరావు
8331013288