హస్తం అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి

– రెండో జాబితాలో చోటు
– ఇబ్రహీంపట్నం మల్‌ రెడ్డి వర్గీల ఆనంద హేలా అసెంబ్లీ బరిలో నాలుగోసారి
– 2009 ఎన్నికల్లో ఇ.పట్నంలో టీడీపీ చేతిలో ఓటమి
– 2014లో మహేశ్వరంలోనూ తప్పని ఓటమి
– 2018లో కాంగ్రెస్‌, టీడీపీకి రెబల్‌గా బీఎస్పీ నుంచి పోటీ చేసినా తప్పని ఓటమి
– 2023లో హస్తం గుర్తుపై బరిలోకి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీలో వర్గ పోరు సమసి పోలేదు. ఇంకా ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో కొనసాగుతోంది. ఎవరికి వారు టికెట్‌ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. మర్రి నిరంజన్‌ రెడ్డి, దండెం రాంరెడ్డి, ఈసీ శేఖర్‌ గౌడ్‌, కొత్త కురుమ శివకుమార్‌, ఆయన సతీమణి కొత్త కురుమ మంగ తదితరులు టికెట్‌ వేటలో పడ్డారు. చివరివరకూ తమకే టిక్కెట్‌ వస్తుందని డంక బజాయించారు. చివరకు రెండో జాబితాను అధిష్టానం శుక్రవారం సాయంత్రం ప్రకటించడం.. ఆ జాబితాలో ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా మల్‌రెడ్డి రంగారెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపింది. దీంతో ఇన్నాళ్ల ఉత్కంఠతకు తెరపడింది.
అసమ్మతి సమసిపోయేనా?
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్‌లో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి సమసిపోయేనా అన్న చర్చ ముందుకు వస్తోంది. ఒకరికి టికెట్‌ వస్తే మరోకరు రెబల్‌గా పోటీ చేసే ఆనవాయితీ ఆ పార్టీకే దక్కుతుంది. ఈ తరుణంలో చివరి కంట అభ్యర్థిత్వం కోసం ఆశపడిన మర్రి నిరంజన్‌ రెడ్డి, దండం రాం రెడ్డి ఏ మేరకు మల్‌ రెడ్డి రంగారెడ్డికి సహకరిస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వారు కాంగ్రెస్‌ పార్టీ గెలుపునకు పని చేస్తారా లేక రెబల్‌గా పోటీల్లో నిలుస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే వారు ప్రచార రథాలను సిద్ధం చేసుకుని నియోజకవర్గంలో తిప్పారు.
నాలుగో సారి కలిసివచ్చేనా
మల్‌ రెడ్డి రంగారెడ్డి నాలుగోసారి పోటీ చేస్తున్నారు. మూడు పర్యాయాలు ఆయన ఓటమిపాలయ్యారు. 2009లో ఇబ్రహీంపట్నం కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం 2014లో మహేశ్వరం నుంచి తీగల కష్ణారెడ్డి పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇబ్రహీంపట్నంలో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన క్యామ మల్లేష్‌ పై ఆయన సోదరుడు మల్‌ రెడ్డి రాంరెడ్డి రెబల్గా పోటీ చేసి స్వల్ప ఓట్లతోనే కిషన్‌ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా సామ రంగారెడ్డికి అవకాశం కల్పిస్తే మల్‌ రెడ్డి రంగారెడ్డి రెబల్‌గా బీఎస్పీ ఏనుగు గుర్తుపై పోటీ చేసి మరోసారి మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి చేతిలో ఓటమిని చవిచూశారు. ఇక 2023లో జరగనున్న ఎన్నికల్లో నాలుగోసారి తన అదష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈసారి కూడా ప్రధానంగా మంచి రెడ్డి కిషన్‌ రెడ్డి, మల్‌ రెడ్డి రంగారెడ్డి మధ్యనే పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మల్‌రెడ్డి వర్గం సంబురాలు
రెండవ జాబితాలో మల్‌ రెడ్డి రంగారెడ్డికి టికెట్‌ ఖరారు కావడంతో ఆయన వర్గీయులు ఇబ్రహీంపట్నంలో సంబురాలు చేసుకున్నారు. అంబేద్కర్‌ చౌరస్తా వద్ద బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్‌ టికెట్‌ తెచ్చుకోవడమే మొదటి విజయంగా ఆయన వర్గం భావిస్తోంది. గెలుపు కోసం కృషి చేస్తామని నినాదాలు చేశారు.