ఆ మ్యాజిక్‌ ఏమైంది?

What happened to that magic?స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ‘మిస్టర్‌ బచ్చన్‌’, ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రాలు గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చాయి. క్రేజీ కాంబోలో ఈ సినిమాలు రూపొందడంతో సర్వత్రా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘షాక్‌’, ‘మిరపకారు’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత రవితేజ, హరీష్‌ శంకర్‌ కలయికలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. ఇది బాలీవుడ్‌లో అజరుదేవగన్‌ నటించిన ‘రైడ్‌’ చిత్రానికి రీమేక్‌గా రూపొందింది.  రీమేక్‌లను హిట్‌ సినిమాలుగా మలచటంలో దర్శకుడు హరీష్‌శంకర్‌ దిట్ట. దీనికి ‘గబ్బర్‌సింగ్‌’, ‘గద్దలకొండ గణేష్‌’ చిత్ర విజయాలే ప్రత్యక్ష ఉదాహరణ. అయితే ఒరిజినల్‌ ‘రైడ్‌’ చిత్రంలోని లైన్‌ి మాత్రమే తీసుకుని దర్శకుడు హరీష్‌శంకర్‌ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని ప్రజెంట్‌ చేశాడు. నిజాయితీగల ఇన్‌కమ్‌టాక్స్‌ ఆఫీసర్‌గా రవితేజ తన మార్క్‌ యాక్టింగ్‌తో మెస్మరైజ్‌ చేసినప్పుటికీ, కథానాయిక భాగ్యశ్రీ బోర్సే అందాలు, హరీష్‌శంకర్‌ శైలి డైలాగ్స్‌, కళ్ళు చెదిరే విజువల్స్‌, రిచ్‌ నిర్మాణాత్మక విలువలు, వినసొంపైన సంగీతం.. ఉన్నప్పటికీ కథలో బలమైన కంటెంట్‌ లేకపోవడం బిగ్గెస్ట్‌ మైనస్‌ అయ్యింది. మాతృకలోని ఆత్మ మిస్‌ కావడంతోపాటు పేలవంగా పేర్చుకుంటూ పోయిన సన్నివేశాలతో సినిమా అందర్నీ నిరాశపర్చింది. ఇక ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ విషయంలోనూ ఇదే పంథా నడిచింది. రామ్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమా విశేష ప్రేక్షకాదరణతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీనికి సీక్వెల్‌గా ఇదే కాంబోలో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ రూపొందింది. అయితే ఈ సినిమా కూడా కథ విషయంలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీనికీ కారణం ఒకటే..బలమైన కంటెంట్‌ లేకపోవడమే. ‘ఇస్మార్ట్‌శంకర్‌’లో రామ్‌ నట విశ్వరూపాన్ని చూశాం. ఇందులోనూ ఆయన పాత్ర తీరుతెన్నులు అదే స్థాయిలో ఉన్నాయి. రామ్‌ తన నటనతో మరోమారు స్క్రీన్‌పై మ్యాజిక్‌ చేశాడు. ఇక ఇందులోనూ నాయిక కావ్యాథాపర్‌ అందాలు, పూరి మార్క్‌ డైలాగులు, సాంకేతిక నిపుణుల పని తీరు బాగున్నప్పటికీ కథలోని లోపం కారణంగా రంజింపజేయ లేకపోయింది. ‘మిస్టర్‌ బచ్చన్‌’, ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ ఈ రెండు సినిమాల విషయంలో ఉన్న కామన్‌ పాయింట్‌ ఒకటే.. పేలవమైన కథా, కథనాలు. ఈ విషయంలో దర్శకులు పూరి జగన్నాథ్‌, హరీష్‌శంకర్‌ కథలపై పూర్తి కసరత్తు చేయకుండా మితిమీరిన ఆత్మవిశ్వాసంతో సినిమాలను చేశారని ఫలితం తేల్చి చెప్పింది. దీంతో వీరి గత సినిమాల్లో కనిపించిన హిట్‌ మ్యాజిక్‌ వీటిల్లో అసలు కనిపించకుండా పోవడంతో అటు దర్శక, హీరోల అభిమానులకు, ఇటు ప్రేక్షకులకు నిరాశే మిగిలింది.
– రెడ్డి హనుమంతరావు