విద్వేష వివాదాలు, విశాల ప్రయోజనాలు!

Hate disputes, broad benefits!మీడియా వికృత పోస్టులు, నేతల విద్వేష ప్రసంగాలతో దేశంలో రాజకీయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. వ్యక్తిగత అసభ్యత, కుల మత తత్వాలను రెచ్చగొట్టడం, కుటుంబాలను, మహిళలను కించపర్చడం నిత్యకృత్యంగా మారుతున్నాయి. పాలకవర్గ పార్టీలు తాము అధికారంలో వుంటే ఒక విధంగా, ప్రతిపక్షంలో వుంటే మరో విధంగా స్పందిస్తున్నాయి.మీడియాపై వారికివున్న పట్టును బట్టి దేన్ని పెద్దది చేయాలి? ఏది పక్కకు తోసేయాలి అన్నది కూడా ఆ ప్రకారమే జరిగిపోతున్నది. సాధారణ ప్రజానీకం, ఆలోచనాపరులు, ప్రజాస్వామిక వాదులకు మాత్రం ఈ వాతావరణం దుర్భరంగా మారుతున్నది. కొత్త ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లోనైతే టీడీపీ-జనసేన కూటమికీ వైసీపీకి మధ్య దీనిపై కురుక్షేత్రమే నడుస్తున్నది. రోజూ కేసులు, అరెస్టులు, దాడులు, ప్రతిదాడులతో ప్రకంపనలు సాగుతున్నాయి.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోషల్‌ మీడియాపై ప్రత్యేక అధ్యయనానికి పిలుపునిచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సర్కారు ఏకంగా ఒక చట్టమే తెస్తానంటున్నది. మాజీ ముఖ్యమంత్రి జగన్‌, ఆయన వైసీపీ ఇదే సమస్యగా మాట్లాడుతున్నారు. రెండు పార్టీలు వాటి శ్రేణులు అవతలివారినే దోషులుగా చూపిస్తూ తాము చేసినవన్నీ సరైనవన్నట్టు వ్యవహరి స్తున్నాయి. జాతీయ స్థాయిలోనూ బీజేపీ మత రాజకీయాలు,ఆయా రాష్ట్రాల పరిస్థితిని బట్టి విభిన్న రాజకీయ శక్తులు కూడా ఇదే తరహాలో పావులు కదుపుతున్నాయి. వీటన్నిటి మధ్యలో మీడియా, సోషల్‌ మీడియాల అర్థమే మారిపోతున్నట్టు కనిపిస్తున్నది.మరోవైపు ఈ పేరుతో మీడియా స్వేచ్ఛపైనే దాడిచేసే ధోరణులూ పెరగడం కూడా ఆందోళన కలిగిస్తుంది.
‘అసభ్య’ యుద్ధం
ఏపీలో ఎన్నికలకు బాగా ముందునుంచే రెండు ప్రధాన పాలకపార్టీలు పోటాపోటీగా సోషల్‌ మీడియా సమ్మేళనాలు జరిపి యుద్ధానికి సిద్ధం చేశాయి.పాలక వైసీపీపైన, ముఖ్యమంత్రి జగన్‌ పోకడలపైనా తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు నడిచాయి. అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజు, తెలుగుదేశం ప్రతినిధులు కొందరు తనను అవమానించారంటూ వైసీపీ ప్రభుత్వం అరెస్టులు చేయడం,కస్టడీలో చిత్రహింసలు దేశవ్యాపిత చర్చకూ కేసులకూ కారణమైనాయి.ఈ కేసుల నేపథ్యంలో హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపైనా అభ్యంతరకరపోస్టులు నడవడంతో న్యాయస్థానాలు కూడా ఆగ్రహోదగ్రమ య్యాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణిపై హీనమైన నిందలు వేసిన మాజీ టీడీపీ కమ్‌ వైసీపీ సభ్యుడి నిర్వాకాన్ని ఖండించకపోగా సభ వేదికపై పరోక్షంగా పాలకపక్షం వంతపాడటంతో ఆయన సభను బహిష్కరి స్తున్నట్టు ప్రకటించారు. ఆ సమయంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్న చిత్రాన్ని వైసీపీ దాదాపు ఒక చిహ్నంలాగా వైసీపీ మీడియా ఎన్నికల పొడుగునా వాడింది. మరో వైపు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌లో చేరి అధ్యక్షపదవి చేపట్టి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. అదే సమయంలో చంద్రబాబు అరెస్టు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఓట్లు చీలకుండా చూస్తానని ప్రకటించడం, బీజేపీని కూడా కలుపుకోవడంతో ఎన్‌డిఎ పెద్ద విజయం సాధించింది. అంతకుముందే పవన్‌ వివాహంపై వికృతదాడి చేస్తున్న వైసీపీ తర్వాత షర్మిల పైనా దాడి ప్రారంభించింది. ఆఖరుకు విజయమ్మ షర్మిలపైన కూడా దారుణమైన పోస్టులు సోషల్‌ మీడియా నుంచి వెలువడ్డాయి. ఛానళ్లు కూడా అటోఇటో విడిపోయి ఒకరినొకరు బహిష్కరించు కుని తమ వేదికలపై తమకు అనుకూలంగా ప్రచారాలు చేసుకోవడంతో అసలు మీడియా దృశ్యమే మారిపోయింది.
తాజా సన్నివేశం..
గతంలో వైసీపీ సర్కారు అరెస్టులు చేయిస్తే ఎన్నికల తర్వాతా ఆ అవకాశం టీడీపీ-జనసేనలకు వచ్చింది. వాటన్నిటికి గుణపాఠం చెబుతామన్న వైఖరిని సర్కారు చేపట్టింది. వందలమందికి నోటీసులు, అనేక మంది అరెస్టయ్యారు. ఇప్పుడు వైసీపీ నేతలు మానవహక్కులపై దాడి అని ఆందోళనలు చేస్తున్నారు.హైకోర్టును ఆశ్రయిస్తే మానవహక్కులకు భంగం కలిగేలా వ్యవహరించడం తగదనీ, కానీ ఇష్టానుసారం సోషల్‌మీడియాను విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తే చట్టపరిధిలో చర్య వుండాల్సిందేనని తేల్చింది. తమ న్యాయవ్యవస్థపైనా పోస్టులు పెట్టిన సంగతి గుర్తు చేసింది.ఈ మధ్య కూడా తిరుపతి లడ్డూ విచారణలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తే వెంటనే సుప్రీంకోర్టు న్యాయమూర్తిపైనా వ్యక్తిగత ఆరోపణలతో టీడీపీ అనుకూల మీడియాలో పోస్టులు,వ్యాఖ్యలు వెలువడ్డాయి.జనసేన ముందునుంచీ పవన్‌ను ఎవరైనా ఏదైనా అంటే అభిమానులు ఎంతదూరమైనా వెళ్లి దాడిచేస్తారనే విధానం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్‌ భార్య భారతి కూడా ఒక టార్గెట్‌గా మారారు. మరోవైపు భువనేశ్వరి, విజయమ్మ, షర్మిలపై వికృత వ్యాఖ్యల కారణంగా సహజంగానే వైసీపీ సోషల్‌ మీడియా ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్నది. ఇప్పటికైనా పునరాలోచన లేకపోగా ఈబూతు పోస్టులన్నీ ప్రజల సమస్యలపై ప్రశ్నించడంగా సమర్థించుకోవడం జరుగుతున్నది. పైగా ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేసి ఈ సోషల్‌ మీడియా ప్రచారకులకు జీతాలు చెల్లించడం వంటి ఆరో పణలూ వచ్చాయి.అన్నిటికీ తన ఎదురుదాడి సమాధానమన్నట్టు వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. మాపైన పోస్టులు పెట్టిన టీడీపీ-జనసేన వారి మాటేమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే వారి పాలనలో ఈ కారణంగానే పలువురిని అరెస్టులు చేసిన సంగతి మర్చిపోతున్నారు.
విద్వేష వ్యూహాలు, మతతత్వాలు
ఏమైనా ఈ జాడ్యం ఒకరికో లేక ఒక పాలకపార్టీకో పరిమితమైంది కాదని చెప్పాలి. రాజకీయ విధానపరమైన అంశాలపై ఎన్ని విమర్శలైనా చేయొచ్చు, కోర్టులకూ వెళ్లవచ్చు కానీ ఇష్టానుసారం నిందారోపణలు, అసభ్య కథనాల గుమ్మరించడం అనుమతించరానిది. తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ఖన్నా, సంజరుకుమార్‌ల ధర్మాసనం చేసిన కీలక వ్యాఖ్యలు దీనికి సమాధానమిస్తాయి. విద్వేష ప్రసంగాలు, వ్యాఖ్యలపై తక్షణం సూమోటాగా కేసు పెట్టవలసిందేనని, అందుకు ఎవరూ ఫిర్యాదు చేయవలసిన అవసరం కూడా లేదని చెప్పింది.అలా కాకుండా రెచ్చగొట్టే ప్రసంగాల వంటివాటిని మరో కోణంలో చూడాలన్నది వారి నిర్ధారణ. మరోవంక మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్‌ వెంకటేశ్‌, నటి కస్తూరి శంకర్‌ తెలుగువారి చరిత్రపై చేసిన వ్యాఖ్యలకు సారీ చెప్పానంటే సరిపోదనీ, చట్టపరంగా చర్యలు ఎదుర్కొవలసిందేనని అంటూ ముందస్తు బెయిల్‌ నిరాకరించారు. బీజేపీ మద్దతుదారుగా ఆమె ద్రావిడ రాజకీయాలను వ్యతిరేకించేందుకు తెలుగువారిని కించపర్చడం దిగ్భ్రాంతి కలిగించింది. స్వయంగా ప్రధాని మోడీ జార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో ముస్లిములకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంపై సీపీఐ(ఎం) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కానీ, చర్యలు లేవు. కరళలోనైతే సీపీఐ(ఎం) నేతల కుటుంబాలకు వ్యతిరేకంగా విచ్చలవిడిగా కథనాలు ప్రచారం చేసిన కాంగ్రెెస్‌, బీజేపీ కార్యకర్తలు కేసులను ఎదుర్కొంటున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఈ తరహా దాడులెన్నో చేసిన యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం విమర్శించే యూట్యూబర్లపై కక్షకట్టి దాడి చేస్తే సుప్రీంకోర్టు అడ్డుపడింది.బుల్డోజర్‌ జస్టిస్‌ కూడా కుదరదన్నది.మరోవంక తమకు అనుకూలమైన వారికి ఏకంగా ఎనిమిది లక్షల వరకూ యాడ్స్‌ రూపంలో ముట్టచెప్పేందుకు అదే ప్రభుత్వం బిల్లు తెచ్చింది,యోగి ఆదిత్యనాథ్‌లా అణచివేయాలని పిలుపునిచ్చిన పవన్‌ కళ్యాణ్‌ ఇవన్నీ గమనించారో లేదో తెలియదు.అర్నబ్‌ గోస్వామి వంటివారిని నేరుగా అమిత్‌షా ఆదుకోవడం, మరోవైపున ‘వైర్‌’, ‘న్యూస్‌క్లిక్‌’ వంటివాటిపై దాడి చేయడం దేశమంతా చూసింది.వామపక్షాలు ప్రజా సంఘాల నాయకుల అరెస్టులు సాగుతూనే వున్నాయి. కానీ పాలక పార్టీల కీలక నేతలలో ఎవరిని ఎప్పుడు అరెస్టు చేస్తారనేదే చర్చగా మారుతోంది,
తెలుగు రాష్ట్రాల్లోనూ అఘోరి నుంచి తిరుమల వివాదం వరకూ ప్రతి సందర్భంలోనూ చాపకింద నీరులా ఈ మతకోణం కూడా కొనసాగుతున్న తీరు విస్మరించరానిది.ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ సనాతన ధర్మ ప్రచార వ్యూహం చేపట్టడం, టీవీ5తోపాటు హిందూధర్మం ఛానల్‌ యజమానిని టీటీడీ బోర్డు చైర్మన్‌గా నియమించాక కొండపై అన్యమతస్తుల చర్చ పెరగడంలో రాజకీయ సంకేతాలున్నాయనీ గ్రహించడం అవసరం. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌ విజయం గురించి కూడా ఇలాగే పోస్టులు పెట్టడం దేశవ్యాపితంగా జరిగింది. ‘ఎక్స్‌’ యజమాని ఎలన్‌మస్క్‌ ఏకంగా ట్రంప్‌ బృందంలో సభ్యుడు కావడం కూడా ఈ ధోరణికి పరాకాష్ట.ఈ క్రమంలో హిందూత్వను, బీజేపీని ప్రశ్నించకుండా ప్రసన్నం చేసుకునే ధోరణులు పెరిగిపోతున్నాయి. వీక్షకులనుే ఏది ఆకర్షిస్తే అది, ఏది చూస్తే అది ఇస్తూ సోషల్‌ మీడియాను లాభర్జనా సాధనంగా చూడటం వల్ల కూడా తప్పులు జరుగుతున్నాయి.
సమస్యలపై దృష్టి?
వీటన్నిటి ఫలితంగా కార్మికుల హక్కులు, విశాఖ ఉక్కు రక్షణ, రెండు రాష్ట్రాల్లోనూ గిరిజనుల హక్కులు అటవీభూములు, గిట్టుబాటు ధరలు, వ్యవసాయరంగ సవాళ్లు, మహిళలపై లైంగికదాడులు, ఉద్యోగాల కల్పన, విద్యారంగం, కేంద్రం సహాయంకై పోరా టం తదితర కీలకాంశాలు తెరమరుగైపోవడం, ప్రజా ప్రయోజనాల కోణంలో గాక ఆయా పాలక పార్టీల నేతలను కీర్తించడం, దూషించడానికే పరిమితం కావడం, ఆఖరుకు వందల ఏళ్లు వుండాల్సిన ప్రాజెక్టులపైన కూడా సమగ్ర చర్చ జరక్కపోగా ఆరోపణల యుద్ధంలా కాంట్రాక్లర్ల మార్పులా మారిపో యింది. రేవంత్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథరెడ్డి వంటి నాయకులు మాత్రం ప్రత్యేకంగా కమ్యూనిస్టు పత్రికలను ఇందుకు మినహాయింపుగా పేర్కొనడం గమనించదగ్గది. ఆ మీడియాలో, పత్రికలలో ఎందుకు ఇలాంటి వివాద గ్రస్తమైన నిరాధారమైన కథనాలు రావని వారు సూటిగానే ప్రశ్నించారు.
మీడియా మాయాజాలం గురించి నామ్‌చామ్‌స్కీ వంటివారు ఎప్పుడో చెప్పేశారు. కాగా అందరికీ అందుబాటులో వుండే సోషల్‌ మీడియాను కూడా ప్రజల ప్రయోజనాల కోణంలో గాక పాలక పార్టీల పాక్షిక వ్యూహాల కోసం ఎలా దారి తప్పిస్తున్నదీ ఈ పరిణామాలు చెబుతున్నాయి.తప్పులపై చర్యలు తప్పనిసరి కానీ అది అన్ని వైపుల నుంచి జరగాలి. కోర్టుకేసులే గాక ఎన్నికల సంఘం, ప్రెస్‌ కౌన్సిల్‌,మానవ హక్కుల సంఘం, మహిళా కమిషన్ల వంటివి నిష్పాక్షికంగా చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామిక హక్కులు, మీడియా భావ ప్రకటనా స్వేచ్చను కాపాడుకోవడంతో పాటు దాన్ని ప్రజల విశాల ప్రయోజనాల కోసం సద్వినియోగ పర్చడమే ఇప్పడు సవాల్‌. ప్రజాస్వామిక లౌకిక విలువలే కొలబద్దలుగా రెచ్చగొట్లే శక్తుల పట్ల, కుటిల రాజకీయ సామాజిక వ్యూహాల పట్ల అప్రమత్తంగా వుంటూ ప్రజలను చైతన్యపర్చడం కోసం శాయశక్తులా కృషి చేయడమే జరగాల్సింది.

– తెలకపల్లి రవి