ఆగాల్సిందే..!

Have to wait..!– ముందు జనగణన… ఆ తర్వాత పునర్విభజన
– అవి పూర్తయితేనే చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం
న్యూఢిల్లీ : ఎట్టకేలకు మహిళా రిజర్వేషన్‌ బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. చట్టసభలలో మహిళలకు 33% సీట్లు కేటాయించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును అన్ని పక్షాలూ సమర్ధిస్తున్న నేపథ్యంలో దీనికి ఆమోదం లభించడం కష్టమేమీ కాదు. అయితే చట్టసభలలో మహిళా రిజర్వేషన్లు అమలులోకి రావాలంటే ముందుగా జనగణన తప్పనిసరి. రెండు సంవత్సరాల క్రితం అంటే 2021లో జరగాల్సిన జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది. జనగణన జరిగి, దాని ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజ ప్రక్రియ పూర్తయితేనే మహిళా రిజర్వేషన్లు అమలులోకి వస్తాయి. షెడ్యూల్‌ ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన 2026లో జరగాల్సి ఉంది. కాబట్టి దానికి ముందే జనగణన కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. ఇక్కడ మరో విషయాన్ని కూడా గమనించాల్సి ఉంది. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు పార్లమెంట్‌ ఉభయసభలు ఆమోదం తెలిపినప్పటికీ రాష్ట్రాల శాసనసభలు కూడా వేర్వేరుగా తీర్మానాలు చేయాల్సి ఉంటుంది. ఈ కసరత్తు పూర్తి కావాలంటే 2029 లోక్‌సభ ఎన్నికల వరకూ వేచి చూడక తప్పదు. అప్పుడే చట్టసభలలో మెరుగైన ప్రాతినిధ్యం కోసం మహిళలు కన్న కలలు నిజమవుతాయి. 2011లో చివరిసారిగా జనగణన జరిగింది. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలను సేకరించాల్సి ఉంది. కానీ కోవిడ్‌ కారణంగా 2021లో ఆ పని జరగలేదు. కోవిడ్‌ ప్రభావం తగ్గి, జనజీవనం సాధారణ స్థాయికి చేరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం జనగణన ఊసే ఎత్తడం లేదు. భారత రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఆర్‌జీఐ) ఇటీవల జారీ చేసిన రెండు నోటిఫికేషన్లలోనూ జనగణన ఆలస్యం కావడానికి కారణాలు వివరించ లేదు. జూన్‌ 30న అదనపు ఆర్‌జీఐ ఓ ఆదేశాన్ని జారీ చేశారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్‌-మేలో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆ లోగా నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశమే లేదని అందులో తేల్చి చెప్పారు.
దాటవేత సమాధానాలు
జిల్లాలు, తాలూకాలు, ఉప-జిల్లాలు, రెవెన్యూ గ్రామాలు, మున్సిపాలిటీలు, పోలీస్‌ స్టేషన్లు, పట్టణాలకు సంబంధించిన పాలనాపరమైన సరిహద్దులను నిర్ణయించే ప్రక్రియ 2020 నుండి ఎనిమిది సార్లు వాయిదా పడింది. ఈ ప్రక్రియ గడువును ప్రతి 3-6 నెలలకు ఒకసారి పొడిగిస్తూనే ఉన్నారు. సాధారణంగా జనగణనకు ముందు ఈ ప్రక్రియను నిలిపివేస్తారు. పాలనాపరమైన సరిహద్దులు నిర్ణయించాలంటే ఎన్యూమరేటర్లుగా నియమితులయ్యే ప్రభుత్వోద్యోగులకు కనీసం మూడు నెలల సమయం అవసరమవుతుంది. జనగణన ఆలస్యానికి కారణమేమిటని మంత్రులు, అధికారులను ప్రశ్నిస్తే సమాధానాలు దాటవేస్తున్నారు. కేంద్ర హోం శాఖ అధికారిని అడిగితే ‘మేము అన్నివిధాలా సన్నద్ధంగా ఉన్నాము. అంతా సిద్ధం. కానీ రాజకీయ నిర్ణయం జరగాల్సి ఉంది’ అని బదులిచ్చారు. జనగణన కసరత్తుపై ఒక సీనియర్‌ కేంద్ర మంత్రిని కదిలిస్తే ‘నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రకటిస్తాం. నోటిఫై చేస్తాం. దేనినీ రహస్యంగా ఉంచం’ అని చెప్పుకొచ్చారు.
కాలం చెల్లిన సమాచారంతో…
వివిధ ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న సమాచారానికి ఎప్పుడో కాలం చెల్లిపోయిందని మాజీ డిప్యూటీ ఆర్‌జీఐ కె.నారాయణన్‌ ఉన్ని చెప్పారు. ‘ఆహార భద్రతా చట్టం కింద లబ్దిదారులను ఎంపిక చేసేందుకు కాలం చెల్లిన 2011 జనగణన సమాచారాన్నే ఉపయోగిస్తున్నారు. దీంతో దేశంలో పది కోట్ల మందికి ఆహార భద్రత లభించడం లేదు. అప్పటి జనగణన లెక్కల ఆధారంగానే ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ వంటి సర్వేలు నిర్వహించడం వల్ల విశ్వసనీయ అంచనాలు రావడం లేదు. ఇప్పటికీ కొన్ని గ్రామాలలో మహిళల అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది. జనగణన జరిపితే ఇలాంటి గ్రామాలను గుర్తించి, మెరుగైన ఫలితాలు సాధించ డానికి కార్యక్రమాలను రూపొందించు కోవడం సాధ్యపడుతుంది’ అని ఆయన వివరించారు.
రాష్ట్రాల ప్రాతినిధ్యంపై అనుమానాలు
లోక్‌సభలో స్థానాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే జనగణన పూర్తయిన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఈ ప్రక్రియలో రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం దక్కదేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజించడం, కేంద్ర నిధులలో రాష్ట్రాల వాటాను నిర్ణయించడం వల్ల తమకు నష్టం వాటిల్లుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ కార్య క్రమాన్ని మరింత సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాయి. దీంతో దక్షిణాదిన శిశు జననాలు తగ్గిపోతు న్నాయి. ఫలితంగా జనాభాలో పెరుగుదల కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పునర్వి భజన ప్రక్రియలో తమకు అన్యాయం జరుగుతుం దని దక్షిణాది రాష్ట్రాలు అనుమానిస్తున్నాయి.