‘భోపాల్‌’పాఠాలు నేర్చామా?

Have we learned the lessons of 'Bhopal'?భారత పారిశ్రామిక చరిత్రలో మరచిపోలేని విషాద సంఘటనగా మిగిలిన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ దుర్ఘటన నుండి పాఠాలు నేర్చుకున్నామా? యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీ కక్కిన విషంతో భోపాల్‌ మృత్యు నగరంగా, శవాల దిబ్బగా మారి మారి నలభై ఏండ్లు గడిచిపోయాయి. కానీ, ఇప్పటికీ దాని దుష్ప్రభావాలు వెంటాడుతున్న నేపథ్యంలో అటు వంటి దారుణాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటున్నామా? ఈ ప్రశ్నకు సమాధానం లేదనే! సరళీకరణ ఆర్థిక విధానాల నేపథ్యంలో ప్రజల ప్రాణాలకన్నా, పెట్టుబడిదారుల, కార్పొరేట్ల అడుగులకు మడుగులొత్తడమే పాలకులకు ప్రాధాన్యతగా మారింది. భోపాల్‌ స్థాయిలో కాకపోయినా తెలుగు రాష్ట్రాల్లోనూ పారిశ్రామిక ప్రమాదాలు కొనసాగుతుడటం విచార కరం. ఏపీలోని విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌, ఆస్థాయిలో కాకపోయినా తెలంగాణలో సంగారెడ్డి, పటాన్‌చెరు, ఐడిఏ బొల్లారం ప్రాంతాల్లో పరిశ్రమల్లో నిత్యం ఏదో ఓ ప్రమాదం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అయినప్పటికీ పరిశ్రమల అభివృద్ధి కోసం నెత్తురు చిందించే కార్మికులు, వాటి ఏర్పాటు కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసే ప్రజల ప్రయోజనాలను పాలకులు విస్మరిస్తూనే ఉన్నారు. భోపాల్‌ బాధిత ప్రజానీకం తమ సొంత పట్టణంలోనే కాందిశీకులుగా మారామని విలపిస్తున్నారు. ప్రభుత్వాల విధానాలు ఇలాగే కొనసాగితే మన రాష్ట్రం లోనూ అటువంటి దుస్థితి ఏర్పడే ప్రమాదం లేకపోలేదు.
ఆ రోజు ఏం జరిగింది?
1984 డిసెంబర్‌ 2వ తేదీ రాత్రి ‘యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీ’ నుండి ఒక్కసారిగా వెలువడిన విష వాయువులు భోపాల్‌ నగరాన్ని చుట్టుముట్టాయి. ఏం జరుగుతోందో అర్ధంకాక, ఊపిరాడక నిద్రలో ఉన్న వారు నిద్రలోనే ప్రాణాలు విడిచారు. విష వాయువుల బారి నుండి ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీసిన వారు రోడ్లపైనే తుదిశ్వాస విడిచారు. తెల్లవారే సమయానికి ఎక్కడ చూసినా శవాల కుప్పలతో భోపాల్‌ మృత్యు నగరంగా మారింది. ఈ దుర్ఘటనలో 10,047 మంది ప్రాణాలు కోల్పోయారని, 5,74,000 మంది విషవాయువుల ప్రభావానికి గురయ్యారని ప్రభుత్వ అంచనా! మృతుల సంఖ్య 15 వేల పైనే ఉంటుందని వివిధ స్వఛ్చంద సంస్థలు, సంఘాలు ప్రకటించాయి. రసాయన పారిశ్రామిక రంగంలో జపాన్‌లోని హీరోషిమా అణుబాంబు విస్ఫోటనంతో సమానమైనదిగా ఈ దారుణాన్ని నిపుణులు పోల్చారు. విష వాయువుల దుష్ప్రభావం ఇప్పటికీ వెంటాడుతోంది. ఈ విషాద సంఘటన జరిగిన ఇన్నేళ్ల తరువాత కూడా శిశువులు శారీరక, మానసిక వైకల్యంతో పుడుతూనే ఉన్నారు. భూగర్భ జలాలు విషతుల్యంగానే ఉన్నాయి.నష్టపరిహారం కోసం బాధిత కుటుంబాలు న్యాయస్థానాల చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉన్నాయి.
ప్రస్తుత పరిస్థితేమిటి?
నలభై ఏళ్ల తరువాత కూడా భోపాల్‌ ప్రజలను విషవాయువు దుర్ఘటన ప్రభావాలు వెంటాడుతున్నాయి. రోగ నిరోధక శక్తి గణనీయంగా తగ్గింది. కరోనా విజృంభించిన సమయంలో ఈ విషయం వెల్లడైంది. విషవాయువు ప్రత్యక్ష బాధితులతో పాటు వారి సంతానానిది కూడా ఇదే దుస్థితి. యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీ నుండి లీకైన విష వాయువు కారణంగా వేలాదిమంది శ్వాసకోస వ్యాధులకు గురైన సంగతి తెలిసిందే. వీరందరికి రోగ నిరోధక శక్తి కూడా తగ్గడంతో వారి సంతానంపై కూడా దాని ప్రభావం పడినట్లు తేల్చారు. మరోవైపు 1984 గ్యాస్‌ లీకయిన ప్పటి నుండి యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీ ప్రాంగణంలో పెద్ద ఎత్తున పడి ఉన్న విష పదార్థాలను ఇప్పటికీ తొల గించలేదు. వీటిని తొలగించాలని ఈ ఏడాది ప్రారంభంలో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు జారీ చేసింది. కానీ, అమలు అంతంత మాత్రమే. వీటిని ప్రాంగణంలోని మరో 23 చోట్ల ప్రధాన వ్యర్థాలను పూడ్చివేశారని, ప్లాంటుకు సమీపంలో ఉన్న ఒక చెరువులో కూడా వేల టన్నుల విష వ్యర్థాలను పూడ్చిపెట్టారని చెబుతున్నారు. వీటిని కూడా వెలికితీసి శాస్త్రీయ పద్ధతుల్లో నిర్మూలించాలని వీరు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, ఈ వ్యర్థాల ఉనికిని ప్రభుత్వం ఇంకా నిర్ధారించాల్సి వుంది. అంటే, ఈ సమస్య పరిష్కారం కావడానికి ఇంకా ఎన్ని తరాలు మారాలో, ఎందరు ప్రజలు నష్టపోవాలో ఊహించు కోవాల్సిందే! ఈ ఏడాది ప్రారంభంలో భోపాల్‌లోని యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీలో పేరుకు పోయిన విషపూరిత రసాయనిక వ్యర్థాలను తొలగించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి) ఆదేశాలు జారీ చేసింది. అయితే, అమలు అంతంత మాత్రమే! ఫలితంగా భూగర్భ జలాలు పెద్ద ఎత్తున కలుషితమయ్యాయి. ఈ నీటిని తాగిన వారు అనేక రోగాల బారిన పడుతున్నారు. విష వాయువు బారిన పడిన ఒక మహిళ అప్పటి నుండి ఇప్పటి వరకు (నలభై సంవత్సరాల కాలంలో) 150 కిలోల ఔషధాలు వాడినట్లు ఒక వార్తా సంస్థకు చెప్పారు. అటువంటి దుస్థితి మన రాష్ట్ర ప్రజలకు రాకూదని ఆశిద్దాం..!
– ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌