ఇసుక కదిలితే కూలిపోయేలా పేకమేడలు కట్టారా?

Isn't Kaleshwaram amazing..KCR should explain it first– కాళేశ్వరం అద్భుతం కదా..కేసీఆర్‌ ముందుండి వివరించాలి
– కారు, బస్సుల్లో రాలేకపోతే హెలిక్యాప్టర్‌ రెడీగా ఉంది

– తెలంగాణ సమాజానికి వాస్తవాలు తెలియాలి
– తప్పుకు కారులెవ్వరు? శిక్ష ఏమిటి? తేలాల్సిందే
– త్వరలో సభలో కాళేశ్వరంపై శ్వేతపత్రం: అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘ఇసుక కదిలితే కూలిపోయేలా పేకమేడలుగా కాళేశ్వరం బ్యారేజీలు కట్టారా?’ అని గత ప్రభుత్వాన్ని సీఎం ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం అద్భుతం కదా..అందువల్ల బీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత కేసీఆర్‌ ముందుండి దాని గురించి వివరించాలని కోరారు. కారు, బస్సుల్లో ఆయన రాలేకపోతే హెలిక్యాప్టర్‌ను కూడా బేగంపేటలో సిద్ధంగా ఉంచామని చెప్పారు. తెలంగాణ సమాజానికి కాళేశ్వరంపై వాస్తవాలు తెలియాలనీ, బుధవారమో, గురువారమో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేస్తారని ప్రకటించారు. కాళేశ్వరం కథేంటి? జరిగిన వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా? లేదా? తప్పు జరిగిందా లేదా? జరిగితే కారణం ఎవరు? శిక్ష ఏమిటి? అనే దానిపై సభలో చర్చించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. మేడిగడ్డ పర్యటనకు ముందు మంగళవారం శాసనసభలో సీఎం మాట్లాడారు. నీళ్ల కోసం నిప్పులు చెరిగేలా తెలంగాణ సమాజం పోరాటం చేసిందన్నారు. డాక్టర్‌ వైస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో దేవెందర్‌గౌడ్‌ పాదయాత్ర చేశారనీ, ప్రాణహిత చేవెళ్ల ద్వారా తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారని గుర్తుచేశారు. ప్రజల ఆలోచనను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాజెక్టును మొదలుపెట్టారనీ, మొదట 12 వేల ఎకరాలు అనుకుని ఆ తర్వాత 14 లక్షలకుపైగా ఎకరాలకు సాగునీరు అందించేందుకు 38,500 కోట్ల రూపాయలతో 2008లో టెండర్లు పిలిచారని తెలిపారు. సీనియర్‌ నేత వెంకటస్వామి సూచనతో ఆ ప్రాజెక్టుకు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టారని గుర్తుచేశారు. చేవెళ్లలో వేల కోట్ల రూపాయల పనులు కూడా పూర్తయ్యాయన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాళ్లు రీడిజైన్‌ అనే ఒక బ్రహ్మపదార్థాన్ని కనిపెట్టారనీ, తుమ్మిడిహెట్టి దగ్గర మొదలుపెట్టాల్సిన పనులను వివిధ మార్పులకు, చేర్పులకు గురుచేశారని విమర్శించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టి లిప్టులు కట్టి నీళ్లు ఎత్తిపోస్తామనీ, మిడ్‌మానేరు నుంచి మిగతా ప్రాంతాలకు నీళ్లు తరలిస్తామని చెప్పిన విషయాన్ని సీఎం ఈసందర్భంగా గుర్తుచేశారు. ప్రాజెక్టు వ్యయాన్ని 1,47,000 వేల కోట్ల రూపాయలకు పెంచారని విమర్శించారు. దానికి డీపీఎల్‌ (ప్రాజెక్టు పూర్తి రిపోర్టు) ఉందా అంటే అదీ లేదన్నారు. భవిష్యత్తులో 2.5 లక్షల కోట్లతో పూర్తి అవుతుందా? ఇంకా ఎక్కువ ఖర్చుపెట్టాలా? అనే దానిపై ఆలోచన చేసే పరిస్థితి లేదన్నారు. ఇంజినీర్ల సూచనల మేరకు ప్రాజెక్టు కట్టారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీ కింద ఇసుక కదిలిందనీ, అందుకే ప్రాజెక్టు కుంగిందని చెప్పిందన్నారు.
ఇసుక కదిలితే కూలిపోయేలా పేకమేడలు కట్టారా? అని ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన ప్రాజెక్టు కుంగిపోతే అక్కడకు ఎవ్వరూ వెళ్లకుండా వాఘా సరిహద్దుల్లో లాగా పోలీసు భద్రత పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. కుంగిన బ్యారేజీని ఎవ్వరూ చూడకుండా దాచిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పలు ఫిర్యాదులతో కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ డ్యామ్‌ సేప్టీ అధికారులను పంపగా వారు అధ్యయనం చేసి ఒక రిపోర్టు ఇచ్చారనీ, దాన్నీ గత ప్రభుత్వం తొక్కిపెట్టిందని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మంది అధికారులు ఫైళ్లను మాయం చేశారని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో ప్రభుత్వం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులను పంపి విచారణ చేయించిందని వివరించారు.
ఏ ఫైళ్లు మాయమయ్యాయి? ఎవరెవరు మాయం చేశారు? తదితర అంశాలపై అధికారులు విచారణ జరిపించి ప్రాథమిక నివేదిక ఇచ్చారని తెలిపారు. ఇప్పటి వరకూ కాళేశ్వరంలో ఏం జరిగిందో? అక్కడ ఏమైందో సభలోని చాలా మంది సభ్యులకు తెలియదన్నారు. అందుకే మేడిగడ్డ రిజర్వాయర్‌ సందర్శనకు రావాలని సభలోని అన్ని పక్షాల నేతలకు లేఖలు రాశామన్నారు. కాళేశ్వరం ప్రపంచంలోనే అద్భుతమంటూ న్యూయార్క్‌ స్క్వేర్‌, డిస్కవరిలో ప్రచారం చేయించారు కదా..ఆ అద్భుతం గురించి తెలంగాణ శాసనసభ, శాసనమండలి సభ్యులకు ప్రజలకు వివరించేందుకు మాజీ సీఎం కేసీఆర్‌ ముందుకు రావాలని విన్నవించారు.
తెలంగాణ సమాజానికి తాజ్‌మహల్‌ అంత అద్భుతాన్ని ఆవిష్కరించారు కాబట్టి కేసీఆర్‌, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి వచ్చి మేడిగడ్డలో ఉన్న పరిస్థితులను నిష్పక్షపాతంగా వివరించాలని కోరారు. మాజీ సీఎం కేసీఆర్‌ కారులోగానీ, బస్సులోగానీ రాలేని పక్షంలో ప్రత్యేకంగా హెలిక్యాప్టర్‌ కూడా సిద్ధంగా ఉంచామని చెప్పారు. కేసీఆర్‌ కుటుంబానికి కాళేశ్వరం ఏటీఎంగా మారిందనీ, కనకమేడలు గుప్పించింది అని తాము అనదలుచుకోలేదనీ, ప్రాజెక్టు గురించి కేసీఆర్‌ తన అనుభవాలను మేడిగడ్డలో అందరికీ వివరించాలని కోరారు. సీఎం ప్రసంగం అనంతరం స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ సభను బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. అనంతరం సీఎం నేతృత్వంలో మంత్రులు, కాంగ్రెస్‌, ఎంఐఎం, సీపీఐ సభ్యులు అక్కడకు వెళ్లారు.
ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చకు డిప్యూటీ సీఎం ప్రతిపాదన
ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చకు స్పీకర్‌ అనుమతి ఇవ్వాలని కోరుతూ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్కమార్క సభ ముందు ప్రతిపాదించారు. అనంతరం శాసనసభ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ..మేడిగడ్డ పర్యటనకు స్పీకర్‌ అనుమతివ్వాలని స్పీకర్‌ను కోరారు. ఇందుకోసం ప్రభుత్వం తరఫున ముందస్తు అనుమతి తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ పర్యటనకు అధికార పక్షంతో పాటు ప్రధాన ప్రతిపక్షం, ఇతర పక్షాల సభ్యులందరూ రావాలని విజ్ఞప్తి చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో ప్రజాధనం వృథా అయ్యిందని విజిలెన్స్‌ రిపోర్టు వచ్చిందన్నారు. డ్యామ్‌ సేప్టీ అధికారులు కూడా ప్రాజెక్టు డిజైన్‌లో, నిర్మాణంలో, నిర్వహణలో లోపాలున్నాయని ఎత్తిచూపిన విషయాన్ని ప్రస్తావించారు.