అభిరుచికి దూరమయ్యారా..?

Have you lost your passion?చాలామంది అమ్మాయిలు పెళ్లయ్యాక తమ అభిరుచులను, వ్యాపకాలను, స్నేహితులను, కొన్ని అలవాట్లనీ వదిలేసుకుంటారు. దానికి కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. దీంతో తామేదో కోల్పోతున్నామనే వెలితి వారిని వెంటాడుతుంది. అలాంటి ఒత్తిడికి దూరంగా ఉండాలంటే ఇలా చేయొచ్చు.
– ఓ మంచి స్నేహ బంధాన్ని కొనసాగించడానికి వారు మీ క్లాస్‌మేట్స్‌, పక్కింటివారో అయి ఉండాల్సిన అవసరం లేదు. అత్త, ఆడపడుచు, చెల్లి… ఇలా ఎవరికైనా ఆ స్థానాన్ని ఇవ్వొచ్చు. మీరే ఒక అడుగు ముందుకేసి మీ బంధాన్ని బలపరుచుకోండి. ఒంటరితనం దూరమవుతుంది.
– పెండ్లయ్యాక మీకిష్టమైన వ్యాపకాలను వదిలేసుకున్నాం అని భావించక్కర్లేదు. సాంకేతికత మీ ఇంటి ముందుకు అలాంటి అవకాశాలెన్నో తెచ్చిపెడుతుంది. ఇందుకోసం సామాజిక మాధ్యమాల వేదికగా ఎన్నో గ్రూపులు ఉన్నాయి. ఉదాహరణకు మీకు వంటలంటే ఇష్టమనుకోండి. మీ అభిరుచులకు దగ్గరగా ఉన్న పోస్టులను గమనించి ఆ బృందంలో సభ్యురాలిగా చేరండి. కొత్త విషయాలెన్నో తెలుస్తాయి. తోటపని ఆసక్తి అయితే గార్డెనింగ్‌ నెట్‌వర్క్‌లో చేరి మెలకువలు నేర్చుకోండి. మీరు పెంచిన మొక్కలనీ, వాటి ప్రత్యేకతల్నీ వారితో పంచుకోండి. మనసు తేలికపడుతుంది.
– వివాహమయ్యాక స్నేహితులందరికంటే వెనకబడిపోయాం అని భావిస్తారు చాలామంది అమ్మాయిలు. అసలు అలాంటి బెంగే అక్కర్లేదు. అంతర్జాలమే ఆధారంగా ఎప్పటికప్పుడు మీ చదువు, హాబీలకు సంబంధించిన వ్యాపకాల్ని సానబెట్టుకునే అవకాశం కల్పిస్తున్నాయి అనేక సంస్థలు. ఇంట్లోనే ఉండి మీకు నచ్చిన అంశాన్ని ఎంచుకుని వాటిపై దృష్టిపెట్టండి. ఉదాహరణకు ఓ కొత్త భాష లేదా కొత్త కోర్సు నేర్చుకోండి. ఇవన్నీ మీలో ఉత్సాహాన్ని నింపుతాయి.