క్రీడాభిమానులను నిలువున దోపిడీ చేస్తున్న హెచ్‌సీఏ బోర్డు

– క్రికెట్‌ హెచ్‌సీఏ బోర్డు, సంస్థలు చేస్తున్న అవినీతి అక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాలని నిరసన
– డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్‌, పీవైఎల్‌ జిల్లా కార్యదర్శులు షేక్‌ బషిరుద్దీన్‌, నలబాల రామకృష్ణ, రాజేష్‌
నవతెలంగాణ-ఖమ్మం
ఐపీఎల్‌ క్రికెట్‌ టికెట్స్‌ అమ్ముకుంటున్న హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ బోర్డ్‌ (హెచ్‌సీఏ), సన్‌ రైజర్స్‌ యాజమాన్యాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, హెచ్‌సీఏ బోర్డ్‌ అవినీతి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ నియమించి విచారణ జరపాలని డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్‌, పీవైఎల్‌ జిల్లా కార్యదర్శులు షేక్‌ బషిరుద్దీన్‌, నలబాల రామకృష్ణ, రాజేష్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం ఖమ్మంలోని గిరిప్రసాద్‌ భవన్‌ (సీపీఐ జిల్లా కార్యాలయం)లో క్రికెట్‌ హెచ్‌సీఏ బోర్డు, సంస్థలు చేస్తున్న అవినీతి అక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాలని ఆయా సంఘాల రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్‌, పీవైఎల్‌ వామపక్ష యువజన సంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్‌ లోని ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌ లకు సంబంధించిన టికెట్ల విక్రయాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఉప్పల్‌ స్టేడియంలో ఈ నెల 25 సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌- రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్ల మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌ జరగాల్సి ఉందని, ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను శుక్రవారం విక్రయానికి పెట్టారని, అయితే టికెట్లను పేటిఎంలో అమ్మకానికి పెట్టిన క్షణాల్లోనే టికెట్లను అమ్ముడు పోయాయంటూ బోర్డ్‌ ప్రకటించారని అనడం హాస్యాస్పదం అన్నారు. దాదాపు 36 వేలకు పైగా టికెట్లను అమ్మకానికి పెట్టిన అరగంట గంటలోపే ఏవిధంగా అమ్ముడుపోతాయో హెచ్‌సీఏ, సన్‌ రైజర్స్‌ యాజమాన్యాలు క్రీడా అభిమానులకు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంతకు ముందు ఉప్పల్‌ వేదికగా ముంబై, చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌ల సందర్భంగా కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైందని ఆరోపించారు. తక్షణమే బోర్డ్‌ టికెట్లకు సంబంధించిన వివరాలను పబ్లిక్‌ డొమైన్లో పొందుపరచాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా వ్యాపారంపై పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష యువజన సంఘాల జిల్లా నాయకులు చింతల రమేష్‌, శీలం వీరబాబు, కూరపాటి శ్రీనివాస్‌, మంద సురేష్‌, జక్కుల రవీందర్‌, మక్కా భరత్‌, గణపారపు ఉపేందర్‌, శ్రీనాథ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.