హెచ్‌సీఏ కమిటీని రద్దు చేయాలి

హెచ్‌సీఏ కమిటీని రద్దు చేయాలి– హెచ్‌సీఏ బోర్డ్‌, సన్‌ రైజర్స్‌ ఫ్రాంచైజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి : యువజన సంఘాల నేతల డిమాండ్‌
– ఉప్పల్‌ స్టేడియం వద్ద ఆందోళన
– నేతల అరెస్ట్‌.. విడుదల
నవతెలంగాణ-ఉప్పల్‌
ఐపీఎల్‌ టికెట్ల జారీలో పారదర్శకత లేకుండా వ్యవహరించినందుకు హెచ్‌సీఏ కమిటీని ప్రభుత్వం రద్దు చేయాలని, హెచ్‌సీఏ, సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఐపీఎల్‌ టికెట్ల జారీలో బ్లాక్‌ దందాను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ శనివారం డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్‌, పీవైఎల్‌ రాష్ట్ర యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం వద్ద నిరసన చేపట్టారు. ఈ విషయంపై హెచ్‌సీఏ అధ్యక్షులు జగన్‌ మోహన్‌రావుకు వినతిపత్రం అందించేందుకు స్టేడియం లోపలికి వెళ్లేందుకు యత్నించగా.. సిబ్బంది, సెక్యూరిటీ అడ్డుకున్నారు. దాంతో తోపులాట జరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం బోర్డ్‌ ఇన్‌ వార్డ్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ నారాయణకు మెమోరాండం అందజేశారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ మాట్లాడుతూ.. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూర్‌ జట్ల మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను గత శుక్రవారం పేటీఎంలో విక్రయానికి పెట్టారని తెలిపారు. అమ్మకానికి పెట్టిన క్షణాల్లోనే 36 వేలకు పైగా టికెట్లు అమ్ముడు పోయాయంటూ ప్రకటించారని చెప్పారు. అరగంట గంటలోపే అన్ని టికెట్లు ఎలా అమ్ముడుపోతాయో హెచ్‌సీఏ, సన్‌ రైజర్స్‌ యాజమాన్యాలు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఏఐవైఎఫ్‌ ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర మాట్లాడుతూ.. హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్‌ మధ్య సమన్వయం కొరవడిందని, టికెట్‌ జారీ చేసే సంస్థ పేటీఎం క్రికెట్‌ ప్రేమికులను పణంగా పెట్టి అంతర్గత విభేదాలను సద్వినియోగం చేసుకుంటోందని అన్నారు. బల్క్‌గా కార్పొరేట్‌ సంస్థలకు విక్రయించడం టిక్కెట్ల కొరతకు దారి తీస్తోందని, ప్రభుత్వం టిక్కెట్ల విక్రయాన్ని ఆధార్‌ కార్డులకు అనుసంధానం చేయాలని డిమాండ్‌ చేశారు.
డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోటా రమేష్‌ మాట్లాడుతూ.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యమే ఐపీఎల్‌ టికెట్ల అమ్మకాలలో నిర్లక్ష్యం వహిస్తే బోర్డు అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు నివేదిక ఇవ్వలేదో హెచ్‌సీఏ అధ్యక్షుడు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. పీవైఎల్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.కష్ణ మాట్లాడుతూ.. హెచ్‌సీఏ, సన్‌రైజర్స్‌ యాజమాన్యాల వికృత వ్యాపార క్రీడలో క్రీడా అభిమానులు ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు. తక్షణమే టికెట్లకు సంబంధించిన వివరాలను పబ్లిక్‌ డొమైన్‌లో పొందుపరచాలని, జవాబుదారీతనంగా ఉండాలని, లేకుంటే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా మెమోరాండం ఇవ్వడానికి వెళ్లిన నేతలను పోలీసులు అరెస్టు చేసి అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.సత్య ప్రసాద్‌, శ్రీమాన్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జావీద్‌, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర నేతలు గిరిబాబు, రవి, అజీమ్‌, సందీప్‌, పీవైఎల్‌ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు రవి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
ఉప్పల్‌ స్టేడియం వద్ద యువజన సంఘాల నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా ఆదివారం అన్ని జిల్లాల్లో నిరసనలు, పత్రిక సమావేశాలు నిర్వహించాలని సంఘాలు పిలుపునిచ్చాయి.