హెచ్‌డిఎఫ్‌సి రుణాలు ప్రియం

ముంబయి : ప్రయివేటు రంగంలోని విత్త సంస్థ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్లను (ఎంసిఎల్‌ఆర్‌)ను గరిష్టంగా 5 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. దీంతో ఆ బ్యాంక్‌ వడ్డీ రేట్లు 9.20 శాతం నుంచి గరిష్టంగా 9.50 శాతం వరకు ఉన్నాయి. కొత్త వడ్డీ రేట్లు 7 నుంచి అమల్లోకి వస్తాయని ఆ బ్యాంక్‌ తెలిపింది. ఓవర్‌నైట్‌ టెన్యూర్‌ ఎంసిఎల్‌ఆర్‌ను 5 బేసిస్‌ పాయింట్లు పెంచడంతో 9.15 శాతం నుంచి 9.20 శాతానికి చేర్చింది. కాగా.. ఈ ఒక్క టెన్యూర్‌పైనే బ్యాంక్‌ లోన్‌ వడ్డీ రేట్లు పెంచేసింది. ఇతర కాలపరిమితి ఎంసిఎల్‌ఆర్‌ మాత్రం యథాతథంగా ఉంచింది. ఒక నెల ఎంసిఎల్‌ఆర్‌ 9.20 శాతంగా ఉంది. 3 నెలల టెన్యూర్‌ ఎంసిఎల్‌ఆర్‌ 9.30 శాతంగా ఉంది. మూడేళ్ల కాలపరిమితి ఎంసిఎల్‌ఆర్‌ను 9.50 శాతంగా ఉంది.