– ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలి
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్
నవతెలంగాణ – హన్మకొండ
హన్మకొండ గోపాలపూర్ గుడిసెవాసులపై పోలీసుల దాడి అమానుషమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అన్నారు. శుక్రవారం హన్మకొండ న్యూశాయంపేట పరిధిలోని కందులబండ ప్రాంతాన్ని సీపీఐ(ఎం) నాయకులు బొట్ల చక్రపాణి, ఎం.చుక్కయ్య తదితరులతో కలిసి పోతినేని సందర్శించారు. అనంతరం ఓరుగంటి సాంబయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 30న రాత్రి పోలీసులు 100 మంది గుడిసెవాసులపై దాడి చేసి గుడిసెలను తగలబెట్టారని చెప్పారు. అలాగే ఈనెల 10న గోపాలపూర్ గుడిసేవాసులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు నిలువ నీడ కోసం వేసుకున్న గుడిసెలను తొలగించడం అన్యాయమన్నారు. నగరంలో విలువైన భూములను కబ్జా చేస్తున్న బాడాబాబులను వదిలి పేదలపై పోలీసులతో కలిసి అధికారులు జులుం ప్రదర్శిస్తున్నారన్నారు.
ఇల్లు లేని ప్రతి పేదవారికీ స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు నిర్మించే భాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. నగరంలో విలువైన ప్రభుత్వ భూములను, గుట్టలను చెరబట్టే భూకబ్జాదారులను వదిలి గుడిసెలు వేసుకున్న వారిపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మహాలక్ష్మి, గృహలక్ష్మి పథకం అమలు చేస్తామని హామీలు ఇచ్చారని.. తీరా అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 31న నూతన సంవత్సరం కానుకగా గుడిసెల్ని తగలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఎర్రజెండా అండతో ఇప్పటివరకు పేదవారికి 17600 పట్టాలు ఇప్పించామని పోతినేని చెప్పారు. హన్మకొండలోని పలు ప్రాంతాల్లో గుడిసెలు వేసుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పట్టా ఇప్పించే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గోపాలపూర్, న్యూ శాయంపేట గుడిసెవాసులపై జరిగిన దౌర్జన్యంపై హన్మకొండ జిల్లా కలెక్టర్‌ను కలిశామని, ఆ ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు న్యాయం చేయాలని కోరామని చెప్పారు. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారన్నారు. గుడిసె వాసులకు పట్టాల కోసం సంక్రాంతి పండుగ తర్వాత మొదటగా రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం చుడతామని చెప్పారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే ఆమరణ నిరహార దీక్షలకు కూడా వెనుకాడేది లేదన్నారు. సీపీఐ(ఎం) హన్మకొండ కన్వీనర్ బొట్ల చక్రపాణి మాట్లాడుతూ.. నగరంలో గుడిసె వేసుకున్న ప్రతి నిరుపేదకూ ప్రభుత్వం పట్టా ఇచ్చేవరకు పోరాడుతామని చెప్పారు.
ఈ సమావేశంలో సీపీఐ(ఎం) కార్యదర్శివర్గ సభ్యులు చుక్కయ్య, కాజీపేట మండల కమిటీ సభ్యులు ఓరుగంటి సాంబయ్య, భూ పోరాట కమిటీ సభ్యులు జంపాల మురళి, బచ్చు భాగ్యలక్ష్మి, విమల, రజిత, ఉమా, లలిత, రేణుక, మదన్, లక్ష్మి, స్వరూప, విజేందర్ తదితరులు పాల్గొన్నారు.