బడిపంతులు సినిమాలో టీవీలో బూచాడున్నాడనే పాట కాదు, ఇక్కడ అరచేతిలోని సెల్‌ఫోన్లల్లోనే ‘పెగాసస్’ బూచాళ్లే కాదు, స్థానిక బూచాళ్లూ నిండిపోయారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మోడీ 2001లో గుజరాత్ సీఎం అయిన తర్వాత ప్రారంభమైన ‘డీప్‌స్టేట్’ నమూనా నేడు దేశమంతా యధేచ్చగా విస్తరించింది. ఇప్పుడు మన రాష్ట్రంలో అదే హాట్‌టాపిక్. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అన్నట్టు పైకిఎన్ని తిట్లు, శాపనార్థాలు పెట్టుకున్నా మోడీ దారిలోనే గులాబీబాస్ వెళ్తారనేందుకు నిదర్శనం నేడు చర్చనీయాంశమైన ఫోన్ ట్యాపింగ్ లొల్లి.
కేంద్రంలోనీ మోడీ సర్కారు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూనే ఉంది. తన వికృత చేష్టలను కొనసాగిస్తున్నది. రాష్ట్రంలోని గత బీఆర్‌ఎస్ సర్కారు తమ అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి పాలన అడ్డంగా నడిపిందని చెప్పడానికి ఫోన్ ట్యాపింగే సాక్ష్యం. ఒకవైపు ఈడీ, ఐటీ, సీబీఐని ఉసిగొల్పి మోడీ, ఫోన్‌ట్యాపింగ్ ద్వారా కేసీఆర్ ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయని చెప్పడానికి ప్రస్తుతం దేశం, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. రాజ్యంలో పరిపాలనను సక్రమంగా అందించడానికి, శాంతిభద్రతలు కాపాడటానికి పోలీసులు, సైన్యం తదితర రాజ్యాంగ వ్యవస్థలు కావాల్సి రావచ్చు. అయితే వీటిని స్వార్థ రాజకీయాల కోసం దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్య భారతంలో పరిపాటైంది. సాధారణంగా శాంతిభద్రతల కోసం, తమ పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవడం, ప్రజలు ఏమీ కోరుకుంటున్నారో అంచనా వేయడం కోసం ఇంటెలిజెన్స్ వ్యవస్థ(నిఘా)ను వాడుకుంటారు.ఆ సంగతి వదిలేసి ప్రతిపక్షాలు, హక్కుల సంస్థల ప్రతినిధులు, మేధావులు, జర్నలిస్టులను టార్గెట్ చేస్తున్నాయి. జైల్లో పెట్టి పైశాచికానందాన్ని పొందుతున్నాయి. దేశాన్ని సరైన దిశగా నడిపించే చేతగాక తప్పుడు విధానాలు, అణచివేత చర్యలకు పాల్పడుతున్నాయి. అందుకే ప్రజల్లో నుంచి నిరసన, ఆందోళన గొంతుకలు ఉవ్వెత్తున లేస్తున్నాయి.
నేడు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఢిల్లీ, జార్ఖండ్ ముఖ్యమంత్రులపైకి ఈడీ, ఐటీ, సీబీఐని ఉసిగొల్పింది. ఇతర బీజేపీయేతర రాష్ట్రాల్లో అడ్డంపెట్టుకుని ఇబ్బందుల పాల్జేసేందుకు నిరంతరం మోడీ సర్కారు ప్రయత్నిస్తూనే ఉంది. తెలంగాణ అందుకు మినహాయింపు కాదు. గత పదేండ్ల బీఆర్‌ఎస్ ఏలుబడిలో ఫోన్ ట్యాపింగ్ జోరుగానే సాగింది. ప్రణీత్‌రావు అరెస్ట్, రక్షకులే భక్షకుల వుతున్న వైనాన్ని తేల్చిచెప్పింది. సామాన్య ప్రజల ఆదేదన, ఆక్రందన వినేవారేరి!? ఏ తప్పుచేయకున్నా వికలాంగు డైన ప్రొఫెసర్ సాయిబాబాను ఏండ్ల తరబడి జైల్లో వేసిన ఘనత మోడీ సర్కారుదే కదా. ఇప్పటి ప్రధాని, అప్పటి గుజరాత్ సీఎం అయిన నరేంద్ర మోడీ తన ముఖ్యకార్యదర్శి పీకే మిశ్రా సహకారంతో ఫోన్‌ట్యాపింగ్‌ను చట్టబద్దం చేసే వికృత ప్రక్రియకు 2003లోనే శ్రీకారం చుట్టారు. ఆ బిల్లును అప్పటి ప్రధాని వాజ్‌పెయి నిర్దద్వందంగా తిరస్కరిస్తూ, మళ్లీ గుజరాత్ అసెంబ్లీకి తిప్పిపంపారు.2008లో ప్రతిభాపాటిల్, 2015లో ప్రణబ్‌ముఖర్జీలూ వెనక్కికొట్టారు. చివరకు 2019లో రాంనాథ్ కోవింద్ చేత ఆమోదముద్ర వేయించుకుని పబ్బం గడుపుకునే పనిలో ఉన్నారు. ప్రతిపక్షనేతలు శంకర్‌సింగ్ వాఘేలా, హారేన్‌పాండ్యా లాంటి నేతల ఫోన్లు ట్యాప్ చేయడానికి ఆ బిల్లులను తెచ్చినట్టు రుజువైంది.
బీఆర్‌ఎస్ పాలనలో అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి సీఎం రేవంత్‌రెడ్డితోపాటు సెలెబ్రెటీలు, వ్యాపారులు, జర్నలిస్టుల తదితర ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేయడం సహించరానిది. సీఎం ఇంటికి 300 మీటర్ల దూరంలో నిఘా డెన్‌ను నడపడం కూడా దుర్మార్గం.
వ్యక్తిత్వాలను మంటగలిపి, కుటుంబాలను రోడ్డుకిడ్చే పనులుచేసే రాజకీయ నేతలు, పోలీసు అధికారులను న్యాయస్థానాల బోనులో నిలబెట్టాల్సిందే. అక్రమార్కుల సొమ్ముతో హవాలా రాజ్యాలను నడిపే హక్కు అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి లేదు. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి. బీఆర్‌ఎస్ సర్కారుకు మోడీ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చిందా? లేక లోపాయకారి ఒప్పందం మేరకు ఇద్దరూ కలిసే చేశారా? అలా కాకపోతే ఇజ్రాయిల్ నుంచి ఆధునిక పరికరాలను ప్రభాకర్‌రావు అండ్ కంపెనీ ఎలా తెచ్చారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది రాజ్యాంగం సాకారం చేసిన ప్రాథమిక హక్కు. ఆ హక్కుకు భంగం కలిగితే, నేరుగా తమ మెట్లు ఎక్కొచ్చంటూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అందరి మదిలో ఉండాలి. ఫోన్‌ట్యాపింగ్‌కు బాధ్యులైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌తో సహా నిందితులందరినీ కోర్టుకిడ్చి చట్టప్రకారం శిక్షించాల్సిందే.
అరచేతిలోనే బూచాడు
10:34 pm