చిత్రహింసలు పెట్టినా రహస్యాలు చెప్పలేదు

He did not tell secrets even if he was torturedసాయుధ రైతాంగ పోరాటంలో తమ కోసం పోరాడుతున్న కమ్యూనిస్టులను కాపాడుకు నేందుకు చిత్రహింసలు అనుభవించిన మహిళలు ఎందరో ఉన్నారు. దళాల జాడ చెప్పమంటూ చావబాదేవారు. జైల్లో నిర్బంధించి చింతబరికెలతో కొట్టేవారు. రక్తం కారుతున్నా తమ నాయకుల జాడమాత్రం చెప్పేవారు కాదు. అంతటి తెగవను చూపారు ఆనాటి మహిళలు. అలాంటి వారిలో దూడల సాలమ్మ ఒకరు.
వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న వృద్ధ విప్లవ నారి దూడల సాలమ్మ. ‘వీర తెలంగాణ మాది’ పుస్తకం వచ్చే నాటికి ఆమె వయసు 90 ఏండ్లు. సాలమ్మ పుట్టిన ఖలిషాపురం గ్రామం పోరాట కాలం నాటికి దేశముఖ్‌ల ఆధీనంలో ఉంది. కేశవరావు, రంగారావు, లింగాలరెడ్డి దొరలు దీన్ని పాలించేవారు. వారి ఏజెంట్లుగా దిద్దెంకి వీరయ్య, దుబ్బాక బక్కయ్యలు వుండేవారు. వారు దొరల వత్తాసుతో మహాక్రూరంగా ప్రవర్తించేవారు. వెట్టి చేయించేవారు. గౌడ కులానికి చెందిన సాలమ్మ పోరాట కాలం నాటికే భర్తను కోల్పోయింది. చిన్నవాళ్లయిన ఇద్దరు కొడుకులను సాకుతూ వుండింది.
ఆమె ఇల్లే పార్టీ కేంద్రం
దొడ్డి కొమరయ్య అమరుడైన తర్వాత పెరుమాండ్ల యాదగిరి, గుజ్జుల నారాయణ, గుజ్జుల వీరయ్యలు ఆంధ్ర మహాసభ సందేశాన్ని గ్రామానికి తీసుకొని వచ్చేవారు. ఆనాడు చకిలం యాదగిరిరావు, నల్లా నర్సింహులు, వడ్లకొండ నరహరి, రాంరెడ్డి, ముకుందరెడ్డి తరచూ గ్రామానికి వస్తుండేవారు. వారందరినీ సాలమ్మ సాదరంగా ఆహ్వానించి తగు ఏర్పాట్లు చేసేది. ఆనాడు ఆమె ఇల్లే పార్టీ కేంద్రంగా ఉండేది. అందువల్ల దొరల దృష్టి ఆమెపై పడింది.
చిత్రహింసలు పెట్టినా…
పోలీసుల అరాచకాలు పెరిగిపోవడంతో ఊరు నుండి రహస్యంగా పరారై నల్ల నర్సింహులు, గబ్బెట తిర్మల్రెడ్డి నాయకత్వాన వున్న కేంద్ర దళాన్ని కలిసింది. ఆ దళంలో తుపాకీ చేబూని పనిచేసింది. కామ్రేడ్‌ మల్లుస్వరాజ్యంతో ఈమెకు మంచి పరిచయం ఉంది. బైరాన్‌పల్లి హత్యాకాండ జరగటానికి ముందు రోజు దళంతోపాటు ఆమెకూడా అక్కడే ఉంది. రజాకారులు ఆమె ఇంటిని దోచేసి, ధ్వంసం చేశారు. ఆమె అన్ననే ద్రోహ బుద్ధితో గ్రామానికి రమ్మని ఆమెకు కబురుపెడతాడు. అన్న అసలు రూపం తెలియక సాలమ్మ దళం దగ్గర అనుమతి తీసుకొని ఊరికి వెళుతుంది. అలా వెళ్లిన ఆమెను మైసూరు పోలీసులు నిర్బంధించి చిత్ర హింసలు పెడతారు. అయినప్పటికీ ఆమె నుండి ఒక్క రహస్యాన్ని రాబట్టలేకపోతారు. అంతటి సాహస వనిత సాలమ్మ.