– ‘ఇంత అహంకారి నిజామాబాద్ ఎంపీగా వద్దు’ అంటూ పేపర్ పాంప్లెట్స్
– జగిత్యాలలో ప్రకటన కాగితాలు
– ‘నేను అద్దాలు పెట్టుకుంటే మీ తమ్ముడికి ఏం నొప్పి.. అంకుల్’ అంటూ ఎంపీ అరవింద్ ఫైర్
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
‘కండ్లకు ఉన్న కూలింగ్ అద్దాలు తీయడు.. కారు దిగి ప్రజలతో మాట్లాడడు.. ఇంత అహంకారి, నియంత.. ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా వద్దు’ అని ప్రింట్ చేసి ఉన్న పేపర్ పాంప్లెట్లు జగిత్యాల జిల్లాలో వైరల్ అయ్యాయి. ఇదే సమయంలో ‘నేను అద్దాలు పెట్టుకుంటే మీ తమ్ముడికి ఏం నొప్పి అంకుల్’ అంటూ సోషల్ మీడియా ద్వారా జీవన్‌రెడ్డిని ఉద్దేశిస్తూ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలూ అదేస్థాయిలో చర్చకు దారి తీశాయి. రానున్న నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి అర్వింద్, కాంగ్రెస్ నుంచి జీవన్‌రెడ్డి మధ్యనే పోటీ ఉండనున్నట్టు వస్తున్న సంకేతాలతో ఇరుపార్టీల మధ్య పొలిటికల్ వార్ మొదలైంది.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ గత లోక్‌సభ ఎన్నికల్లో వంద రోజుల్లోనే పసుపు బోర్డు తీసుకొస్తానంటూ బాండ్‌పేపర్ రాసిచ్చి మరీ ఫెల్యూర్ అయ్యారనే విమర్శ మొదలు.. మాటల్లో దూకుడు, దుర్భాష కూడా ఆయన పట్ల ప్రజల్లో కొంత చులకన భావం తెచ్చిందంటూ పార్టీ వర్గాల్లోనే చర్చ మొదలైంది. అందులోనూ ఇటీవల జగిత్యాల జిల్లాలోని కోరుట్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ క్రమంలో ఆయనకు తన సొంత పార్టీ సీనియర్ల నుంచి తిరుగుబాటు ప్రతికూలంగా మారుతోంది. మళ్లీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ బీజేపీ నుంచి ఆయనే పోటీలో ఉంటారనే సంకేతాలు వెలుడుతున్న క్రమంలో ఆయననుద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు ప్రింట్ చేసిన పేపర్‌పాంప్లెట్స్ జగిత్యాలలో వెలుగుజూడటం గమనార్హం. ‘నియంత ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీగా వద్దు’ అంటూ ఈ.కృష్ణమాచారి, పి.గంగాధర్, కె.శ్రీనివాస్, బి.రమేష్ పేర్లతో పేపర్‌పాంప్లెట్ సోమవారం ఉదయమే జగిత్యాల జిల్లాలో వెలుగుజూశాయి. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి న్యూస్‌పేపర్లతో కలిపి వాటిని కొందరు పంపిణీ చేశారు. క్షణాల్లోనే ఆ పాంప్లెట్ ఫొటోలు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొట్టాయి.
పాంప్లెట్ ఇష్యూపై ఎంపీ అర్వింద్ ఫైర్
‘జీవన్ రెడ్డి అంకుల్ నేను కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటే మీ తమ్ముడికి ఏం నొప్పి’ అంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేసిన ఆయన ‘మీరు ఎప్పుడు కలిసినా.. మీ ఆశీర్వాదం తీసుకునే వాడిని’ అలాంటిది తనలో అహంకారం ఎక్కడ కనబడిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ప్రశ్నించారు. ఇవే చివరి ఎన్నికలు అని చెబుతూ 2014 నుంచి వచ్చిన అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారంటూ విమర్శించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరం ప్రత్యర్థుల్లా తలపడినా ఎన్నికల ముందు ‘మీ ఆశీర్వాదం తీసుకుంటా’ అని చెప్పడం గమనార్హం.