ఆయన ఎవరికీ అర్థం కారు…!

– అంతా తానే…అన్నీ తానే
– ప్రజా ప్రతినిధులకు విలువే లేదు
– విమర్శలు సహించలేరు
భారతీయులందరూ ‘మణిపూర్‌’ వీడియోలో కన్పించిన దృశ్యాలను చూసి సిగ్గుతో తలదించుకున్నారు. దేశమంతా నివ్వెరపోయింది.కానీ ప్రధాని, పాలకపక్షం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పోనీ ప్రతిపక్షాల ప్రశ్నలకైనా స్పందిస్తారా అంటే అదీ లేదు. ప్రతిపక్షాల ప్రశ్నలన్నీ జాతి వ్యతిరేకమైనవని ఈ ‘విశ్వగురువు’ అభిప్రాయం. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాన్ని కోట్లాది మంది ప్రజలు ఎండగట్టారు. మోడీ ప్రభుత్వం సమస్యను ఎలా పరిష్కరిస్తుందా అని ఎదురు చూశారు. కానీ ప్రధాని చేసిందేమిటి? కంటితుడుపు మాటలు చెప్పి తప్పించుకున్నారు. పార్లమెంటులో ఆయన ఓ ప్రకటన చేయాలని ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో డిమాండ్‌ చేసినప్పటికీ సమావేశాల ప్రారంభానికి ముందు, చట్టసభ వెలుపల ఆయన రెండు ముక్కలు మాట్లాడి మమ అనిపించారు. ప్రధానమంత్రి స్వభా వమేమిటో చాలా మంది ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు. గతంలో పని చేసిన ప్రధానులు పార్లమెంటుకు జవాబుదారీగా వ్యవహరిస్తే మోడీ మాత్రం అలాంటి ప్రయత్నమే చేయడంలేదు. అసలు ఆయన ఎంపీలను, ఇతర ప్రజా ప్రతినిధులను విశ్వాసంలోకి తీసుకొన్న దాఖలాలే లేవు. అంతా తానే…అన్నీ తానే. యూరో పియన్‌ పార్లమెంటులో మణిపూర్‌ హింసపై చర్చ జరిగితే మన చట్టసభలో మాత్రం అందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. మూడు రోజులుగా సభా కార్యక్రమాలు స్తంభిస్తున్నాయి. అయినా ప్రధాని కానీ, ప్రభుత్వంలోని ఇతర పెద్దలు కానీ ఏ మాత్రం స్పందించడం లేదు. ప్రభుత్వ సంస్థలు సైతం జరుగుతున్న దారుణాలను చూస్తూ మౌన ప్రేక్షకులుగా మిగిలిపోతున్నాయి.