సమస్యలపై ప్రత్యక్ష పోరాటాలు చేశా

– అసెంబ్లీకి పంపిస్తే బడుగు జీవుల గొంతుకనవుతా
– ప్రచార సభల్లో సీపీఐ(ఎం) అభ్యర్థి మల్లు లక్ష్మీ
నవతెలంగాణ-హుజూర్‌నగర్‌రూరల్‌
మహిళా రిజర్వేషన్ల బిల్లు, ఆసరా పెన్షన్లు, సమభావనా సంఘాల రుణాలతో పాటు అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు చేసిన చరిత్ర తనకుందని, తనను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే బడుగు జీవుల సమస్యలను అసెంబ్లీల్లో ప్రస్తావించి పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని సీపీఐ(ఎం) హుజూర్‌నగర్‌ అభ్యర్థి మల్లులక్ష్మీ అన్నారు. మంగళవారం మండలపరిధిలోని అమరవరం గ్రామంలో ప్రారంభమైన ప్రచార కార్యక్రమం శ్రీనివాసాపురం, లింగగిరి, గోపాలపురం, బూరుగడ్డ, కరక్కాయలగూడెం, మర్రిగూడెం గ్రామాలలో జోరుగా సాగింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు టి.జ్యోతితో కలిసి ఆమె పలు సభల్లో మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికల్లో ప్రశ్నించే తత్వం, పోరాడే శక్తి ఉన్న తనను గెలిపించి అసెంబ్లీకి పంపాలన్నారు.బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు ప్రజలపై అనేక భారాలు మోపుతూ తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నాయని తెలిపారు. బీజేపీ ప్రజల మధ్య మత విధ్వేషాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుతున్నాయని పేర్కొన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య, దళితబంధు, దళితులకు మూడు ఎకరాల భూమి, రైతు రుణమాఫీ వంటి హామీలు పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు.ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే తనను అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీ బయట, లోపలా బడుగుజీవుల గొంతుకనవుతానన్నారు.సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తు పై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, డీవైఎఫ్‌వై రాష్ట్ర కార్యదర్శి కోట రమేశ్‌, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగారపు పాండు, కోట గోపి, ,చెరుకు ఏకలక్ష్మీ, జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి, మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్‌, జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి బ్రహ్మం, కొప్పుల రజిత, జె నర్సింహారావు, మేకనబోయిన సైదమ్మ, మేకనబోయిన శేఖర్‌, కొప్పుల రజిత, వ్యకాస జిల్లా అధ్యక్షుడు ముల్కపల్లి రాములు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు యం. రాంబాబు, డీవైయఫ్‌వై జిల్లా కార్యదర్శి బోయిళ్ళ నవీన్‌, నాయకులు, తంగేళ్ల వెంకటచంద్ర, మడూరి నర్సింహాచారి, పారుపల్లి శ్రీనివాస్‌రావు (శ్రీశ్రీ), పోసనబోయిన గోవిందమ్మ, షేక్‌ ఖాశీం, ఎల్లంశెట్టి వెంకటరమణ, వీరస్వామి, మీగడ రాములు, చింతకుంట్ల వీరయ్య, సిద్దెల వెంకటయ్య, చందాల భిక్షం, అన్నెపునేని మాధవరావు తదితరులు పాల్గొన్నారు.