పోరాటాల సాహిత్య చరిత్ర పరిశోధకుడు, విలువైన రచనలు తెలుగు సమాజానికి అందించిన ప్రజా రచయిత కె. ముత్యం. అట్టడుగు ప్రజలు నిర్మించే చరిత్ర, సాహిత్య చరిత్ర మౌఖిక రూపాల్లోనే ఎక్కువగా నిక్షిప్తమై ఉంటుందని, ప్రజల నాల్కల మీద ఆడుతుంటుంది. అలాంటి గాథలను, మౌఖిక కళా రూపాలను అన్వేషిస్తూ పోతే మహోన్నత పోరాటం కొత్త అర్ధాలతో కళ్ల ముందు నిలుస్తుంది. ఆ పోరాటాలు చేసిన మట్టి మనుషుల సాహసం దశ్యం కడుతుంది. ముత్యం పరిశోధక విద్యార్థిగా శ్రీకాకుళ ఉద్యమం, సాహిత్యం గురించి చేసిన పరిశోధన ఈ కోవకు చెందినదే. తెలుగు సాహిత్య కళారంగాలను శ్రీకాకుళ పోరాట సాహిత్యం అపారంగా ప్రభావితం చేసిందనే చారిత్రక సత్యాన్ని ఎవ్వరూ కాదనలేరు. అందువల్లే ముత్యం తన పరిశోధనను శ్రీకాకుళ సాహిత్య పరిశీలనతోనే మొదలుపెట్టారు. అక్కడి పోరాట వాస్తవికతను చాలా వరకు గ్రహించగలిగారు. నిజామాబాద్‌లోని బాచుపల్లికి చెందిన ముత్యం ఎంఏ తెలుగు విద్యార్థిగా ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టారు. అక్కడే విద్యార్థి ఉద్యమాలవైపు ఆకర్షితులయ్యారు. పీహెచ్‌డీ కోసం బెనారస్ యూనివర్సిటీలో చేరినప్పుడు ఆయన శ్రీకాకుళ ఉద్యమం- సాహిత్యంపై దాని ప్రభావం అనే అంశాన్ని ఎంచుకున్నారు. పీహెచ్‌డీ గ్రంథం ‘శ్రీకాకుళ ఉద్యమం – సాహిత్యం’ 1993లో అచ్చయింది. అనంతర కాలంలో శ్రీకాకుళం, ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఉద్యమ, సాంస్కతిక కార్యకర్తలు, నాయకుల జీవితాలను, వారి పోరాట అనుభవాలను ఈ తరానికి ఆయన అందించారు. ఆయనకు అట్టడుగు చరిత్రను, సాహిత్య చరిత్రను పరిశోధించే సంవిధానం పట్టుబడింది. ఆయన మిగతా రచనల్లో కూడా దాన్నే అనుసరించారు. ఆయనకు ముందు, ఈ విధమైన పరిశోధనా విధానాన్ని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో 1940ల్లో బెంగాల్ రచయిత్రి మహాశ్వేతాదేవి అనుసరించారు. ఆయన పరిశోధనలు సాగిన కాలం కూడా ప్రత్యేకమైనదే.