అతడు జీవిత ‘జ్ఞానం చెక్కిన శిల్పం’

Man is the measure of all things . అన్నింటికీ మనిషే కొలమానం. నేడు భౌతికంగా మనిషిచే సష్టించబడిన ప్రతిదీ ఒకప్పుడు తను అంతర్గతంగా ఆలోచన లోనో, ఊహలోనో సందర్శించినదే. ఆత్మహత్య అన్న అంశాన్ని వదిలిపెడితే, మనిషి పుట్టుక – మరణాన్ని నిర్ణయించుకొనే అధికారం సహజంగా ఉండదు. ఇక మిగిలింది జీవితంలో తను చేసే ప్రయాణాన్ని, మార్గాన్ని ఎన్నుకొనే స్వేచ్ఛ మాత్రమే. వెళ్ళే మార్గాన్ని ప్రభావితం చేసే వాటిలో తను పెరిగిన వాతావరణం, పెంచిన కుటుంబం కీలకమైనవైతే, చేసే ప్రయాణాన్ని ప్రభావితం చేసేది తనకున్న సంకల్పం, పట్టుదలలు. వీటిని నమ్ముకొని, అమ్ములుగా చేసుకొని ఒక నిరుపేద వ్యక్తి వేలమంది జీవితాల్లో వెలుగులు నింపాడు. అతడే తిరుపతి పాణిగ్రాహి. ‘జీరో నుంచి హీరో’గా ఎదిగిన అతడి విజయగాథను మెచ్చి యండమూరి వీరేంద్రనాథ్‌ ‘జ్ఞానం చెక్కిన శిల్పం’ జీవిత చరిత్రను రాశారు.

ఒకప్పటి తెలుగు ప్రాంతమైన పర్లాకిమిడిలో 1955 జులై 24న పురుషోత్తం-వినోదిని దంపతులకు జన్మించిన తిరుపతి పాణిగ్రాహి ‘ప్రాథమిక’ (ప్రైమరీ స్కూల్‌) దశ నుండే పేదరికం కుటుంబ భారన్ని మోపింది. సరిదిద్దడానికి, సూత్రప్రాయం చెయ్యడానికి ఉపాధ్యాయుడుండని ప్రపంచంలోకి తోసివెయ్యబడ్డాడు. ‘జీవితాన్ని’ భుజానికేసుకొని ఎంగిలి పళ్ళాలు, టేబుల్‌ బల్లలు శుభ్రపరిచే హోటల్‌ బారుగా జీవిత పోరాటాన్ని ప్రారంభించాడు. సహజంగా వచ్చిన పేదరికం కంటే ఒకప్పుడు బతికిన కుటుంబం ఎదుర్కొనే పేదరికంలో ఎక్కువ మానసిక సంఘర్షణ ఉంటుంది. సర్వర్‌గానే కాకుండా కిళ్ళీలు, పల్లీలు కూడా అమ్మాడు. కొంతకాలం తర్వాత తనే సొంతంగా చిన్న బడ్డీకొట్టు పెట్టడం, ఎదుగుతూ వస్తున్న తమ్ముళ్ళకు, చెల్లెలకు మంచి జీవితం కోసం ఇంకా ఏదో చెయ్యాలన్న తలంపుతో వ్యాపారం సొంతంగా చెయ్యడం మొదలుపెట్టాడు. ‘పాతాళ గరుడ’ అనే ఆయుర్వేద మూలిక సేకరణ కోసం అడవుల్లో క్రూరమగాలతో సహజీవనం, ‘కోణార్క్‌ సేమియా’ తయారీ కేంద్రం, రేషన్‌ షాపుల డీలర్‌షిప్‌, వ్యాపారస్తుల తూనిక-కొలతలు చక్కబెట్టడం… వంటి వాటితో పాటు మరికొన్ని కాంట్రాక్టులు ప్రభుత్వం నుంచి తీసుకొంటూ ఆర్థికంగా నిలదొక్కుకొంటూ అంచెలంచెలుగా పాణిగ్రాహి ఎదుగుతూ వచ్చాడు.
సవాళ్ళతో జీవితం మొదలైనవారికి కంఫర్ట్‌ జోన్‌ నచ్చదు. పాణిగ్రాహి కూడా అలాగే ఆర్థికంగా ఒక రంగంలో రాణిస్తున్నా అక్కడే నిలబడిపోవాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు. ముఖ్యంగా తను చదువుకోవలసిన సమయంలో ఏ కష్టాలు పడవలసి వచ్చిందో అవి ఇతరులకు రాకుండా చూడడంలో నా వంతుగా అన్నట్టు తల్లి వినోదిని పేర జూనియర్‌ కళాశాల, మెడికల్‌, నర్సింగ్‌ కాలేజ్‌లతో పాటు పలు ప్రాంతాల్లో ఆసుపత్రుల నిర్మాణం చేసి, సమాజానికి సాయపడ్డం మొదలుపెట్టారు. ముఖ్యంగా కోవిడ్‌ కాలంలో వీరు చేసిన సేవకు ఒడియ ప్రజలు, ప్రభుత్వం రుణపడిపోయింది. ఇవేవో ఇప్పటివారిలా వ్యాపారమే తొలి ధ్యేయంగా మొదలుపెట్టినవి కాదు. ప్రజలకు సేవచెయ్యాలనే తలంపుతో వారి ఆర్థికస్థితిని దష్టిలో పెట్టుకొని తక్కువ మొత్తంలో వైద్య సేవలు అందిస్తున్న సంస్థలు.
ªRead on History: nothing but Biography బెంజమిన్‌ డిస్రేలీ సూక్తికి అద్దంపట్టేలా ఈ జీవిత చరిత్రలో కూడా కాల ప్రవాహం నడిచే ‘చరిత్ర’ ఉంది. 1960-2000 మధ్య నాటి తెలుగు-ఒరియా సరిహద్దు ప్రాంతాల జీవన విధానం, ఏజన్సీ జిల్లాల్లో ఉండే ఘర్షణ, ‘అన్న’ల ప్రభావం, వారు నిర్వహించే ప్రజా కోర్టులు, అప్పట్లో ఉండే మద్యం సిండికేట్‌ పాలసీల కోసం పడే గొడవలు, దొంగ సారా కాంట్రాక్టులో ఉండే గుండాగిరి, తూకపు రాళ్ళను అదేపనిగా అరగదీయడం, కొలతలలో ఉండే తరుగుదల మోసాలు, గిరిజన ప్రాంతాల్లో ఉండే బలమైన రాజకీయ ఆధిపత్యాలు… మొదలైన ఎన్నో కోణాల్ని పాణిగ్రాహి అనుభవాల రూపంలో గమనించవచ్చు.
మనిషిని అర్థం చేసుకొన్నవారికి వ్యాపారం చెయ్యడం, రాజకీయం చెయ్యడం సులువు. పని చెయ్యడంలో నుంచే పాఠాలు నేర్చుకున్న పాణిగ్రాహి వ్యాపారంతో పాటు రాజకీయాలపైన స్థూలమైన అవగాహన పెంచుకొన్నాడు. తొలినాళ్ళలో కమ్యూనిజం వైపు ఆ తర్వాత కాంగ్రెస్‌, బీజు జనతాదళ్‌లో కీలకమైన వ్యక్తిగా కూడా ఎదిగారు. రాజకీయం అందరి జీవితాల్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చిత్తశుద్ధితో ఎదుగుతున్న వారిపై మరీ ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఒక దశలో రాజకీయ ప్రత్యర్థుల వల్ల సర్వం కోల్పోయి 18 నెలల పాటు జైలు జీవితం కూడా గడిపాడు. ఎన్ని సవాళ్ళతో కూడిన సందర్భాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో ముందుకు ఎలా సాగాలన్న విషయాన్ని ఈ తిరుపతి పాణిగ్రాహి జీవితం చెబుతుంది.
మనిషి ఎంత సంపాదిస్తూ పోతున్నా విలువలు, కుటుంబ జీవనం, నలుగురికి సాయం చెయ్యడం లేకుండా పోతే జీవితంలో సంతప్తి ఉండదని పాణిగ్రాహి జీవితం చూస్తే అర్థమవుతుంది. సొంత అమ్మ-నాన్నలే బరువైపోయిన కాలంలో తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వారి పిల్లలందరి ఆలనాపాలన చూస్తూ వస్తుండడం ఆప్యాయత అనుబంధాలకు ఆయన ఇచ్చే ప్రాధాన్యతను తెలియజేస్తుంది.
”తొమ్మిదేళ్ల వయసులో అమ్మ అన్నం ముద్దలు పెడితే తినాలని ఉంటుంది. ఆ వయసులో భోజన హోటల్‌ కౌంటర్లో కూర్చొన్నాను. పదేళ్ల వయసులో అమ్మానాన్నలతో కలిసి సినిమా చూడాలని ఉంటుంది. హాలు బయట కూర్చుని కిళ్ళీలు కట్టాను. పదమూడేళ్ళ వయసులో అమ్మ, నాన్నల దగ్గర పడుకోవాలని ఉంటుంది. అడవిలో గిరిజన తండా గుడిసెల్లో పడుకున్నాను’ (పుట: 130) – ‘ఒకప్పుడు ఏడుగురు కుటుంబ సభ్యులం చాలా చిన్న ఇంట్లో సర్దుకుని ఉండేవారం. ఇప్పుడు ఏడు పడగ్గదుల ఇంట్లో ఉంటున్నాము. ఒకప్పుడు పది రూపాయలకు తడుముకున్నాము. ఇప్పుడు వెయ్యిమంది విద్యార్థులకు స్కాలర్షిప్‌ ఇస్తున్నాము. ఇది స్వాత్కోర్ష కాదు. హోటల్లో టేబుల్స్‌ తుడుచుకునేవాడు జీవితంతో చేసిన కదన కుతూహల కేళి (పుట: 128)” పై రెండు పేరాలు చాలు పాఠకుడు ‘చదవాలన్న’ ఆసక్తి పడడానికి, ‘ఎందుకు చదవాలి?’ ప్రశ్నకు సమాధాన పడడానికి.
ఎవరికీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రకతిలో ఋతువుల వల్ల వచ్చే మార్పుల మాదిరినే జీవితంలో కూడా ఎత్తుపల్లాలు, గెలుపోటములు ఉంటాయి. పాణిగ్రాహి జీవితంలో బాలారిష్టాలు, సవాళ్ళు, సంతోషాలకి తగ్గట్టు ఋతువులతో ఉపమానం చేస్తూ చెప్పిన తీరు పాఠక ‘బిగువు’ను కలిగిస్తుంది. విలువైన ముడిసరుకు ఉన్నా సరైన పద్ధతుల్లో సరఫరా చేస్తేనే విజయవంతంగా వినియోగ దారుడికి చేరుతుంది. జీవితంలోని స్ఫూర్తిని పాఠక ప్రమాణాలతో అందించడంలో సిద్ధహస్తుడైన యండమూరి వీరేంద్రనాథ్‌ ‘జ్ఞానం చెక్కిన శిల్పం’ జీవిత చరిత్రకు రచయితగా విలువైన న్యాయమే చేశారు. అందుకు ఆయనకి, శ్రీశైలమూర్తికి (సహకార రచయిత) తిరుపతి పాణిగ్రాహితో పాటు పాఠకలోకం కూడా కతజ్ఞతలు తెలుపుకోవలసివుంటుంది.

– మదన మోహన్‌ రెడ్డి బుగడూరు
9989894308