అతనొక ధిక్కార ‘చరణం’

That's a contemptuous 'stanza'.”నేను ప్రేమిస్తాను. ప్రేమించడమంటే నిరసన తెలుపడమే. కోల్పోయిన వారిని జ్ఞాపకం చేసుకోవడమంటే ధిక్కారం ప్రకటించడమే. నిరంతరం జ్ఞాపకం చేసుకోవడం మన దినచర్యలో భాగమైతే, మనం దీర్ఘకాలిక పోరాటంలో భాగమై వున్నామని అర్థం” ఇవి దొంతం చరణ్‌ మాటలు. అతడు మనుషుల్ని ప్రేమిస్తాడు, గాయపడ్డ మట్టిని ప్రేమిస్తాడు. గాయపడ్డ పక్షుల్ని, ఎర్రని పొద్దుని ప్రేమగా నిమురుతాడు. వాటి గొంతులో మాటగా నిలుస్తాడు. వాక్యమై పచ్చని తీగమల్లె అల్లుకుంటాడు. సన్నని స్వరానికి జకిముకి పదాలతో నిప్పు సెగను జోడిస్తాడు. వడిసెలా ధిక్కారాన్ని వడి వడిగా ప్రకటిస్తాడు.
వట్టికోట ఆళ్వారుస్వామి నెత్తిన బుట్ట ఆ బుట్టలో పుస్తకాలను ఊరూరా పరిచయం చేసినట్టు, చరణ్‌ ఇప్పుడు అవసరమైన కవిత్వాన్ని, పిడికిళ్లలో సత్తువ నింపే కవిత్వాన్ని ప్రతి కొమ్మ, రెమ్మ దగ్గరకు తీసుకెళ్ళుతున్నాడు. సానుభూతి కాదు సంఘీభావం ముఖ్యమనే వాఖ్యాల్ని జీవంతో పలికిస్తున్నాడు.
అందరూ ఇష్టంగా రాసే ప్రేమ కవిత్వం, చెట్లు సెలయేళ్ళు, నెమళ్ళు అంటూ రాసుకుంటున్న చరణ్‌ కవిత్వం తరగతి గది చెత్త డబ్బాలో చేరింది. ఇల్లు అలికినట్టు అందంగా రాసుకున్న వాక్యాలు ఇంటి చెత్త డబ్బాలో చేరింది. కవిత్వం బువ్వ పెడుతుందా అన్న వాక్యాలు చరణ్‌ మనస్తత్వాన్ని ఏ మాత్రం చెరపలేకపోయాయి. ఆకురాయికి నూరిన గొడ్డలి మల్లె మరింత పదునెక్కాడు. అప్పుడే కవిత్వం ఏ వైపు నిలబడాలో, ఏ వైపున బిగ్గరగా నినదించాలో, ఏ వైపు కన్నీళ్లను పంచుకోవాలో ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకు కదిలాడు.
తన మొదటి కవిత్వ సంపుటి ‘మట్టి కనుగుడ్ల పాట’ను చదివితే చరణ్‌ ప్రయాణం ఎటువైపో అర్థమవుతుంది.
”నిజానికి నాలో దు:ఖం అనేది లేకపోతే కవినయ్యే మాట పక్కన పెట్టండి, అసలు నేను మనిషినయ్యే వాడినే కాదు. మనిషితనం కోల్పోతున్న సమాజంలోహొ ఉంటున్నాను. అట్లాంటి భయంకరమైన సమాజమే ‘నేను మనిషిని’హొ అని ప్రకటించుకొనేలా నన్ను తయారుచేసింది” అంటాడు చరణ్‌
నిజానికి చరణ్‌ కవితల్లో తల్లడిల్లె తనం కనిపిస్తుంది. కన్నీటి వేదన, నిరంతరం గమనంలో ఉండాలనే దఢమైన ఆలోచనలు, నిశ్శబ్దాన్ని అంగీకరించని తిరుగుబాటుతనం, బాధితుల పక్షాన బలమైన గొంతుకలా వుండాలనే స్పహ ఆ పుస్తకాల్లో కనిపిస్తాయి. చాలా Artisticగా, జీవంగా ఆ కవితలు ఉంటాయి. ఇలా మనుషుల్ని కన్నీళ్లను తిరుగుబాటుతనాన్ని నింపుకున్నాడు కాబట్టే ప్రజా ఉద్యమాలను, ప్రజాఉద్యమ నాయకులను కవిత్వంగా రాశాడు. తెలంగాణ గడ్డపై ఉవ్వెత్తున ఎగిసిన బెల్లి లలితను, ఆమె పాటను, ఆ ఆటను ప్రేమిస్తూ :
”పారేటి పాటలో వెతుకులాడుతాను/ నీ ధిక్కార చూపుల కొరకు,/ నాగేటి చాల్లల్లా ఈదుకుంటా వెతుకులాడుతాను/ పాట బాడుతూ నీ అభినయాలు రాసిన పోరులేఖల కొరకు” అని తెలంగాణ గొంతు అనే కవితలో తన వెతుకులాట గురించి రాసుకున్నాడు.
ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తూ, హక్కుల కార్యకర్తలపై, ప్రజాఉద్యమ నాయకులపై, మేధావులపై, జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించి, ప్రజాస్వామ్యాన్ని, మాట్లాడే గొంతులను అణిచివేస్తున్న నిరంకుశ ప్రభుత్వ విధానాలపై ఉగ్ర రూపుడయ్యాడు. నియంత హిట్లర్‌ను తలపించే నేటి ప్రభుత్వం పై ”నా నోట్లో బుక్కెడు రక్తాన్ని నింపుకొని/ రాజ్యం మొఖం మీద పుక్కిలించి ఉమ్ముతాను” అని అంటాడు. ఎంత తీవ్రమైన స్వరం ఇది. ఈ విధంగా చరణ్‌ కవిత్వం ఏ ఒక్క అంశానికో, ఏ ఒక్క ప్రాంతానికో, ఏ ఒక్క సమస్యపైనో పరిమితం కాలేదు. అపరిమితంగా ప్రపంచపు నలుమూలలా ఎక్కడ ఏ దశ్యం కలిచివేసినా, ఎక్కడ కన్నీరు ఉబికివస్తున్నా అక్కడ కవిత్వమై హత్తుకున్నాడు. రవి గాంచని చోట కవి గాంచునట అన్నట్టు దేశదేశాల కవిత్వాన్ని రాశాడు చరణ్‌. యుద్ధంలో నేలరాలుతున్న అమరులపై రాసిన కవితలే కాదు, LGBTQ లపై జరుగుతున్న అణిచివేతపై ధిక్కారాన్ని ప్రకటించడమే కాదు, ఆఫ్రికాలో ఇప్పటికీ కొనసాగుతున్న మూఢ నమ్మకాలపై, పసిపిల్లల యోనులకు కుట్లు వేసే ఘోరమైన ఆచారాన్ని వ్యతిరేకిస్తూ రాసిన కవితలు కూడా ఉన్నాయి.
సాధారణంగా పుస్తకాన్ని అచ్చువేసుకొని ఓ నాలుగు మాటలు రాసి ఆ పుస్తకాన్ని మన తల్లిదండ్రులకో, గురువులకో, ఆప్త మిత్రులకో అంకితం ఇస్తుంటాం. కానీ చరణ్‌ తన మొదటి పుస్తకాన్ని అమర ప్రజా గాయకులకు, అమరుల బంధు మిత్రుల సంఘానికి అంకితం చేశాడు. ఒకానొక సందర్భంలో నాకు మాట్లాడం నేర్పించింది, గొంతులో అక్షరమై నిలిచింది, తలొగ్గని నైజాన్ని నేర్పించింది వారే కాబట్టి వాళ్ళకి మించి నేను ఎవరికీ ఈ అక్షరాల్ని అంకితం చేయగలనని అంటాడు. చరణ్‌ పోరాటాల్ని- పోరు గీతాల్ని ఎంత ప్రేమిస్తాడో అర్థం అవుతుంది.
‘ఊహా చేద్దాం రండి’ కవిత్వ సంపుటి పై కె. శివారెడ్డి గారు మాట్లాడుతూ ”దొంతం చరణ్‌ మామూలుగా మనం మాట్లాడుకునే general poet కాదు. a kind of war poet. ముక్కలు ముక్కలైన బహిరంతరాల జీవితాల్ని చూయిస్తాడ”న్నాడు.
అవును ఆ పై వాక్యాలు ముమ్మాటికీ నిజం. ఎక్కడో ప్రపంచపు మూలన బాంబులు పడి పచ్చని గడ్డి రక్తంగా మారిన వేళ దొంతం చరణ్‌ కన్నీరు పెట్టాడు. అక్కడ విసరబడుతున్న మోటార్ల వలె, రాకెట్ల వలె, కురుస్తున్న తుపాకీ తూటాల వలె అక్షరమై కురిశాడు.హొఆహొభూభాగాన్ని గుండెకు హత్తుకొని నెత్తుటి చప్పుడుని విన్నాడు. అక్కడి తల్లుల పిల్లల నింగి నేల గోసను అమానవీయతను కరుకు హదయాల్ని కూడా కన్నీరు పెట్టేలా రాశాడు. అందులో భాగంగానే ‘కలలు చిగురిస్తాయి’ పాలస్తీనా సంఘీభావ కవిత్వ సంపుటిని తోటి మిత్రుల సహకారంతో యువ కవుల యుధ్ధ వ్యతిరేక కవితల్ని ఆవిష్కరించాడు.
Good night అనే కవితలో ”ఇవాళ అమ్మకు/ గుడ్‌ నైట్‌ చెప్పలేదు/ పిచ్చిది/ అలిగినట్టుంది పాపం/ పిచ్చిదే కానీ/ అలకతో కూడా/ అందంగా జో కొడుతుంది/ గర్భశోకాన్ని మోస్తూ..”
ఎంతటి విషాధమిది. పాలస్తీనా భూభాగం గాజాలో ఎక్కడ చూసినా శవాల గుట్టలే. సామ్రాజ్యవాదపు కోరల కిందా అగ్రరాజ్యాల కుట్రల కిందా కూరుకుపోయిన బిడ్డల తల్లుల గర్భశోకమిది. పోయినేడాది యుద్ధం మొదలైనప్పటినుండి ఇప్పటి వరకు పిల్లలు, తల్లుల మరణాలే గణంకాలుగా కనిపిస్తున్నాయి, 80 శాతం పైగా చిన్నారులు, గర్భాశయ కూనలు, మహిళలు ఆ బాంబులకు చిద్రమయ్యారు.
‘కాష్టం రగులుకుంది’ కవితలో ”దుఃఖంతో, ఆకలి కేకలతో,/ గాజా గుండెలు రగులుతుంటే/ ఆ పసి హదయాల పేగులు మండుతుంటే/ సూర్యగోళం సైతం చిన్నబోయింది!/ పేగులు పటపటమనే శబ్ధానికి/ ఉరుముల సత్తువ సన్నబోయింది!” ఈ విధంగా చరణ్‌ కవిత్వం ఆ భూభాగాన్ని హత్తుకుంది. ఓదార్పు వాక్యమై నిలించింది. కలలు చిగురిస్తాయి పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఎన్‌.వేణుగోపాల్‌ గారు మాట్లాడుతూ ”ఈ యువకవుల యుధ్ధ వ్యతిరేక కవితలు అక్కడి యుద్ధాన్ని ఆపగలవా? ఆపకపోవచ్చు!! కానీ మనుషులుగా మేమున్నామనే విషయాన్ని గుర్తుచేస్తుంది. కన్నీళ్లను పంచుకునే హదయాలు వున్నాయని తెలియజేస్తుంది. నిరసనగా, ధిక్కారంగా రాసిన వాక్యాలు ప్రభుత్వ మెదళ్లలో ఆలోచన రేకెత్తించి యుద్ధాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేసే విధంగా ఉంటుందని అన్నారు..
”గొంతులు సెన్సార్‌ అవుతున్నాయి./ గొంతు లోపల సత్యముంటే/ గొంతు కోసి గుంతలో వేస్తున్నారు/ తలలు సెన్సార్‌ అవుతున్నాయి./ మెదడులో జ్ఞానముంటే/ జైలుకు తరలిస్తున్నారు./ వేలిముద్రలు సెన్సార్‌ అవుతున్ాయి/ అవి దళితులవైతే/ చేతులు లేకుండా చేస్తున్నారు/ ప్రజల్ని కాదు పాలక వర్గంలో/ హంతకుల్ని సెన్సార్‌ చేయాలి/ మనిషినో ఇంటినో దేశాన్నో కాదు/ మనుధర్మాన్ని బుల్డోజ్‌ చేయాలి” అంటూ మాట్లాడే గొంతుకులపై కత్తి నూరుతున్న నిరంకుశ ప్రభుత్వాన్ని బహిరంగానే ఖండించాడు. తీవ్ర స్వరంగా కవిత్వంగా నిలుస్తున్నాడు. అందులో భాగంగానే ఇటీవల ఉ. పా కేసు నమోదు చేయబడి విచారణకు ఆదేశించబడిన జర్నలిస్ట్‌ రచయిత్రి బుకర్‌ ప్రైజ్‌ విన్నర్‌ అరుంధతి రాయికి మద్దతుగా ‘మాటలే దేశ ద్రోహమైతే’ కవిత్వ సంకలనం కూడా వెలువడింది. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా మనమందరం సంఘటితం కావాలని ఒకరికొకరం సంఘీభావంగా నిలవాలని ఈ పుస్తకం చరణ్‌ సంపాదకీయంలో తీసుకువచ్చారు. పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా మరో పుస్తకాన్ని కూడా చరణ్‌ త్వరలో తీసుకువస్తున్నారు. ”ఉదయించే ఊపిరి – యుధ్ధ కాలపు కవితలు”. దాసరి శిరీష జ్ఞాపిక 2024 ద్వారా సెప్టెంబర్‌ మొదటి వారంలో విడుదల కాబోతుంది.
ఈ విధంగా కవి, రచయిత, యాక్టివిస్ట్‌ గానే కాకుండా ఫోటోగ్రఫీ కూడా చేసున్నాడు. డిగ్రీ చదువుతున్న రోజుల నుండి ఫోటోగ్రఫీపై మక్కువ ఏర్పడి ప్రకతి ప్రేమికుడిగా చిత్రాలను తీసేవాడు. ఒకానొక సందర్భంలో కెమెరా అందుబాటులో లేనప్పుడు స్నేహితుల దగ్గర తీసుకొచ్చి ఫోటోలు తీసేవాడినని చరణ్‌ చెప్తాడు. ప్రజా ఉద్యమాల్లో, సంఘటిత సమావేశాల్లో పాల్గొన్నప్పుడు చరణ్‌ దష్టి మరలింది. అప్పటివరకు ప్రకతి ప్రేమికుడిగానే ఉన్న చరణ్‌, కవి దష్టి కోణంతో చిత్రాలను తీయడం మొదలు పెట్టాడు. జీవమున్న చిత్రాలను తీస్తూ ఎన్నో జ్ఞాపకాలను ఎన్నో భావోద్వేగాలను క్యాప్చర్‌ చేశాడు. ఈ విధంగా ప్రజల పట్ల, ప్రజల కన్నీళ్ళ పట్ల, ప్రజా ఉద్యమాల పట్ల చరణ్‌కి వున్న ప్రేమ, మానవీయత, అతని ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

– మహేష్‌ వేల్పుల, 9951879504