మట్టి తన గురించి, తన సారవంతమైన జీవితం గురించి, ఎద లోతుల్లోని గాయాల గురించి చెబితే ఎలా ఉంటుంది? నేల తన తోడూ నీడలైన వానపాములు, తేనెటీగలు, తుమ్మెదలు, సీతాకోక చిలుకల గురించి బెంగపడితే ఎలా ఉంటుంది? ఊట సెలిమెలు, సెలయేళ్లు, వాగులు, నదుల గురించి భూమితల్లి వెతుకులాడుకోవడం చూశారా? చెట్లు, అడవులు, పంటచేలు, పాడి ఆవులు, సమస్త జీవరాశుల బతుకు తెరువు ప్రమాదంలో పడిందని మట్టి గుక్కపెట్టి ఏడవడం మీరెప్పుడైనా చూశారా? నెర్రెలు బారిన నేలల్లో విరిగిన నాగలి ఆఖరి గుండెల చప్పుడు మీరెప్పుడైనా విన్నారా? వినాలనుకుంటే బెల్లి యాదయ్య కవిత్వం చదవండి.
ఒక గొర్రెల కాపరి కుటుంబానికి చెందిన యాదయ్య నేను గొర్రెల్ని కాస్తుంటాను అంటూ మెల్లగా మనల్ని కూడా తీసుకెళ్లి తన మందలో కలుపుకుంటున్నాడు. ఒకానొక బోధివక్షం దగ్గర మంద పెట్టి మనల్ని అందరిని రమ్మని తీసుకెళ్తున్నాడు. అక్కడ కాపలాగా మన చుట్టూ తిరుగుతూ అడవి రాగం ఆలపిస్తున్నాడు. నాగరిక ప్రయాణ స్వార్ధ ప్రమాదాల్లో గాయపడ్డ మనకు తన కవిత్వ ఔషధాన్ని పూసి నయం చేయపూనుకున్నాడు. నిజానికి అడవిలో గొర్రెల కాస్తూ, పశువులను మేపుతూ పెరిగిన యాదయ్యకు ప్రకతిని దగ్గరగా పరిశీలించే అవకాశం వచ్చింది. అందుకే తన కవిత్వంలో పంచ భౌతిక విషయాలు ప్రధాన వస్తువులు అయ్యాయి.
”నారుమడి నా పుణ్యక్షేత్రం/ పనిముట్లు నా ఆభరణాలు/ మట్టి నా స్పందన/ ఏటి ఊట నా పాట” అంటూ నారు మడిని తన పుణ్యక్షేత్రంగా ప్రకటించుకున్న ఏకైక కవి బహుశా బెల్లి యాదయ్య ఒక్కడే కావచ్చు. ఉదర పోషణ మాత్రమే తెలిసిన మహా పండితోత్తములకి కూడా నారుమడి విలువ తెలిసే అవకాశం ఉండదు. బెల్లి యాదయ్య ఉత్పత్తి కులాల నుంచి వచ్చిన వాడు కనుకనే ఇంత గొప్ప వాక్యం రాయగలిగాడు. పొలంలో యావత్ ప్రపంచానికి ఆహార ఉత్పత్తి జరుగుతుంది. అది కేవలం నెత్తురును చెమటగా మార్చినవారు మాత్రమే చేయగలరు. అలాంటి అన్నదాతలే పనిముట్లను ఆభరణాలుగా, గర్వంగా భావించుకోగలరు. వారికి ప్రతి రోజు మట్టిని ముట్టనిదే, మట్టి స్పర్శను ఆస్వాదించనిదే, ఏటి ఊటను చూడనిదే ఊపిరి ఆడదు అంటున్నాడు బెల్లి యాదయ్య. ”నాగరికత కుబుసం కత్తిరించి/ బతుకు పొరలనిండా మట్టివాసనలు గుభాళింపజేస్తాను/ కలం పట్టిన ప్రతిసారి/ పొలం వైపుకు వెళ్లి ఒక్క కోండ్రనైన దున్ని వస్తాను/ పదే పదే మట్టి గురించే మాట్లాడుతాను/ భావితరానికి మట్టి మీద గౌరవం పెరిగేలా గట్టిగా నూరిపోస్తాను/ మట్టి వారసత్వాన్ని నేను/ మట్టిని ధ్యానిస్తునే మరణిస్తాను”. ఇది కవి బెల్లి యాదయ్య వీలునామా వలె చెప్పవచ్చు. నాగరికత, యాంత్రికత పెరగడం వలన వ్యవసాయ దేశంలో వ్యవసాయం అన్నా, రైతన్నా తెలియని దుస్థితి తలెత్తింది. పాలకుల విధానాల ఫలితంగా రైతు కనుమరుగైపోతున్నాడు. పెరుగుతున్న నగరీకరణలో మార్బుల్స్, టైల్స్ తప్ప మట్టి స్పర్శ లేని తరం, రైస్ ఎక్కడ నుండి వస్తాయంటే ఫ్యాక్టరీ నుంచి అని చెప్పే తరం పుట్టుకొస్తుంది. కనుక నేల విడిచి సాముచేసే జీవితాల కళ్ళకు కమ్మిన ఆధునిక పొరలను కత్తిరిస్తానంటాడు. ఏసీ గదులు, ఏసీ ఆఫీసులు, ఎండ తగలని శరీరాల్లో చెమట రాక పూడిపోయిన స్వేదరంధ్రాలను తెరిపించి వాటికి మట్టివాసనలను గుభాళింపజేస్తా అంటున్నాడు. అందుకు కవిగా కలంపట్టిన ప్రతిసారి పొలం గురించి, రైతు గురించి, వ్యవసాయం గురించి ఒక్క వాక్యమైనా రాస్తానని బెల్లి యాదయ్య ప్రమాణం చేస్తున్నాడు. నేను మట్టి వారసత్వాన్ని కనుక మట్టిని ధ్యానిస్తూనే మరణిస్తానని ధైర్యంగా చెప్పిన సాహసికుడు. కవిత్వానికి కార్యాచరణకు తేడాలేని నిజాయితీ కలిగిన సాహిత్య కార్యకర్తగా యాదయ్య మనకు కనిపిస్తాడు.
”అడవి ఒక ప్రజాస్వామిక/ గిజిగానికీ మత్తగజానికీ సమవత్తమిచ్చే/ హక్కుల పత్రం/ అడవి ఒక విశ్వవిద్యాలయం” కొండల్ని కొల్లగొట్టి, అడవి గుండెలను పలగజీరి మైనింగ్‌ను సుందరదశ్యమని ప్రభుత్వాలే ట్రైనింగులిచ్చే ఈ రోజుల్లో అడవి ఒక ఆలయం అంటున్నాడు బెల్లి యాదయ్య. అడవి ఆలయం కనుక దాన్ని తగలబెట్టరాదు, కొల్లగొట్టకూడదని, పవిత్రంగా కాపాడుకోవాలని ఒక్క పాదంలో తేల్చి చెప్పేశాడు. అడవి ఒక ప్రజాస్వామిక అంటూ ప్రజాస్వామ్య రాజ్యాల ముఖం చిన్నబోయేలా చేశాడు. అడవి ఒక సహజసిద్ధమైన ప్రజాస్వామిక. గిజిగానిలాంటి చిన్న పిచ్చుకకుగానీ ఏనుగుకుగానీ సమాన స్థలాన్నిచ్చే హక్కుల పత్రం అడవి అంటూ మేధస్సు ఉన్న నాగరిక మనుషులను, రాజ్యాలను దెప్పిపొడుస్తున్నాడు. జననారణ్యం కంటే కీకారణ్యంలోనే జీవులకు సమన్యాయం దక్కుతుందని చెప్పకనే చెప్తున్నాడు. అడవి లౌకికని, అడవి ఒక విశ్వవిద్యాలయమని తీర్మానించాడు. ఇక్కడే యాదయ్య కవితా పరిజ్ఞానం మనం అర్థం చేసుకోవచ్చు. కవికి కవిత్వ పరిజ్ఞానం, కవితా నైపుణ్యం, నిర్మాణ సూత్రాలు మాత్రమే తెలిస్తే కవితా పరిజ్ఞానం ఉన్నట్టు కాదు. నిర్మానుష్యంగా ఉన్న పచ్చని అడవులను దోచుకుని, మానవజాతి మనుగడకు ముప్పుతెచ్చే విషయాలను, వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్న యోధులను కవితా వస్తువు చేయడమే నిజమైన కవితా పరిజ్ఞానం. అది బెల్లి యాదయ్యకు పుష్కలంగా ఉందని కనిపిస్తుంది.
”నీడల వల్లే/ చెట్లకంత గుర్తింపు/ తేమ వల్లే/ చెరువులకంత మంచిపేరు/ స్వచ్ఛత వల్లే/ పాలకంత తెలుపు/ మిత్రుల వల్లే/ మనిషికంత గెలుపు/ ఈ దారిన వస్తావో రావో మళ్ళీ/ దాహం తీర్చిన బావులకు ఓ సారి మొక్కు బెల్లీ” అంటూ ప్రకతి తత్వాన్ని, పరివర్తనకు కావాల్సిన చైతన్యాన్ని పాఠకులకు సహజమైన పోలికలతో చెప్పడంలో యాదయ్య సిద్ధహస్తుడు. ప్రజాసామాన్యంలో పుట్టి, పెరగడం మాత్రమే కాదూ, వారి మధ్యలో పని చేస్తుండడంతో పాటు ప్రజా చైతన్యం అనే లక్ష్యాన్ని కలిగి ఉండడం వల్ల ఇంత సహజంగా కవిత్వ సజన చేస్తున్నాడు. సామాన్యంగా కనిపించే అనేక విషయాల్లోపలి సరుకు, సరంజామాను సింపుల్‌గా తవ్వి గుట్టలుగా పోయగల దిట్ట యాదయ్య. నిజానికి ఆక్సిజన్ ఇస్తుందని దగ్గరకు పోతే మరింత ప్రాణవాయువు దొరుకుతుంది అని చెట్టు దగ్గరకు ఎవరూ వెళ్ళరు. మరి ఎందుకు వెళ్తారు? ఇంత నీడ దొరుకుతుందని వెళ్తారు. అందుకే నీడనిచ్చే చెట్టును కొట్టొద్దంటారు. ఊరు చుట్టూ చెరువుల్లో నీళ్ళుంటే అక్కడి నేలలో తేమ ఉంటుంది. భూమి పచ్చగా ఉంటుంది. ఫలితంగా పశు, పక్షాదులు బతుకుతాయి. పంటలు కూడా బాగా పండుతాయి. కాబట్టి మనుషులు కూడా ప్రకతి అంత సహజంగా జీవనం గడపాలని తన ప్రకతి తత్వాన్ని వినిపిస్తున్నాడు.
”డాలర్ బిస్కట్లను రసాయనాల్లో తుంచుకుని/ ట్విట్టర్ పార్కుల్లో/ ఎంతకాలం తిందాం/ అగ్రరాజ్యపు కుట్రకు వ్యతిరేకంగా/ కాపీ కాపీ మెదడు డప్పును వాయిద్దాం”. పాము గుడ్లను తిన్నట్టు ప్రపంచీకరణ (అమెరికా) మూడో ప్రపంచ దేశాలను తింటుంది. డాలర్ల సంపాదనలో ఏ భావాలను వ్యక్త పరచలేనితనం, అభావం, ముభావం మనల్ని చుట్టుకున్నది. నిజానికి సాటివారి గురించి పట్టించుకోని, సానుభూతి, సహానుభూతులను పొందలేని, కాంక్రీట్ కీకారణ్యంలో చిక్కికుపోయి వెలుగుల్ని చూడలేని ఒక డాట్ కామ్ సంతతి ఆవిర్భవించింది. ఇలాంటి పరీక్షా సమయంలో మన మాట్లాడలేనితనం ఉన్నది. ఇది స్వార్ధపు మనోవ్యాధో, ఫ్యాషన్ సుఖవ్యాధో కానీ ఇలాంటి అభావతకు ప్రకతి వైద్యం చేద్దాం, మనో వైకల్యాన్ని తొలగించుకుందాం. ఏసీల సౌకర్యాల్లో మెత్తబడిన మెదడు డప్పును ఎర్రని మంటల్లో కాపీ అగ్రరాజ్య కుట్రకు వ్యతిరేకంగా వాయిద్దాం అంటున్నాడు ఈ కవి. భయపడడానికి ఇక్కడకు రాలేదు మనం. పోరాడి భళ్లున తెల్లారే సూర్యున్ని చీకటి నుదుట దిద్ది రేపటితరం దోసిట్లో పెడతాం అని ఒక నిండైన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. యాదయ్య తొంభయ్యవ దశకం నుంచి ప్రపంచీకరణ దుర్మార్గాన్ని ఎండగడుతూ, అమెరికా మార్కెట్ వ్యతిరేక కవిత్వం రాసినవారిలో అగ్రగణ్యుల జాబితాలో నిలబడతాడు. ప్రపంచీకరణ వ్యతిరేక కవిత్వం పాఠకులకు అర్ధమయ్యే పద్ధతిలో రాస్తూ చైతన్యం రగిలించే నిబద్దత, నిమగత ఈయన సాహిత్యంలో మనకు కనిపిస్తున్నది. ఈ పనిని ఆయన రెండున్నర దశాబ్దాలకు పూర్వం నుండే చేపట్టి కొనసాగిస్తున్నాడు. అతడో ఆర్గానిక్ స్వరం, కవిత్వం ప్రజా ఉద్యమాల నరం. ఈ సెల్ఫ్ ప్రమోషన్ గ్లోబల్ అంగడిలో, ఆర్టిఫిషియల్ హడావిడి గుంపుల్లో వినపడకుండా పోయిన అతడి ఆర్గానిక్ స్వరం తోలు డప్పువలె కణకణ మోగుతూ ఈ ప్రపంచానికి మళ్ళీ మళ్ళీ వినిపించాలని కోరుకుందాం.
(తత్వకవి ఉదారి నాగదాసు స్మారక పురస్కారాన్ని సెప్టెంబర్ 15 న ఆదిలాబాద్ లో డా. బెల్లి యాదయ్య అందుకుంటున్న సందర్బంగా)
– ఎం. విప్లవకుమార్, 9515225658