– ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన దర్యాప్తు అధికారులు
– ఆయనతో పాటు రాధాకిషన్‌రావు, శ్రవణ్‌ల కోసం లుకౌట్ నోటీసులు జారీ
– ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశాం
– పరికరాలను ధ్వంసం చేశాం
– ఒప్పుకున్న నిందితుడు ప్రణీత్‌రావు
– రిమాండ్‌కు ఆయనతో పాటు ఇద్దరు అదనపు ఎస్పీలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన రాజకీయ ప్రముఖల ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 ప్రధాన నిందితుడిగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ ఐజీ ప్రభాకర్‌రావు పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. రెండో నిందితుడిగా డీఎస్పీ ప్రణీత్‌రావు, మూడో నిందితుడిగా హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, నాలుగు, ఐదో నిందితుడిగా మహబూబాబాద్ అదనపు ఎస్పీ బుజంగరావు, ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ తిరుపతన్న లను చేర్చిన అధికారులు.. ఆరో నిందితుడిగా ప్రయివేటు వ్యక్తి పేరును పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో ప్రణీత్‌రావును అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు అతనిచ్చిన వాంగ్మూలం మేరకు శనివారం రాత్రి బుజంగరావు, తిరుపతన్నలను కూడా అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు నిందితులను ఆదివారం ఉదయం కొంపల్లిలో గల నాంపల్లి కోర్టు 14వ మేజిస్ట్రేట్ నివాసంలో దర్యాప్తు అధికారులు హాజరుపర్చారు. ఇందులో పోలీస్ కస్టడీ ముగిసిన ప్రణీత్‌రావుకుఈనెల 28 వరకు, బుజంగరావు, తిరుపతన్నలకు ఏప్రిల్ 6 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌ను న్యాయమూర్తి విధించారు. దీంతో, ఈ ముగ్గురు అధికారులను చంచల్‌గూడ జైలుకు దర్యాప్తు అధికారులు తరలించారు.
రెండ్రోజుల ముందే అమెరికాకు ప్రభాకర్‌రావు, శ్రవణ్
ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కావటానికి రెండ్రోజుల ముందే మాజీ ఐజీ ప్రభాకర్‌రావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఒక ప్రయివేటు ఛానెల్ సీఈఓ శ్రవణ్‌కుమార్‌లు ఇక్కడి నుంచి చెన్నైకి వెళ్లి, అక్కడి నుంచి అమెరికాకు వెళ్లినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీంతో ఈ ముగ్గురి కోసం వేటను ప్రారంభించిన దర్యాప్తు అధికారులు..లుక్‌అవుట్ నోటీసులను జారీ చేశారు. అంతేగాక, ఈ ముగ్గురిని తీసుకురావటానికి ఇంటర్‌పోల్ సహాయాన్ని కూడా తీసుకుంటామని దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
రేవంత్‌రెడ్డి నివాసం సమీపంలో పరికరాలు అమర్చుకొని..
రాజకీయ ప్రముఖుల ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారాన్ని అప్పటి ఎస్‌ఐబీ ఓఎస్డీగా ఉన్న ఐజీ ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే నిర్వహించినట్టు ప్రణీత్‌రావుతో పాటు అదనపు ఎస్పీలు బుజంగరావు, తిరుపతన్నలు తెలిపినట్టు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా, ప్రభాకర్‌రావు ఇచ్చిన అనేక ఫోన్ నెంబర్లను తాము ట్యాపింగ్ చేసినట్టు ప్రణీత్‌రావు వెల్లడించాడు. ముఖ్యంగా, జూబ్లిహిల్స్‌లోని ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి నివాసం సమీపంలోని ఒక భవనంలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన పరికరాలను అమర్చుకొనీ, ఆయన ఎన్నికల సమయంలో ఎవరెవరితో మాట్లాడేది, ఆయన రాజకీయ ఎత్తుగడలను ట్యాపింగ్ చేసి ప్రభాకర్‌రావుకు అందజేసేవారమని తెలిపాడు.
కాంగ్రెస్‌తో పాటు ఇతర రాజకీయ నాయకులపై ఫోకస్
ఆ విధంగా, కాంగ్రెస్‌తో పాటు ఇతర రాజకీయ ప్రముఖులు, కాంగ్రెస్‌కు నిధులు అందజేస్తున్న వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లనూ ట్యాపింగ్ చేసి అందజేసేవారమని ప్రణీత్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అలాగే, బుజంగరావు, తిరుపతన్నలు ఇచ్చిన ఫోన్ నెంబర్లను కూడా ట్యాపింగ్ చేసి ఇచ్చేవాడినని తెలిపాడు. ప్రధానంగా, ఉప ఎన్నికలు మొదలుకొని అసెంబ్లీ ఎన్నికల వరకు, రేవంత్‌రెడ్డి మొదలుకొని కాంగ్రెస్ ప్రముఖల వరకు ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసి సమాచారమిచ్చేవాడినని చెప్పాడు. ఈ ట్యాపింగ్ వ్యవహారం పూర్తిగా ప్రభాకర్‌రావు పర్యవేక్షణలోనే జరిగేదని వివరించాడు. ఉప ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున జరిగే డబ్బుల పంపిణీని ఫోన్ ట్యాపింగ్ ద్వారా కనిపెట్టి, అవి పట్టుబడేలా సమాచారమందజేసేవాడినని తెలిపాడు.
‘అప్పటి రాజకీయ ప్రముఖుల ప్రేరణ మేరకే’
అధికార పార్టీకి చెందిన కొందరు రాజకీయ ప్రముఖుల ప్రేరణ మేరకు తాము ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడినట్టు బుజంగరావు, తిరుపతన్నలు తెలిపినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. ఆ ప్రముఖుల పేర్లను దర్యాప్తులో భాగంగా రహస్యంగా ఉంచారు. కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న సమాచారంతో.. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన హార్డ్ డిస్క్‌లు, ఇతర సాంకేతిక పరికరాలను ధ్వంసం చేయాలని ప్రభాకర్‌రావు ఆదేశాలిచ్చారని ప్రణీత్‌రావు తెలిపాడు. ఆ మేరకు కటింగ్‌ప్లేయర్లతో హార్డ్ డిస్క్‌లు, సాంకేతిక పరికరాలను ముక్కలుగా కట్ చేసి మూసీ నదిలో పారేసినట్టు ప్రణీత్‌రావు చెప్పాడు. ఈ పరికరాలను సమీకరించిన జూబ్లిహిల్స్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలోని దర్యాప్తు బృందం అందులోని సమాచారాన్ని వెలికి తీయటానికిగానూ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్) కు అందజేశారు.ఎఫ్‌ఎస్‌ఎల్ నుంచి అందే సమాచారాన్ని ఆధారంగా చేసుకొని కేసును ముందుకు నడిపించటానికి అధికారులు పూనుకున్నారు. అదేసమయంలో, అమెరికాలో ఉన్న ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు, శ్రవణ్‌లను కూడా అదుపులోకి తీసుకొని విచారించటం ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనక ఉన్న అప్పటి అధికార రాజకీయ ప్రముఖుల గుట్టును కూడా బయటపెడ్తామని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి.