జ్ఞానపీఠ్‌కు అన్ని విధాల అర్హుడు

He is fully deserving of Jnanpeethబహుముఖ ప్రతిభాశాలి గుల్జార్‌కు ఈ ఏడాది జ్ఞానపీఠ్‌ అవార్డు లభించడం సంతోషకరం. కవి, సినీ గేయ రచయిత, సంభాషణా రచయిత, కథా రచయిత, సినిమా దర్శకుడు, నిర్మాత మాత్రమే కాక ఆయన ఉర్దూ సాహితోద్యమకారుడు కూడా. ఆయనకు జ్ఞానపీఠ్‌ అవార్డు ఇవ్వడంలో సంఫ్‌ు పరివారానికి రాజకీయ కారణాలు ఉన్నప్పటికీ జ్ఞానపీఠ్‌కు గుజ్రాల్‌ నూటికి నూరు శాతం అర్హుడు. సిక్కు కుటుంబంలో పుట్టిన తనకు, తల్లిదండ్రులు పెట్టిన పేరు సంపూరణ్‌ సింగ్‌ కార్లా. కాగా పేరులో కుల మతాల ఛాయలు కన్పించరాదని తన పేరును గుల్జార్‌గా మార్చుకొన్నారు. పేరు మార్చుకోవడంలో అభ్యుదయ దృక్పధంతో పాటు సృజనాత్మకత కూడా కన్పిస్తుంది. గుల్‌ అన్నది తెలుగు వారికి సుపరిచితమే. అయినప్పటికీ విడమర్చినప్పుడే అది అర్ధమవుతుంది. గులేబకావళి కథలోని గుల్‌, గుల్జార్‌లోని గుల్‌ ఒకటే. గుల్‌-ఏ-బకావళి అంటే బకావలి చెట్టు యొక్క పువ్వు అని అర్ధం. మీఠాపాన్‌లో వేసే గుల్ఖన్‌ కూడా పూరేకులతో చేసేదే కదా! అందుకే దానికాపేరు. ఇక జర్‌ అంటే బంగారం, సంపద వగైరా అర్థాలున్నాయి. కవిత్వంతో పాటు గుల్జార్‌ చేపట్టిన అన్ని ప్రకియలూ తాజా గులాబీల్లా మంద్రంగా గుభాళిస్తుంటాయి.
సుప్రసిద్ద ఉర్దూ హిందీ నవలాకారుడు మున్సి ప్రేంచంద్‌ అధ్యక్షతన 1936లో ఇండియన్‌ ప్రోగ్రేసివ్‌ రైటర్స్‌ అసోషియేషన్‌ పిడబ్లుఏ ఏర్పడింది, ఆ తర్వాత ఇండియన్‌ పీపుల్స్‌ థి¸యేటర్‌ ఆర్స్ట్‌ ఏర్పడింది చిన్న వయస్సులోనే గుల్జార్‌ ఆ సంఘాల సంబంధాల్లోకి వచ్చారు. మోటూరు గారేజీలో పని చేసే గుల్జార్‌ ఆ సంఘాల్లోని కవులు, కళాకారుల సంపర్కంతో ఇంతింతై వటుడింతై అన్నట్టు చలన చిత్రరంగంలోనూ, ఉర్దూ సాహిత్య వినీల ఆకాశంలోనూ మిలమిల మెరిసే తారగా ఎదిగారు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న జీలం జిల్లా దీనా నుండి గుల్జార్‌ కుటుంబం దేశ విభజన తర్వాత ముంబైకి వలస వచ్చింది. తన కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులైనా గుల్జార్‌కు సాంప్రదాయ చదువులపై శ్రద్ధ లేదు. చిన్నతనం నుండే ఉర్దూసాహిత్యంపై మక్కువ. డిగ్రీ పూర్తి చేశాక సిఏ చేయమని కుటుంబం ఒత్తిడి చేసినా తన కాలేజీ చదువు ఇంతటితో సమాప్తం అని ప్రకటించాడు. ముంబైలో బతుకుదెరువు కోసం ఒక మోటారు గ్యారేజీలో చేరాడు. రాత్రిపూట గుడ్డి దీపం వెలుతురులో రోజువారి అద్దెకు దొరికే ఉర్దూ డిక్టెటివ్‌ నవలలు కూడా వదలకుండా చదివేవాడు.
తన కవిత్వంలో చిన్ననాటి జ్ఞాపకాలే మొదట్లో ఎక్కువగా ఉండేవట. గతంలోకి ప్రయాణించడం వల్ల అసలు విషయం నుండి కాస్త దృష్టి మళ్లినా దాని వల్ల ప్రేరణ కూడా లభిస్తుందని ఆయన చెప్తారు. బడికి వెళ్లే దారిలో కన్పించే చెట్టుతో సహా తాను గమనించిన వాటినే వస్తువుగా ఎంచుకొని కవిత్వం రాసేవాడట. కవి సమ్మేళనాలకు హాజరుకావడం తప్ప మున్ముందు వీడెందుకూ పనికి రాడని గుల్జార్‌ తండ్రి ఈసడించేవాడట. టెట్సీ చేయకపోయినా పర్వాలేదు. కనీసం నేవీలో నయినా చేరమంటూ అన్నయ్య ఇచ్చిన సలహానూ బేఖాతరు చేశాడు. నేవీలో చేరితే యూనిఫారం వేసుకోవాల్సి వస్తుందన్న భావనతో తాను అటు వైపే ఆలోచించలేదట. మోటూరు గ్యారేజీలో పనిచేస్తున్న దశలోనే సాహిత్యంలో ఎంఏ చేస్తున్న తన అన్న పుస్తకాలన్నీ చదివి ఆయనతో చర్చించేవాడు, ఇఫ్టాలోని బాసు భట్టాచార్య, సంగీత దర్శకుడు, రచయిత సలీల్‌ చౌదురి దర్శకుడు దేబుసేన్‌, కవి శైలేంద్ర, పంజాబ్‌ కవి సుఖ్‌బీర్‌లతో స్నేహం ఏర్పడింది. పిడబ్ల్యుఏ, ఇఫ్టాల్లో సభ్యుడయ్యాడు.
గుల్జార్‌కు సినీమా రంగంలోకి రావాలనే కోరిక లేదు. ఉపాధ్యాయుడిగా ఉద్యోగం లభిస్తే చాలు పుస్తకాలు చదువుకొంటూ, కవితలు రాసుకొంటూ కాలం గడపొచ్చని భావించేవాడట. 1960లో బందినీ సినిమాకు సంగీతం సమకూర్చుతున్న సచిన్‌ దేవ్‌ బర్మన్‌కు గేయ రచయిత శైలేంద్రతో పొరపొచ్చాలు వచ్చాయి. శైలేంద్ర రాయాల్సిన పాటను గుల్జార్‌తో రాయించుకొన్నారు బర్మన్‌. తాను ఊహిస్తున్న వైష్ణవ అధ్యాత్మికతను కుర్రాడైన గుల్జార్‌ అంటూ మొదట సందేహించినా ”మోరా గోరా అంగ్‌ లాయీలె, మోహె శ్యాం అంగ్‌ దాయి దే” అన్న పల్లవితో గుల్జార్‌ రాసిన పాట హిట్‌ అయింది. కానీ ఈ లోగా ఎస్‌డి బర్మన్‌, శైలేంద్రల మధ్య మళ్లీ సఖ్యత కుదిరింది. గుల్జార్‌కు ఒక్క పాటతోనే దారి మూసుకుపోయింది. అది గుర్తించిన ప్రఖ్యాత దర్శకుడు బిమల్‌ రారు తనకు డైరెక్షన్‌లో గుల్జార్‌ను సహాయకుడిగా పెట్టుకొన్నారు. తన మిత్రుడు ఒకరు గుల్జార్‌ను బిమల్‌ రారుకి పరిచయం చేసినప్పుడు బిమల్‌రారు నీవు టాగోర్‌ రాసిన ‘కాబూలీవాలా’ చదివావా అని అడిగారట. మొదట ఉర్దూలో ఆ తర్వాత ఇంగ్లీషు, బెంగాలీల్లో ఆ నవల చదివానని గుల్జార్‌ చెప్పారట. పంజాబీ అబ్బాయి బెంగాలీ నేర్చుకొన్నాడా? అని బిమల్‌ ఆశ్చర్యపోయాడట. ఇకనేం బాల్‌రాజ్‌ సాహ్ని హీరోగా తాను నిర్మించిన కాబూలీ వాలా చిత్రంలో గుల్జార్‌ చేత గుండెను పిండే తాత్విక ధోరణి గల ”గంగా ఆయే కహా సే రే గంగా జాయే కహా రే” అనే అద్భుత పాటను బిమల్‌ రారు రాయించుకొన్నారు. కాబూలీవాలా నవల నంతా ఒడిసిపట్టి మూడు చరణాల్లో సారాంశాన్ని చెప్పిన గొప్పపాట అది. ఆ తర్వాత పాటలు రాస్తూనే బిమల్‌ రామ్‌తో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, సంభాషణా రచయితగా కొనసాగారు. ఆ తర్వాత హృషికేశ్‌ ముఖర్జీతో కూడా గుల్జార్‌ అసిస్టెంట్‌గా పనిచేశారు. హిట్‌ పాటలెన్నింటినో గుల్జార్‌ రాశారు. స్లండాగ్‌ మిలియనీర్‌ చిత్రం కోసం రాసిన ‘జైహో’ అన్న పాటకు సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రహమన్‌ కలిసి గుల్జార్‌ 2010లో ఆస్కార్‌ అవార్డు అందుకొన్నారు. అదే పాటకు ప్రఖ్యాత గ్రామీ అవార్డు కూడా ఆయనకు లభించింది. 2002లో కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు, ఆరు సార్లు నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డులు, 22 సార్లు ఫిలింపేర్‌ అవార్డులను, 2004లో పద్మభూషణ్‌ అవార్డును అందుకొన్నారు. 2012లో ఇందిరా గాంధీ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ అవార్డు లభించింది. 2013లో చలన చిత్రరంగంలో అతి ప్రతిష్టాకరమైన దాదాసాహెబ్‌ పాల్కె అవార్డును అందుకొన్నారు.
తన 22 ఏళ్ల వయస్సులో సినిమా రంగంలోకి పాటల రచయితగా ప్రవేశించిన ఆయన ఎస్‌డి బర్మన్‌, సలీల్‌ చౌదురి, శంకర్‌ జైకిషన్‌, హేమంత్‌ కుమార్‌, లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ మదన్‌ మోహన్‌, రాజేశ్‌ రోషన్‌, అనుమాలిక్‌, శంకర్‌ ఇషాన్‌ – లారు, ఆర్‌.డి. బర్మన్‌, ఏ. ఆర్‌. రహ్మాన్‌, విశాల్‌ భరద్వాజ్‌లు సమకూర్చిన బాణీలకు పాటలు రాశారు. విశాల్‌ భరద్వాజ్‌ కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి. అనేక సిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఉర్దూలో గొప్ప పండితుడు. అలాగే సంగీతంపై కూడా పట్టుగలవాడు. ఏ ఆర్‌ రహమన్‌, విశాల్‌ భరద్వాజ్‌ల ట్యూన్లకు రాయడంలో గుల్జార్‌ చాలా ప్రత్యేకత చూపినట్లు చెప్తారు.
సంభాషణల రచయితగా గుల్జార్‌ తన ప్రతిభను చూపెట్టాడు. సినిమా దర్శకత్వంలోనూ ఆయనది ప్రత్యేక శైలి. మానవ సంబంధాలను సామాజిక అంశాలను సున్నితంగా కళాత్మకంగా చెప్పడంలో ఆయనది అందెవేసిన చేయి. కళ కళ కోసం కాదు దానికి సామాజిక ప్రయోజనం కూడా ఉంటుందని చూసి మెప్పించిన వాడు గుల్జార్‌. ఎమర్జెన్సీకి ముందు ఏర్పడిన రాజకీయ వాతావరణంలో ఆయన దర్శకత్వం వహించిన ‘ఆంధీ’ గొప్ప సంచలనం సృష్టించింది. అందులోని నాయిక పాత్ర ఇందిరాగాంధీ జీవితంతో పోలి ఉందని జనం భావించారు. ఆంధీతో పాటు సంజీవ్‌ కుమార్‌ హీరోగా ఆయన చాలా హిట్‌ సినిమాలకు దర్శకత్వం వహించారు. నిర్మించారు కూడా. మూగ చెవిటి వారైన పేద జంట పాత్రల్లో సంజీవ్‌ కుమార్‌, జయ బాదురి (ఆ తర్వాత జయా బచ్చన్‌ అయ్యారు)తో తీసిన కామోష్‌ (నిశ్శబ్దం) గుండెను పిండేసే సినిమా, షేక్స్‌స్పియర్‌ రాసిన ”కామెడి ఆఫ్‌ ఎర్రర్స్‌”ను భారతీకరించి నిర్మించిన ‘అంగూర్‌’ పూర్తి హాస్యభరిత చిత్రం. ఆ సినిమాలో సంజీవ్‌ కుమార్‌, దేవన్‌ వర్మ ఇద్దరూ ద్విపాత్రాభినయం చేశారు. అందులోని హాస్యం సున్నితమే అయిన చతురోక్తులు కడుపుబ్బ నవ్విస్తాయి. హాస్యం నిండిన సినిమాలు కూడా తాను అంతే ప్రతిభావంతంగా నిర్మించగలడని గుల్జార్‌ రుజువు చేశారు. మౌసం, మాచీస్‌లు కూడా ఆయన ప్రత్యేకతను చాటుతాయి. అంగూర్‌ కథ ఆధారంగా తెలుగులో చంద్రమోహన్‌తో ఒకసారి రాజేంద్రప్రసాద్‌తో మరోసారి రెండు సినిమాలు తీశారు.
రెండవ ప్రపంచ యుద్ధం నేపధ్యంలో నిర్మించిన ప్రఖ్యాత చిత్రం ‘సౌండ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌’ ఆ కథను కూడా భారతీకరించి పరిచరు ‘పేరుతో గొప్ప సినిమా నిర్మించారు. తన మొదటి చిత్రం (మేరే అప్పే) లోనే మీనా కుమారిని ఎంచుకొన్నారు. నిరుద్యోగంతో ముసలి తల్లులను పిల్లలు పనిమనుషులుగా ఎలా మార్చుతారో చెప్పే సినిమా అది. తెలుగులో బడిపంతులు, జీవన తరంగాలు వంటి సినిమాల్లో కన్పించని సున్నితత్వం మేరే అప్నేలో ఉంటుంది. అలాగే పిల్లలను ఎలా పెంచాలో సున్నితంగా చెప్పే సినిమా ‘కితాబ్‌’ నిర్మించారు. ఇజాజత్‌ మౌసం మీరా వంటి సినిమాలు కూడా మానవ సంబంధాలను సున్నితంగా చెప్పిన కావ్యాలే. ఉర్దూ సాహిత్యంపై ఎంతో కృషి చేశాడు కనుకే ఉర్దూ కవి మిర్జా గాలిబ్‌ పై దూరదర్శన్‌ కోసం అద్భుత సీరియల్‌ నిర్మించారు. గాలిబ్‌గా నసీరుద్దీన్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సీరియల్‌లో గుల్జార్‌ రాసిన ఉర్దూ సంభాషణలు, నసీరుద్ధీన్‌ ఉర్దూ ఉచ్ఛారణ చెవులకు విందు చేస్తాయి.
గుల్జార్‌ పాటల్లోనూ, సినిమాల్లోనూ మనస్సును కరిగించే సున్నిత అంశాలే కాదు వాటిలో అభ్యుదయ దృక్పధం కూడా ఉంటుంది. 1973లో ఆయన నటి రాఖీని పెళ్లాడారు. వారి ఏకైక పుత్రిక మేఘ్నా గుల్జార్‌ కూడా దర్శకురాలు. గుల్జార్‌ చేసిన రచనలు రావి పార్‌ (రావి నదికి ఆవల), ఏ పోయం ఏ డె, త్రివేణి, మిర్జా గాలిబ్‌, హజార్‌ రాహే ముడ్‌ కె దేఖె వంటివి ఉన్నాయి. రవీంద్రనాద్‌ ఠాగోర్‌ రాసిన చిత్ర క్షణిక, సోనార్‌ తరి కవితా సంపుటాల నుండి కొన్ని కవితలను ఎంపిక చేసి గుల్జార్‌ ఉర్దూలోకి అనువదించారు. వాటిని బాగ్‌బాన్‌ పేరుతో ఒక పుస్తకంగా తెచ్చారు. ఉర్దూలో ఆయన రాసిన కథలను గుల్జార్‌ కథలు పేరుతో సి.మృణాళిని తెలుగులోకి అనువదించారు. గజల్స్‌లో కూడా గుల్జార్‌ది అందే వేసిన చేయి. గుల్జార్‌కు జ్ఞానపీఠ్‌ అవార్డునివ్వడం వెనుక బిజెపికి రాజకీయ ప్రయోజనం ఉంది. దానివల్ల పంజాబీలపై ఉర్దూ సాహిత్యభిమానులపై రాజకీయ ప్రభావం ఉంటుందని పరివార్‌ ఆలోచన కావచ్చు. గుల్జార్‌తో పాటు సంస్కృత పండితుడు రామభద్రాచార్యకు జ్ఞాన్‌పీఠ అవార్డును ప్రకటించారు. తద్వారా అంతగా తెలియని రామభద్రాచార్యను గుల్జార్‌ వంటి బహుహుఖ ప్రజ్ఞాశాలి పక్కన కూర్చోబెట్టారు. దాని వెనుక ఉన్న రాజకీయం ఏమిటో సులభంగానే అర్ధమవుతుంది.
– ఎస్‌. వినయ కుమార్‌ ,
99897 18311